రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 5 : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత తమదేనని అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా, మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ మోగిలిచర్లలో 8 కోట్ల 40 లక్షల రూపాయలతో నిర్మించే మూడు 33/11 కె.వి విద్యుత్ సబ్‌స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన పరకాల నియోజకవర్గ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సీనియర్ ఎమ్మెల్యే అయిన రేవూరి నిత్యం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడుగుతుంటారని అన్నారు. సబ్ స్టేషన్ల ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు కరెంట్ కష్టాలు తీరి భవిష్యత్‌లో నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కోరిన నిధులను తప్పకుండా మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించినప్పటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, అదనంగా 7 లక్షల కోట్ల పైబడి అప్పులు మోపిందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన సంవత్సరంలోపే ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన వాగ్దానాలను నిబద్ధతతో 22 వేల కోట్ల మేర 2లక్షల లోపు రుణాలను నేరుగా రైతుల ఖాతాలో పంపించి మాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ వారి ఇంటింటికి సర్వే చేసి మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు.
మహిళలను మహారాణులుగా చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వం ప్రమాణం చేసిన అరగంటలోపే ఉచిత బస్సు రవాణా అమలు చేసి చూపించామని డిప్యూటీ సీఎం అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని 10 లక్షలకు పెంచామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని, గత మార్చి నెల నుంచి 200 యూనిట్ల వరకు గల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్, రైతు సబ్సిడీ, ఇన్సూరెన్స్, పంటకు కనీస మద్దతు ధర, సన్న బియ్యానికి క్వింటాల్ 500 రూపాయల బోనస్ అందిస్తూ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున అందించేందుకు చర్యలు మొదలుపెట్టామన్నారు. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించుటకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లను ఏర్పాటు చేయుటకు ఈ సంవత్సరం 5 వేల కోట్లు వెచ్చించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి తెలిపారు.
ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో సంవత్సరంలోపే పరకాల నియోజక వర్గ అభివృద్ధి కోసం రూ 500 కోట్ల నిధులు మంజూరు చేసుకున్నామని అన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించేందుకు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మించుకొంటున్నట్లు తెలిపారు.100 కోట్ల వ్యయంతో రహదారులు నిర్మించుకుంటున్నామని,160 కోట్ల రూపాయలతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లో నాలా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. పార్క్ 863 మంది భూ నిర్వాసితులకు ఇటీవల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేశామని తెలిపారు. స్వయం సహాయక మహిళలలోఉపాధి అవకాశాలు పెంపొందించుటకు దామెర, సంగెం, యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరకాల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కొరకు సుమారు 50 కోట్ల రూపాయల పంచనా తో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. టెక్స్టైల్ పార్క్ లో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలను, డైయిరి అభివృద్ధి చేస్తామని అన్నారు. టియుఎఫ్ ఐడిసి కింద 19 కోట్ల రూపాయలు, సీవరేజ్ వాటర్ డ్రైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ నెల చివరిలోగా మెగా జాబ్ మేలా నిర్వహిస్తామన్నారు. అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి చేతుల అక్కంపేట రెవెన్యూ గ్రామ గెజిట్ గ్రామస్తులకు అందజేశారు.