నీళ్ళ కోసం చంద్రబాబు కుట్రలు ..!

ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ  సమావేశ అజెండాలో తెలంగాణకు దక్కిన 7 ప్రాజెక్టుల అనుమతుల పునఃసమీక్షను చేర్చడం రాష్ట్ర ప్రయోజనాలకు పెను ముప్పు. ఏపీ కుట్రల పట్ల రాష్ట్ర  సర్కార్ మౌనం వహించడం చేతకానితనానికి నిదర్శనం. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది . గోదావ‌రి యాజ‌మాన్య బోర్దు (జీఆర్ఎంబీ) అజెండా వెనుక కుట్రతెలంగాణ రాష్ట్రం అత్యంత కష్టపడి, పోరాడి సాధించుకున్న సాగునీటి ప్రాజెక్టుల హక్కులకు ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఈ అజెండా వల్ల ప్రమాదంలో పడ్డ 7 ప్రాజెక్టులలో ఉత్తర మరియు మధ్య తెలంగాణకు గుండెకాయ లాంటి కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మక్క బ్యారేజీ (తువ్వాడ), దేవాదుల ఫేజ్-3, చౌటుప్పల్ (డిండి) వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకాలు ఉన్నాయి. దశాబ్దాల పోరాటాల తర్వాత దక్కిన ఈ అనుమతులను ఇప్పుడు ‘రివ్యూ’ పేరుతో మళ్లీ వివాదంలోకి నెట్టడం అంటే సగం తెలంగాణను ఎడారిగా మార్చడమే. ఇది కేవలం సాంకేతిక సమీక్ష కాదు, తెలంగాణ రైతాంగం నోట్లోకి మట్టి కొట్టే ఏపీ ప్రభుత్వ వ్యూహం. ఈ నెల 18వ తేదీన జరగనున్న జీఆర్ ఎంబీ సమావేశానికి సంబంధించిన అజెండా రాష్ట్ర ప్రజలను విస్మయానికి, ఆగ్రహానికి గురిచేస్తున్నది .

గతంలో  కాళేశ్వరంతో పాటు గోదావరి బేసిన్ లో  తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ సాధించుకున్న ఏడు కీలక ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేయగా, దానిని జీఆర్ఎంబీ అజెండాలో చేర్చడం వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నది .ఇప్పటికే సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం పొంది, సాధించిన నీటి కేటాయింపులను సమీక్షించడం అంటే తెలంగాణ రైతారాన్ని నిండా ముంచడమే. గోదావరి నదిలో మనకు రావాల్సిన 968 టీఎంసీల హక్కును కాలరాసేలా ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది . ఒకసారి దక్కిన అనుమతులను రివ్యూ పేరుతో వెనక్కి తీసుకోవాలని చూస్తే, భవిష్యత్తులో మన ప్రాజెక్టులన్నీ నిలిచిపోతాయి. ఇది ఉత్తర తెలంగాణ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

తెలంగాణ గుండెకాయ లాంటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే ఈ కుట్రను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. రేవంత్ ప్రభుత్వ బలహీనత, మౌన వైఖరి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన నీటి హక్కులపై బహిరంగంగా దండయాత్ర చేస్తుంటే, రాష్ట్ర  ప్రభుత్వం, నీటి పారుదల శాఖ అధికారులు  అనుసరిస్తున్న మౌనం రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహంగా భావించాల్సి వొస్తుంది . కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతి తేలేకపోయారు. సరికదా, గతంలో కేసీఆర్ హయాంలో సాధించిన హక్కులను, క్లియరెన్స్‌లను కూడా కాపాడుకోలేని అసమర్థ స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి శాసన సభ బీ ఆర్ ఎస్ పార్టీ ఉప నాయకుడు హరీష్ ఆరోపిస్తున్నారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి సర్కార్ లొంగిపోయిందనే విమర్శలు బలపడుతున్నాయి. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడంలో విఫలమవ్వడం, బోర్డు సమావేశాల్లో రాష్ట్ర వాదనను గట్టిగా గొంతెత్తి చెప్పలేకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం.నీటి విషయంలో రాజీ పడితే తెలంగాణ మరోసారి వెనకడుగు వేయాల్సి వొస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పావులు కదుపుతుంటే, రేవంత్ రెడ్డి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చూస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారా అనే అనుమానం కలుగుతున్నది . గతంలో కేంద్ర జలశక్తి శాఖతో మరియు అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో గట్టిగా పోరాడి సాధించుకున్న అనుమతులను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేజేతులా చేజార్చుకుంటున్నది . రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటి పారుదల శాఖపై పూర్తిస్థాయి పట్టు లేకపోవడం, కేవలం రాజకీయ ప్రతీకారాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాజెక్టుల అజెండాను మార్చేలా ఏపీ ఒత్తిడి తెచ్చినా, మన అధికారులు మరియు మంత్రులు కనీసం నిరసన కూడా తెలపకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఒకవైపు ఏపీ అనుమతులు లేకుండా రూ.80 వేల కోట్లతో గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తుంటే మన ప్రభుత్వం నోరు మెదపడం లేదు. కానీ మన సమ్మక్క బ్యారేజీకి అనుమతి ఇవ్వొద్దని ఏపీ కోరగానే, దాన్ని జీఆర్ఎంబీ అజెండాలో చేర్చేలా లొంగిపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా  తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. చట్టపరమైన, సాంకేతిక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించి 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశంలో ఏపీ వాదనలను తిప్పికొట్టాలి . లేనిపక్షంలో, తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో  కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చరిత్రలో నిలిచిపోతుంది . రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైతే, ఉద్యమ గడ్డపై రైతులు, ప్రజలు ఏకోన్ముఖంగా మళ్ళీ పోరాటానికి సిద్ధపడతరు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *