- ఏ చిన్న పొరపాటు జరిగిన ఉపేక్షించబోం..
- గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణలతో నవశకానికి శ్రీకారం
- అదనపు ఎమ్మార్వోల నియామకం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : : ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమి పై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ఇల్లు, భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో జరుపుతున్న సమీక్షలో భాగంగా గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ ఇన్ ఛార్జి మంత్రి ఎస్సీ ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్, వాకాటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేలి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించాలని, జిల్లా స్థాయిలో అధికారయంత్రాగమంతా సమన్వయంతో పనిచేస్తే అక్కడికక్కడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అత్యధిక శాతం అధికారాలను కలెక్టర్లకే దాఖలు పరిచామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒకసారి ప్రొసీడింగ్స్ ఇచ్చి, మొదటి బిల్లు వారి ఖాతాల్లో జమ అయిన లబ్ధిదారులందరికీ తదుపరి విడతల బిల్లులన్నిటిని సకాలంలోనే విడుదలయ్యేలా చూడాలని మంత్రిగారు కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా, పూర్తి పారదర్శకంగా జవాబుదారీ తనంతో పనిచేస్తూ అర్హులైన వారికే ఫలాలు దక్కేలా చూడాలని ఈ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు.గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం సేకరించి పూర్తి స్థాయిలో వినియోగించకుండా మిగిలి ఉన్న భూముల్లో అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజురైనా వివిధ కారాణలతో నిర్మాణాలను పూర్తి చేయని వారికి కూడా వెసులుబాటు కల్పించే యోచనలో ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా జిల్లాల్లో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరక్టర్లు పూర్తి బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని, లబ్ధిదారులు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని , ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణపు పనులు ఏ స్థాయిలో ఉన్నా, ఈ నెల 20 వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని, ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అర్హులైన పేదలనే లబ్ధిదారులగా ఎంపిక చేయాలన్నారు.
అదనపు ఎమ్మార్వోల నియామకం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ కార్యాలయాలన్నిటిని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నెలకొల్పేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో, అవసరానికి అనుగుణంగా , అదనంగా మరో తహశీల్దార్ ను నియమించనున్నామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. రెవెన్యూ, అటవీ తదితర శాఖల మధ్య ఉన్నభూ వివాదాల సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయడమే మార్గమన్నారు. ఈ దిశలో మరింత వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అటవీ, రెవెన్యూ అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా రెవెన్యూ విభాగంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఆర్డీవోలకు విస్తృతమైన అధికారాలు కల్పించామన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్మెంట్స్, భూ రికార్డుల శాఖ ద్వారా సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. భూ రికార్డుల్లో పారదర్శకత, ఖచ్చితత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి అన్నారు.





