రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు•కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు
•వసతి గృహాల్లో ఘటనలపై కఠిన చర్యలు • కాంగ్రెస్ మంత్రులంతా పనిమంతులే..
•మీడియా చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని, బిజెపి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా పలు విషయాలపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జార?ండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని వివరించారు. మధ్యప్రదేశ్‌లో బిజెపి మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని గుర్తు చేశారు. రైతు భరోసా ఇది విధానాలపై కసరత్తు జరుగుతోంది. రైతు భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. కేటీఆర్ గత కొద్ది రోజులుగా ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావడంలేదని, సీఎంను, ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టం వొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. మా ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఆయన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వాళ్ల మాదిరిగా మేము గడీల పాలన చేయలేదని, ప్రజల కోసం, మేం మా ద్వారాలు తెరిచే ఉంచాం. ఈ రాష్ట్రంలో భావ స్వేచ్ఛ, అందరికీ స్వతంత్రాన్ని ఇచ్చి ప్రజా ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఎంతమందికి భూ పంపిణీ చేశారని ప్రశ్నించారు. ఇంటి కో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేని వారు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు కనీస సంస్కారం ఉండాలి, కలెక్టర్ ను సన్యాసి అంటే ఎలా? అందుకే ఆయన మైండ్ సెట్ సరిగా లేదని భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో భూమిపూజ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళుతుందన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించి వారి పక్షాన ప్రభుత్వం ప్రతినెల రూ.400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారి పక్షాన ప్రభుత్వం నెలకు రూ.150 కోట్లు చెల్లిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 15 రోజుల్లోనే రైతు రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల అందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ జరిగిందని, కుటుంబాల వారీగా రేషన్ కార్డు లేక పొరపాట్లు ఉంటే సర్వే చేసి వారికి రైతు రుణమాఫీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. గత 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడ్డారని.. వాటిని ప్రక్షాళన చేసి మేము కార్డులు ఇవ్వబోతుంటే ఇన్నేళ్లు ఇంట్లో కూర్చున్న వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. రూ.లక్ష రుణమాఫీని నాలుగు సార్లు మొదటి ఐదేళ్లలో మాఫీ చేశారు, వారి మాఫీ డబ్బులు వడ్డీలకే సరిపోలేదు. ఇక రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్న వారు.. మా ప్రభుత్వం పై మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఆర్థిక వ్యవస్థను తీసుకువొచ్చి.. అస్తవ్యస్తం చేసిన మేము 15 రోజుల్లోనే రైతుల ఖాతాలో 18 వేల కోట్లు జమ చేశాం అన్నారు. 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపారు, స్వేచ్ఛగా బతికిన తెలంగాణను బందీ చేశారు, బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చూడలే వ్యవస్థను తిరిగి తెచ్చారని డిప్యూటీ సీఎం విమర్శించారు. కులాలను విడగొడుతున్నామని విపక్షాలు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మేం కులాలను సృష్టించడం లేదు.
అవి శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో వివిధ కులాల వారు ఎంతమంది? రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం అందరూ సమానంగా ఎదిగారా? లేదా? అనేది మేం సర్వేలో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంతకాలం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బ్యాచ్.. మళ్లీ దోపిడీ చేయాలని చూస్తోంది.. అందరి లెక్కలు చెప్పి వాస్తవాలు బయటకు తీస్తే వాళ్లకు ఇబ్బంది.. తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్లాలి, ఈ దేశానికి దశాదిశా చూపాలి అన్న ధ్యేయంతో సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, ఉన్నత అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, పరిశుభ్ర వాతావరణ, నాణ్యతతో కూడిన భోజనం అందుతుందా లేదా. … పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు వివరించారు. నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారం అందించేందుకు 40 శాతం మెస్ చార్జీలు పెంచినట్టు తెలిపారు.
సమష్టి కృషితో జార్ఖండ్ విజయం
జార్ఖండ్ ఫలితాలు ప్రజల విజయం, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం సోరేన్ సమష్టి కృషి ఫలితమని అన్నారు. గత ఐదేళ్లు ఇండియా కూటమి పరిపాలన, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామని చెప్పాం. అక్కడి ప్రజలు వాటిని స్వీకరించారని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులంతా పనిమంతులే.. బిఆర్‌ఎస్ మాదిరిగా గడీలలో లేరని పంతులు ఆయా శాఖల ద్వారా 60:40 శాతం లెక్కల ప్రకారం కేంద్రానికి రావలసిన నిధుల గురించి ప్రతిపాదనలు పంపుతున్నారు, వాటిని సాధించే ప్రయత్నం చేస్తున్నారు, వొచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ జమ చేసి పనులు చేపడుతున్నారని తెలిపారు. మేము బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం లేదు.. వారు అక్కడ ఇమడలేక గ్రూపులుగా మారి ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో పరిపాలన పట్ల మా ప్రభుత్వం స్పష్టంగా ఉంది సంక్షేమం, అభివృద్ధి, ప్రగతిశీల భావాలే అజెండాగా ముందుకు వెళుతుందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామని త్వరలోనే పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పంచిన 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల వివరాలు సేకరిస్తున్నామని, ధరణి వొచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏంటో ఆరాధిస్తున్నామని తెలిపారు. వాటిని తిరిగి అర్హులైన పేదలకు పంచుతామని తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా ఉండాలని.. విచ్ఛిన్నకర దూరని విడాలని.. ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం కూడా ఉండాలన్నదే తమ ప్రభుత్వం అభిమతమని తెలిపారు.