- ఆర్థిక క్రమశిక్షణతో గ్యారెంటీ పథకాల అమలు
- మంథనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు మంథని శివ కిరణ్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రజా పాలన విజయోత్సవ ప్రారంభానికి ముందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ష్యూలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటలలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. గత ఏడాదిలో మహిళలు రూపాయ ఖర్చు పెట్టకుండా బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నామని మంత్రి తెలిపారు.పేదలకు ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ సరఫరా, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు కార్పొరేట్ దవాఖానల్లో ఉచిత వైద్యం వంటి పథకాలను అమలు చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు.
గత పదేళ్లలో ఉద్యోగాలు లేక ఎన్నో కష్టాలు పడిన నిరుద్యోగ యువతకు 10 నెలల కాలంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఒకే చోట చదువుకునేలా అడవి సోమనపల్లి ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. రెండు లక్షల వరకు రుణాలు ఉన్న 22 లక్షల రైతులకు రూ.18 వేల కోట్ల రుణ మాఫీ పూర్తి చేశామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ అందిస్తున్నామని, పెద్దపల్లి జిల్లాలో బోనస్ కింద ఇప్పటివరకు 20 కోట్ల పైగా నిధులు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. గతంలో తరుగు పేరిట రైతులు పడిన బాధను శాశ్వతంగా పరిష్కరిస్తూ మద్దతు ధరపై ఎటువంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 17,000 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.236 కోట్ల నిధులను వారి ఖాతాలలో జమ చేశామని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా గుట్టలకు, రోడ్లకు కాకుండా అసలైన రైతులకు, కౌలు రైతులకు లబ్ధి చేకూర్చేలా త్వరలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంథనిలో స్పష్టమైన మార్పు కనిపించే విధంగా రాబోయే నాలుగేళ్లు పని చేస్తానని అన్నారు.
మంథని, మంచిర్యాల మధ్య బ్రిడ్జి
వాణిజ్య వ్యాపారాలు విస్తరించే విధంగా మంథని మంచిర్యాలను కలుపుతూ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంథని పట్టణానికి బైపాస్ రోడ్డు 13 వార్డులలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. మంథని పట్టణంలో 40 మంది యువకులకు ఉపాధి కల్పిస్తూ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. రామగిరి క్షేత్రాన్ని 5 కోట్లతో అభివృద్ధి చేస్తామని, మంథని సమీపంలో గోదావరి నది పుష్కరాలు నిర్వహణకు రెండు కోట్లతో అభివృద్ధి జరుపుతున్నామని అన్నారు. మంథని పట్టణ సమీపంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, దీనికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
బహుళ జాతి కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు మన యువతకు అందించే దిశగా నైపుణ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా యువకులకు మంచి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.నీడ లేని నిరుపేదలకు ఇళ్ల అందించే ఇందిరమ్మ పథకం ప్రారంభమవుతుందని, మొదటి విడతలో భూమి ఉండి, ఇండ్లు లేని వారిని ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు.భవిష్యత్తులో అనువైన భూమిని ఎంపిక చేసి పేదలకు ఇండ్లు నేర్పిస్తామని మంత్రి తెలిపారు. మంథని పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నరేగా ద్వారా నిర్మాణం చేస్తామని అన్నారు. అనంతరం అంతడుపుల నాగరాజు సారథ్యంలోని కళా బృందం ప్రదర్శించిన కార్యక్రమాలు వీక్షకులను ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, వైస్ చైర్మన్,సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





