– అభివృద్ధి, సంస్కరణలను అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజం
– బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : అంతర్జాతీయ దౌత్యంపై కనీస అవగాహన లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ కి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చవకబారు చేష్టలకు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలుపెరగని నాయకుడిగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల అధినేతలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుస్తూ దేశ గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తుంటే రాహుల్ గాంధీ వెకిలి చేష్టలు, నాటకాలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, ఆరఎసఎస్ సంస్థలను కమెడియన్లు, జోకర్లు అంటూ విమర్శిస్తున్నారని, వాస్తవానికి రాజకీయాల్లో జోకర్ పాత్ర పోషిస్తున్నది రాహుల్ గాంధీనేనని దుయ్యబట్టారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు వందసార్లకు పైగా ఓడించినా బుద్ధి మారలేదని విమర్శించారు. పార్లమెంటులో ప్రజాప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు రాకుండా అడ్డుపడుతూ దేశానికి ‘రాహు కేతువు’గా మారారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ఆదా చేసి అభివృద్ధిని వేగవంతం చేసే ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన’ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రులు, మంత్రులు అవినీతికి పాల్పడి 30 రోజులు జైలులో ఉంటే వారిపై చర్యలు తీసుకునే నిబంధనలపై చర్చ జరగకుండా జేపీసీని కూడా అడ్డుకుంటూ అవినీతికి కాంగ్రెస్ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణలు, ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల కోసం తెచ్చిన త్రిపుల్ తలాక్ రద్దు, పెద్ద నోట్ల రద్దు, వన్ నేషన్ వన్ రేషన్, డిజిటల్ లావాదేవీలు, జాతీయ భద్రత కోసం తెచ్చిన విదేశీ నిధుల నియంత్రణ వంటి ప్రతి చరిత్రాత్మక సంస్కరణలపై, బిల్లులపై రచ్చ చేస్తూ అడ్డుకున్నారని మండిపడ్డారు.
‘నారీ శక్తి వందన్’ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, ఇండీ కూటమి
మహిళలు యుద్ధ విమానాలు సైతం నడుపుతున్న తరుణంలో వారికి చట్టసభల్లో 33% ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని మోదీ చరిత్రాత్మక నారీ శక్తి వందన్ అధినియం బిల్లును తీసుకొస్తే ఆ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయని నిప్పులు చెరిగారు. గతంలో యూపీఏ హయాంలో మహిళా అధ్యక్షురాలి నేతృత్వంలోనే మహిళా బిల్లు ప్రతులను చించివేసిన చరిత్ర ఈ పార్టీలదన్నారు. మొన్నటి సమావేశాల్లోనూ నీట్ పరీక్షలు, అయోధ్య రామమందిరం అంశాలు అంటూ విమర్శలు చేస్తూ రోజుకో పసలేని సాకుతో సభా సమయాన్ని వృథా చేశారని విమర్శించారు. యాభయ్యేళ్లుగా పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) చేపట్టి దేశవ్యాప్తంగా 800పైగా ఎంపీ స్థానాలను, తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను రాజ్యాంగబద్ధంగా పెంచుతామన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని బట్టి సీట్లు పెంచాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వాదనలు విడ్డూరంగా ఉన్నాయని లక్ష్మణ్ కొట్టిపారేశారు.
సనాతన ధర్మంపై దాడి – రేవంత్ రెడ్డి ‘రెండు కళ్ల సిద్ధాంతం’
ఏఐసీసీ కాస్తా యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీగా మారిపోయిందని లక్ష్మణ్ విమర్శించారు. సాధువులు, సన్యాసుల వేషాలు వేసి సనాతన ధర్మాన్ని కించపరిచారన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో హిందువులను, సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారని, రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. 4% ముస్లిం రిజర్వేషన్లT కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని, గుజరాత్లో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు లేవని, వెనుకబడిన వర్గాలకు ఇచ్చే బీసీ రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయనే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. సమావేశంలో శాసనమండలి సభ్యుడు అంజిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పల్నాటి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





