పాలమూరు సభలో మిగిలిన వారికి మరో రూ. 3వేల కోట్లు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభ
నియోజక వర్గానికి మంత్రి తుమ్మల వరాల జల్లు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
షాద్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 27: దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, త్వరలో పాలమూరు జిల్లాల్లో జరిగే రైతు పండుగను పురస్కరించుకొని వివిధ కారణాల చేత రుణమాఫీ అందని రైతాంగానికి 3,000 కోట్ల పంపిణీ చేయబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే ‘‘వీర్లపల్లి శంకర్’’ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు.మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మరికొందరు మార్కెట్ డైరెక్టర్లుగా మంత్రి తుమ్మల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులను ప్రజలను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ, మరోవైపు పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
ఎక్కడా లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 47 వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రంగారెడ్డి జిల్లాలో కోహిడ వద్ద రూ.1000 కోట్లతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ ఎంతో ప్రయోజన పథకంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో 25 వేల కోట్లు వొచ్చాయని ఇందులో రైతులకు సంబంధించి రూ.7,600 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని మంత్రి అన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని అన్నారు. 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్లు చెల్లించామని చెప్పారు. ఇతర కారణాలతో ఆగిపోయిన రైతు రుణమాఫీలకు సంబంధించి త్వరలో పాలమూరులో జరగనున్న రైతు పండుగ కార్యక్రమం ద్వారా రూ.3000 కోట్లు మిగిలిన రైతాంగానికి రుణమాఫీ ద్వారా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వరి దిగుబడి రాష్ట్రంలో ఆశాజనకంగా ఉందని అన్నారు. 66 లక్షల ఎకరాల సేద్యం తెలంగాణలో జరిగిందని, ఇందులో 46 నుండి 50 లక్షల ఎకరాల మేరకు పంట రైతుల చేతికి వొచ్చిందని, మిగిలిన ధాన్యం కూడా త్వరలోనే మార్కెట్లోకి వొస్తుందని అన్నారు. 153 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉందని ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని రైతులకు మంచి బోనస్ కూడా ఇస్తుందని అన్నారు.
తెలంగాణ బియ్యానికి విదేశాలు మంచి మార్కెట్ ఉందని, మలేషియా, ఫిలిపిన్స్ దేశాల్లో తెలంగాణ బియ్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారని దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా గెలుపొందాక పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసుకునేందుకు అవసరమైతే బడ్జెట్లో డబ్బులు ఎక్కువ నిధులు పెట్టిన సరే తమకు ఏమీ అభ్యంతరం లేదని ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోమని క్యాబినెట్ సమావేశంలో సూచించినట్టు తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే విధంగా ముఖ్యమంత్రి వివేకం రెడ్డి ఎంతో పట్టుదలతో ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలమూరు జిల్లా ప్రగతికి కచ్చితంగా పాటుపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఏ శాఖ చూసిన అవినీతి అక్రమమయమైందని వాపోయారు. అవినీతికి ఆలవానంగా నిలిచిందని అన్నారు.
ట్రిపుల్ ఆర్ వొస్తే భూమి బంగారమే :మంత్రి తుమ్మల
రూరల్ రీజినల్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ వొస్తే షాద్ నగర్ నియోజకవర్గంలో భూములు బంగారం అవుతాయని ఇందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కు అత్యంత చేరువలో ఉన్న షాద్ నగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ వొస్తే ఎవరూ ఊహించని రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా ఇక్కడ భూమిని బంగారం ధరలను పోల్చుకునే విధంగా ఉంటుందని అన్నారు.
షాద్‌నగర్ కు వరాల జల్లు
షాద్ నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ సభలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొందుర్గు మండల వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతుల శ్రేయస్సు దృష్ట్యా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేయడంతో మంత్రి వెంటనే సభలో స్పందించారు. ఇంత గొప్ప అభివృద్ధి సాధిస్తున్న ఈ ప్రాంతాన్ని తను ప్రత్యేక దృష్టితో చూస్తానని వెంటనే కొందూర్గు వ్యవసాయ మార్కెట్ కమిటీ ని నూతనంగా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే శంకర్ ను మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు..