కృష్ణా, గోదావరి రెండు జీవనదులు ప్రవహిస్తున్న తెలంగాణలో లక్షలాది ఎకరాలు సాగునీటి కోసం ఎదురుచూడటం పాలకుల వైఫల్యానికి నిదర్శనం. నదీజలాలపై హక్కుల కోసం దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అయినా రైతుకు నీటి భరోసా దక్కడం లేదు. కరువు పరిస్థితులు తీవ్రమవుతున్న వేళ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు న్యాయపోరాటం అవసరమే. కానీ న్యాయస్థానంలో గెలిచినా పొలానికి నీరు చేరకపోతే ఆ విజయం రైతుకు ఏం ఉపయోగం? ఇదే పాలకులు సమాధానం చెప్పాల్సిన అసలు ప్రశ్న. రాష్ట్ర విభజన తరువాత కృష్ణా జలాల పంపిణీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల్లో తాత్కాలిక ఏర్పాటుగా తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణ పరీవాహక ప్రాంతం, సాగునీటి అవసరాలు, చారిత్రక అన్యాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ పంపిణీ న్యాయసమ్మతం కాదన్న వాదనకు ప్రాతిపదిక ఉంది. అయితే రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే ప్రభుత్వాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటిని ఎంత సమర్థంగా వినియోగిస్తున్నాయో కూడా ప్రజలకు వివరించాలి.
కృష్ణా జలాల వివాదాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం అన్ని పార్టీలకూ అలవాటైంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక వాదన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో వాదన వినిపించడం వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదు. నీటి కేటాయింపులపై న్యాయపోరాటం సాగుతూనే ఉండవొచ్చు. కానీ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల పూర్తి, జలాశయాల నిర్వహణ, నీటి పంపిణీ వంటి పనులకు న్యాయవివాదాలు అడ్డంకి కాకూడదు. హక్కుల సాధన పేరుతో పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వీల్లేదు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి పథకాల పూర్తి సామర్థ్యాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నది. ప్రతి ఎన్నికల్లో ఈ ప్రాజెక్టుల పేర్లు వినిపిస్తాయి. ప్రతి ప్రభుత్వం కొత్త గడువులు ప్రకటిస్తుంది. కానీ పనులు పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయాలు పెరిగిపోతున్నాయి. ప్రాజెక్టుల ప్రయోజనాలు మాత్రం వాయిదా పడుతున్నాయి. నిర్మాణాలకు ఖర్చు చేసిన ప్రజాధనానికి, రైతులకు అందిన సాగునీటికి మధ్య ఉన్న అంతరాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయాలి.
భారీ ఎత్తిపోతల పథకాల విషయంలో మరింత కఠినమైన ఆర్థిక సమీక్ష అవసరం. నిర్మాణ వ్యయంతోనే ప్రాజెక్టు పూర్తయినట్లు కాదు. నీటిని ఎత్తిపోయడానికి విద్యుత్, పంపుల నిర్వహణ, మరమ్మతులకు ఏటా వేల కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు నీరందించడానికి ఎంత ఖర్చవుతున్నదో లెక్కించకుండా కొత్త ప్రాజెక్టులను ప్రకటించడం బాధ్యతారాహిత్యం. ప్రాజెక్టుల పరిమాణం ప్రభుత్వ ప్రతిష్ఠకు కొలమానం కాదు; రైతుకు అందిన నీరే వాటి విజయానికి ప్రమాణం. మరోవైపు తెలంగాణ గ్రామీణ జీవనానికి ఆధారమైన చెరువుల వ్యవస్థ క్రమంగా బలహీనపడుతున్నది. వేలాది చెరువులు నీరు లేక ఎండిపోతున్నాయి. పూడిక, ఆక్రమణలు, మూసుకుపోయిన నీటి ప్రవాహ మార్గాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. భారీ ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించే ప్రభుత్వాలు చెరువుల నిర్వహణకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చెరువుల పునరుద్ధరణను ఉపాధి హామీ కార్యక్రమంతో అనుసంధానించి గ్రామసభల పర్యవేక్షణలో చేపట్టాలి. నీటి నిల్వ సామర్థ్యం ఎంత పెరిగిందన్నది కొలవాలి. కేవలం పూడికతీత పనుల సంఖ్యను అభివృద్ధిగా ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం లేదు.
నీటి కొరతకు ప్రకృతిని మాత్రమే నిందించడం సరికాదు. వర్షాభావం సహజ పరిణామం …. కానీ దానిని తీవ్ర వ్యవసాయ సంక్షోభంగా మార్చేది ప్రణాళికా లోపమే. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా అధిక నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం ప్రభుత్వ విధానాల్లోని వైరుధ్యాలు. రైతులకు పంటల మార్పిడి సూచించే ముందు మార్కెట్ భరోసా, కొనుగోలు వ్యవస్థ, బీమా సౌకర్యం కల్పించాలి. లేకపోతే నీటి సంక్షోభ భారాన్ని రైతులపైనే మోపినట్లవుతుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించాలి. ట్రైబ్యునల్ విచారణలు, న్యాయపరమైన ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. రెండు రాష్ట్రాల మధ్య నీటి విడుదల, జలాశయాల నిర్వహణకు పారదర్శక వ్యవస్థ అవసరం. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులవారీగా నిర్మాణ పురోగతి, వ్యయం, నీటి లభ్యత, సాగులోకి వొచ్చిన విస్తీర్ణాన్ని ప్రజలకు వెల్లడించాలి. ప్రతి ప్రాజెక్టుకు నిర్దిష్ట కాలపట్టిక ప్రకటించి అమలుకు అధికారులను బాధ్యులను చేయాలి.
తెలంగాణ నీటి సమస్యకు రాజకీయ ప్రకటనలు పరిష్కారం కావు. న్యాయస్థానాల్లో వాదనలు, అసెంబ్లీలో చర్చలు , రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణలు , ఎన్నికల సభల్లో హామీలు రైతు పొలాన్ని తడపలేవు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించడం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, కరువు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వడం తక్షణ కర్తవ్యం. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరాడటం రాష్ట్ర ప్రభుత్వ హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. అయితే ఆ హక్కును రైతుల జీవన భద్రతగా మార్చలేని పాలనకు న్యాయవిజయాలను గొప్పగా చెప్పుకునే నైతిక అర్హత ఉండదు. తెలంగాణకు కావాల్సింది కాగితాలపై టీఎంసీలు కాదు.. పొలాల్లో పారే నీరు. హక్కుల కోసం పోరాటంతోపాటు ఆ నీటిని అందించే పాలనా సామర్థ్యమే ఇప్పుడు అసలైన పరీక్ష.





