మధ్యవర్తిత్వంతోనే సత్వర ఊరట !

ఆధునిక సమాజంలో వినియోగదారుల హక్కుల రక్షణ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థల విజయానికి ఒక గీటురాయి. నిత్యజీవితంలో కొనుగోలు చేసే వస్తువుల నుంచి పొందే సేవల వరకు ప్రతి దశలోనూ వినియోగదారులు మోసాలకు, నాణ్యతా లోపాలకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో నవంబర్ 9న తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషీ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వినియోగదారుల వివాదాలను ఏళ్ల తరబడి సాగే సుదీర్ఘ న్యాయప్రక్రియకు బదులుగా, మధ్యవర్తిత్వం ద్వారా త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, సామాన్యుడికి న్యాయాన్ని మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఒక దిశానిర్దేశం.

మన దేశంలో న్యాయస్థానాలపై ఉన్న కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు, బాధిత వినియోగదారుడికి సకాలంలో ఊరట లభించాలంటే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలు అత్యవసరం. ప్రస్తుత సంప్రదాయ న్యాయవ్యవస్థలో ఒక చిన్న వివాదం పరిష్కారం కావడానికి కూడా సంవత్సరాల సమయం పడుతోంది. కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల ఫీజులు భరించడం సామాన్య ముగింపు లేని భారంగా మారుతుంది. చాలా సందర్భాలలో వస్తువు విలువ కంటే, దానికి సంబంధించిన న్యాయ పోరాటానికే ఎక్కువ ఖర్చవుతుంది . దీనివల్ల అనేకమంది వినియోగదారులు తమకు అన్యాయం జరిగినా భరిస్తూ, కోర్టులకు వెళ్లడానికే జంకుతున్నారు. ఈ వైరాగ్యం వ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తుంది. అందుకే, మధ్యవర్తిత్వం అనేది ఈ సమస్యకు ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది.

మధ్యవర్తిత్వం వల్ల ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉన్నాయి. సమయం ఆదా కావడం, ఖర్చులు తగ్గడం ,ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించడం. 2019 వినియోగదారుల రక్షణ చట్టం కూడా వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ సెల్స్ ఏర్పాటును చట్టబద్ధం చేసింది. దీని ప్రకారం, కోర్టులు ఒక వివాదాన్ని పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉంటే, దానిని మధ్యవర్తిత్వానికి బదిలీ చేయవొచ్చు . ఇక్కడ ఇరుపక్షాలు కూర్చొని, ఒక తటస్థ మధ్యవర్తి సమక్షంలో స్నేహపూర్వక వాతావరణంలో సమస్యను ముగించుకోవొచ్చు. దీనివల్ల సమయం వృథా కాదు సరికదా, కోర్టుల్లో ఉండే ఉద్రిక్త వాతావరణం, ఈగోలకు తావుండదు. గెలుపు-ఓటములు అనే భావన లేకుండా ఇరుపక్షాలూ సంతోషంగా కోర్టు నుంచి బయటకు వొచ్చే వీలుంటుంది.

పరిశీలిస్తే దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో మధ్యవర్తిత్వం ద్వారా అనేక వివాదాలు సంప్రదాయ కోర్టుల వెలుపల, ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సమస్యలను ముగించడంలో ఈ విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నది . దీనికి సంబంధించిన అధికారిక జాతీయ ,ప్రాంతీయ గణాంకాలను గమనిస్తే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 మధ్య కాలంలో మధ్యవర్తిత్వం ద్వారా 50వేల కంటే ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యాయి. ఆ తర్వాతి కాలంలో (ఏప్రిల్ 2022 నుండి జూన్ 2023 మధ్య) ఈ సంఖ్య గణనీయంగా పెరిగి దాదాపు 1,10,000 కేసులు మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా విజయవంతంగా ముగిశాయి. దిల్లీ , బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని కోర్టు అనుబంధ మధ్యవర్తిత్వ కేంద్రాలలో దాదాపు 56% నుండి 65% వరకు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతున్నాయి. కొన్ని ప్రైవేట్ మధ్యవర్తిత్వ సంస్థలలో ఈ సక్సెస్ రేట్ ఏకంగా 80% నుండి 90% వరకు ఉంటున్నది . ఇదిలావుండగా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) ద్వారా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 12,891 కేసులు మధ్యవర్తిత్వానికి బదిలీ చేయబడగా, వాటిలో 1,416 కేసులు (సుమారు 10.98%) ఇరుపక్షాల సమ్మతితో విజయవంతంగా పరిష్కరించబడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహించిన 90 రోజుల ప్రత్యేక “మీడియేషన్ ఫర్ ది నేషన్” ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 179 క్లిష్టమైన కేసులు కేవలం మధ్యవర్తిత్వం ద్వారానే కొలిక్కి వొచ్చాయి. కన్స్యూమర్ జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌లలో ఒక సాధారణ కేసుకు సగటున 669 రోజులు, రాష్ట్ర కమిషన్‌లో 974 రోజులు పడుతుంది . ఈ తీవ్ర ఆలస్యాన్ని తగ్గించడానికి జస్టిస్ పి.శామ్ కోషీ సూచించినట్లు మధ్యవర్తిత్వమే అత్యంత వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది . మధ్యవర్తిత్వం ద్వారా ప్రధానంగా రియల్ ఎస్టేట్/హౌసింగ్ వివాదాలు (25%), ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు (21%), ఈ-కామర్స్/బ్యాంకింగ్ రంగాలు , టెలికాం సేవలకు సంబంధించిన వినియోగదారుల ఫిర్యాదులు కోర్టు మెట్లు ఎక్కకుండానే త్వరగా పరిష్కారమవుతున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే, మధ్యవర్తిత్వం అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో వేలాది మందికి తక్కువ ఖర్చుతో సత్వర న్యాయాన్ని అందిస్తుందని  స్పష్టమవుతుంది.

“న్యాయం ఆలస్యమైతే అది న్యాయాన్ని తిరస్కరించడమే” అనే నానుడి వినియోగదారుల వివాదాలకు వంద శాతం వర్తిస్తుంది. కొనుగోలు చేసిన వస్తువు పాడైపోయినప్పుడు లేదా సేవల్లో లోపం ఉన్నప్పుడు తక్షణ పరిష్కారం లభిస్తేనే ఆ చట్టాలకు సార్థకత ఉంటుంది. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని, అటు న్యాయశాఖ, ఇటు వినియోగదారుల వ్యవహారాల సంస్థలు సంయుక్తంగా మధ్యవర్తిత్వాన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి.  ప్రత్యేక శిక్షణ పొందిన మధ్యవర్తుల సంఖ్యను పెంచాలి.  ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పించాలి. సామాన్యుడికి తక్కువ ఖర్చుతో, వేగంగా న్యాయం అందినప్పుడే నిజమైన సంక్షేమ రాజ్యం సాకారమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *