- దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- రవీంద్రభారతిలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం (Ugadi) అందరికీ సంతోషాలను అందించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి కొండా సురేఖ,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, శంకరయ్య, మల్ రెడ్డి రంగా రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితమని అభివర్ణించారు. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ అంటూ …దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలి… దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి.
అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టింది. ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుభాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి… పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. ఇది అభివృద్ధి చేసే సందర్భం మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.





