•ప్రపంచ స్థాయిలో సత్తా చాటేలా ప్రత్యేక పాలసీ
•పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్
తెలంగాణ ఎంఎస్‌ఎంఈలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటేలా ప్రత్యేక పాలసీ ఉందని పేర్కొన్నారు. జహీరాబాద్ నిమ్జ్ లో పెట్టుబడులకు 6 అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయని, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సహించి రైతులను వ్యాపారవేత్తలుగా మార్చుతామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటు-కు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల అధికార ప్రతినిధులను ఐటీ-, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాలను వివరించారు.
వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా మనకు మేలే చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారన్నారు. ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకుని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
తెలంగాణ ఎంఎస్‌ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటేలా ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. జహీరాబాద్ నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 6 అంతర్జాతీయ స్థాయి సంస్థలు ముందుకొచ్చాయని, వీటిలో మూడు కొరియా కంపెనీలున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు- చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించి అన్నదాతలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.