భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు కనీస మౌలిక వసతులు, పారిశుధ్య లోపాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు విద్యార్థుల ఆరోగ్య భద్రతను తీవ్ర ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటిని తలపించేలా ఉన్న కలుషిత నీరు సరఫరా కావడం, జేఎన్టీయూ హైదరాబాద్ మెస్ సాంబారులో నత్త రావడం వంటి ఉదంతాలు విద్యాసంస్థల పర్యవేక్షణ లోపానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. చదువుపై దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు, రోజూ తాము తినే ఆహారం, తాగే నీరు సురక్షితమేనా అని భయాందోళనలకు గురికావాల్సి రావడం అత్యంత విచారకరం. సోమవారం రాత్రి (నవంబర్9 రాత్రి) మంజీరా హాస్టల్ మెస్‌లో విద్యార్థులకు వడ్డించిన సాంబారులో నత్త కనిపించింది. (అంతకుముందు అక్టోబర్ 30న ఇదే యూనివర్సిటీలో చోలే కర్రీలో బల్లి సంఘటన కూడా జరిగింది). ఇక బాసర్ త్రిపుల్ ఐటీలో మంగళవారం హాస్టల్ నల్లాల నుండి మురుగునీటిని తలపించేలా కలుషిత నీరు వొస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై గత కొన్ని రోజులుగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆందోళనలు చేపట్టారు.
బాసర ట్రిపుల్ ఐటీ లోని గంగ, యమునా హాస్టళ్లలో మురుగునీటిని తలపించే కలుషిత నీటిని వాడటం వల్ల అనేకమంది విద్యార్థినులు తీవ్రమైన చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్లు , అలెర్జీల బారిన పడ్డట్టు మీడియాలో వార్తలు వొచ్చాయి. కలుషిత నీరు, ఆహారంలో పురుగులు/నత్తలు వొస్తుండటంతో విద్యార్థుల్లో ఒక రకమైన భయాందోళన నెలకొన్నది . పత్రికల కథనాల ప్రకారం, హాస్టళ్లలో ఉండటానికి విద్యార్థులు భయపడుతున్నారు. నిరంతరం అనారోగ్యం పాలవ్వడం వల్ల వారు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉన్నత విద్యాసంస్థలే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారు. ఉదాహరణకు, గత నెలలో పెబ్బేర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్లో సుమారు 50 మంది విద్యార్థినులు, అలాగే పర్వతగిరి హాస్టల్లో 28 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని వాంతులు, విరేచనాలు, జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. దీనిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి నివేదికలు కూడా కోరింది. క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం, వేలాది మంది విద్యార్థులు ఉండే ఈ పెద్ద యూనివర్సిటీల్లోని క్యాంపస్ హెల్త్ సెంటర్లు కనీస అత్యవసర వైద్య సేవలు అందించడానికి కూడా సిద్ధంగా లేవు.
సరైన రోగనిర్ధారణ సేవలు, మందులు లేకపోవడం వల్ల విద్యార్థులు చిన్న సమస్యలకే బయట ప్రైవేట్ హాస్పిటల్స్ ఆశ్రయించాల్సి వొస్తున్నది . విద్యాసంస్థల్లో పారిశుధ్యం క్షీణించడానికి నిధుల కొరత, మెస్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు నిరంతరం జరగకపోవడమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కాంట్రాక్టర్లు లాభాపేక్షతో నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారు. వంట గదుల నిర్వహణ, కూరగాయల నాణ్యత, నీటి నిల్వ ట్యాంకుల శుభ్రతను నిరంతరం పర్యవేక్షించాల్సిన విద్యాసంస్థల యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది . ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యార్థులు అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం, తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకోవడం ఒక పరిపాటిగా మారింది.
ఈ ఉదాసీనత వల్లే హాస్టల్ మెస్‌లు క్రమంగా రోగాల నిలయాలుగా మారుతున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత లేకపోవడం తీవ్ర విచారకరం. నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో విఫలమవ్వడం అధికారుల పర్యవేక్షణా లోపాన్ని చూపుతున్నది . విద్యాసంస్థల్లో పారిశుధ్యం క్షీణించడానికి నిధుల కొరత, మెస్ కాంట్రాక్టర్ల ఏకపక్ష వైఖరి, క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు నిరంతరం జరగకపోవడమే ప్రధాన కారణాలు. ఈ తరహా వైఫల్యాలు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కలుషిత ఆహారం, నీటి వల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇది వారి శారీరక, మానసిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నది . తమ హక్కుల కోసం, ప్రాథమిక అవసరాల కోసం విద్యార్థులు క్లాసులు బహిష్కరించి రోడ్లపైకి వొచ్చి ఆందోళనలు చేపట్టాల్సి రావడం వల్ల వారి అమూల్యమైన విద్యా సమయం వృథా అవుతుంది . గ్రామీణ, పేద కుటుంబాల నుంచి వొచ్చే విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలే ఏకైక ఆధారం. అలాంటి చోట్ల కనీస రక్షణ కరువైతే, వారు ఉన్నత చదువులకు ఎట్లా శ్రేయస్కరంగా నిలబడగలరనేది సమాజం ఆలోచించాల్సిన విషయం.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తామని, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తామని పాలకులు బృహత్తర ప్రకటనలు గుప్పిస్తుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో కనీస అవసరాలైన స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన భోజనాన్ని కూడా అందించలేకపోవడం ప్రభుత్వ పర్యవేక్షణా లోపాన్ని స్పష్టం చేస్తున్నది . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న విద్యాశాఖ వెంటనే స్పందించి ప్రతి ప్రభుత్వ హాస్టల్, విద్యాసంస్థలో పారిశుధ్యాన్ని తనిఖీ చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించాలి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కేవలం ఘటనలు జరిగినప్పుడే కాకుండా నిరంతరం జరగాలి. నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారిని శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి.
విద్యాసంస్థలు కేవలం అక్షరాలు నేర్పే కేంద్రాలు మాత్రమే కాదు; అవి విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యానికి, వికాసానికి భరోసా ఇచ్చే సురక్షిత నిలయాలు కావాలి. విద్యార్థుల ప్రాణాలతో, ఆరోగ్యంతో ఆడుకునే ఏ వ్యవస్థ అయినా సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు వంటిదే. ప్రభుత్వం, విద్యాశాఖ, ఉన్నతాధికారులు ఇకనైనా ఈ నిర్లక్ష్య నిద్ర వీడి, శాశ్వత పటిష్ట చర్యలు చేపట్టాలి. అప్పుడే మన విద్యాసంస్థల్లో అనారోగ్యపు ఛాయలు తొలగి, విద్యార్థులకు నిజమైన భరోసా లభిస్తుంది.





