– స్వాతంత్య్ర దినోత్సవాన అబద్ధాలాడిన ఏకైక సీఎం రేవంతే
– దేవుడి మీద ఒట్టు పెట్టి రైతులను మోసం చేశాడు
– వంద శాతం రుణ మాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా చిల్లర మాటలతో పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటన్నారు. గాంధీ, పటేల్, నెహ్రూ వంటి మహనీయులను తలచుకోవాల్సిన రోజున రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తెరలేపారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారంటూ సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి సరిగ్గా సాయంత్రం 4.20 గంటలకు ప్రసంగం ప్రారంభించి పూర్తిగా 420 మాటలే మాట్లాడారని ఎద్దేవా చేశారు. నాడు కేసీఆర్ ఆగస్టు 15న అభివృద్ధి, సాగునీరు, విద్యుత్ గురించి మాట్లాడేవారని, కానీ రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా సంగారెడ్డిలో చెప్పలేదని విమర్శించారు. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేశారని, నేడు నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో రెండు, మూడు రోజులకొకసారి కూడా నీళ్లు రాని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ఈ మూడేళ్లలో మూలకు పడేశారని, వాటి గురించి ఒక్క ముక్క కూడా సీఎం మాట్లాడలేదని అన్నారు. ఏడాది క్రితం జహీరాబాద్‌కు వచ్చి కోతలు కోశారని, వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. కాంగ్రెస్ వచ్చాక కొత్తగా ఒక్క కిలోమీటరు రోడ్డు కూడా వేయలేదన్నారు. అసెంబ్లీలో కొత్త రేషన్ కార్డుల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారని, 20 లక్షల మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. కానీ సీఎం మాత్రం పబ్లిక్ మీటింగ్‌ల్లో అబద్ధాలు ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో మనిషికి నాలుగు కిలోల బియ్యం, కుటుంబానికి 20 కిలోల సీలింగ్ ఉండేది. కేసీఆర్ వచ్చాక సీలింగ్ ఎత్తివేసి మనిషికి 6 కిలోల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం ఇచ్చారన్నారు. అసెంబ్లీలో తానే స్వయంగా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని చెప్పారు. కానీ నిన్నటి సభలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. నిరుద్యోగులను మోసం చేసినందుకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ రాహుల్ పత్తాలేడని వ్యాఖ్యానించారు. మీకు దమ్ముంటే గన్ మెన్లను వదిలేసి అశోక్ నగర్, దిల్‌సుఖ్ నగర్, ఓయూ దగ్గరికి వస్తారా అని సీఎంకు ఆయన సవాల్ విసిరారు. రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. కాంగ్రెస్ పెట్టిపోయిన బకాయిలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని, ఇప్పుడు కొత్తగా ఇస్తానంటున్న సీఎం గత రెండున్నరేళ్ల బకాయిల సంగతి ఎప్పుడు చెబుతారని ప్రశ్నించారు.
కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ రైతుబంధు ఇచ్చానని సీఎం అబద్ధాలు ఆడుతున్నారంటూ కేసీఆర్ ప్రభుత్వం 2022-23లో రూ.14,743 కోట్లు ఇస్తే రేవంత్ రెడ్డి 24-25లో కేవలం రూ.5,557 కోట్లు, 25-26లో రూ.11,000 కోట్లు ఇచ్చారని, రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.15 వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడు రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో రూ.35 వేల కోట్లు రుణ మాఫీ కోసం పెట్టామని చెప్పి కేవలంరూ. 20 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. దమ్ముంటే.. గన్ మెన్లు లేకుండా నీ ఊరికి వస్తావా రేవంత్ రెడ్డీ.. నీ ఊళ్లో అందరికీ రుణ మాఫీ జరిగిందని తేలితే నేను అక్కడే రాజీనామా చేస్తా.. లేదంటే నువ్వు చేస్తావా అని హరీష్‌రావు సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సీఎం గొప్పలు చెబుతున్నారు. రాఘవాపూర్, నర్సాపూర్, బొమ్మల రామారం సబ్ స్టేషన్లలో తాను లాగ్ బుక్స్ పరిశీలిస్తే ఎక్కడా 10-11 గంటలకు మించి వ్యవసాయానికి త్రీ-ఫేజ్ కరెంట్ రావడం లేదని చెప్పారు. రెండు యాసంగిలకు బోనస్ ఎగ్గొట్టారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా రూ.2500 ఇస్తామని చెప్పి 32 నెలలు గడిచినా ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. నాలుగు వేల మంది మహిళలకు బీమా పెండింగ్ లో ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో దోపిడీ గురించి, కమీషన్ల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ స్వయంగా చెబుతున్నారని, మీ నాయకులు చెబుతున్న నిజాలు మీకు వినబడటం లేదా అని నిలదీశారు. మైనింగ్ స్కామ్, 22A, రుణమాఫీ, ఎరువులు, స్కాలర్ షిప్ లపై నేను నిలదీస్తుంటే తట్టుకోలేక తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ఇలాంటి చిల్లర మాటలకు నేను భయపడనని, ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం బీఆరఎస్ పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కచ్చితంగా పరువు నష్టం దావా వేస్తాననన్నారు. జిల్లాకు వచ్చినప్పుడు రోడ్లు, తాగునీరు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి కా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తగదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





