బాధితులకు న్యాయం చేసిన తర్వాతే కూల్చివేతలు

మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కూల్చివేతలపై పత్రికల్లో, మీడియాల్లో కూల్చివేతలపై వొస్తున్న వార్తలపై దాన కిశోర్ ఆందోళన వ్యక్తం చేశారు. తాము సీఎం రేవంత్ రెడ్డితో కలిసి లండన్ థేన్స్‌తో పాటు పలు దేశాల్లోని నదులను చూసి వొచ్చామని తెలిపారు.

తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా, వాటర్ బోర్డు ఛైర్మన్‌గా ఇలా దాదాపు పదేళ్ల పాటు హైదరాబాద్‌ పరిధిలో విధులు నిర్వర్తించానని దాన కిశోర్ గుర్తుచేశారు. మూసీ రివర్ బెడ్‌లోని ప్రజలు ప్రతి వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారికి శాశ్వత పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 15 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. మూసీలో 10 వేల ఇండ్లను గుర్తించి నగరవ్యాప్తంగా 14 ప్రదేశాలకు మారుస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు 50 కుటుంబాలను అక్కడి నుంచి తరలించామని.. నేడు మరో 200 కుటుంబాలను షిఫ్ట్ చేస్తున్నామని తెలిపారు. పట్టా ఉన్న ప్రతి కుటుంబానికి 20 నుంచి 30 లక్షల విలువైన ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. అందరం చట్టరీత్యా పని చేస్తున్నాని చెప్పుకొచ్చారు.

అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు జరుగొచ్చని.. ఎవర్నీ బలవంతంగా తీసుకు వెళ్లట్లేదని దాన కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఎవర్నీ కొట్టడం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 976 ఇండ్లలో 406 ఇండ్లకు మార్కింగ్ చేశామని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని మూసీ నుంచి తరలించి.. వారికి న్యాయం చేసిన తర్వాతే మూసీ ప్రాజెక్టు పనులు చేపడతామని దాన కిషోర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *