కార్పొరేట్‌ శిఖరాల్లో కనిపించని మహిళలు!

“వీణె జక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చె
మ్రాకున దీగె గూర్పంగనేరనిలేమ గుణము నేక్రియ ధనుష్కోటి గూర్చె
సరము ముత్యము గ్రువ్వజాలనియబల యేనిపుణత సంధించె నిశిత శరము
చిలుకకు బద్యంబు చెప్పనేరని తన్వి యస్త్ర మంత్రము లెన్నడభ్యసించె..”

అని కన్నవారు, విన్నవారు ఆశ్చర్యపడుతుండగా ‘త్రిజగదభిరామ గుణధామ చారు చికురసీమ సత్యభామ’ సింహగర్జనములు చేస్తూ నరకాసుర సంహారం కావించింది. నాడు దుష్టుడయిన నరకాసురుడి సంహారం జరిగినందుకు నేటికీ కొన్ని యుగాలుగా, తరాలుగా చదల చీకట్లలో చిరు దివ్వెలు వెలిగించి పండుగ జరుపుకుంటున్నాం. సరములో ముత్యాలు గుచ్చజాలని అబల అసురాగ్రణి నరకాసురుడిని హతమార్చగలుగుతుందా అని శంకించినవారున్నారు. అబలను కానని, సమరశీలం గల సబలనని సత్యభామ నిరూపించింది. స్త్రీ శక్తి పట్ల విశ్వాసం లేని వారు ఇప్పటికీ ఉన్నారు. క్రీస్తుశకంలో రెండువేల ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి అయిన తరుణంలో, ఈ దేశంలో అన్ని రంగాలలో స్త్రీలకు సమాన ప్రాతినిధ్యం కలిగించడం ఇష్టంలేని వారు కొందరు ఉండడం విచిత్రమే..

దేశ ప్రగతిని ఆకాశహర్మ్యాలు, పెట్టుబడులు, కంపెనీల లాభాలతో మాత్రమే కొలవలేం. ఆ సంపదను సృష్టించే ప్రక్రియలో మహిళలకు ఎంత భాగస్వామ్యం ఉంది? నిర్ణయాధికారం ఎంత లభిస్తున్నది? అనే ప్రశ్నలకూ సమాధానం కావాలి. విద్యలో ప్రతిభ చూపుతున్న మహిళలు ఉద్యోగాల్లోకి ప్రవేశించినప్పటికీ, నాయకత్వ స్థానాలకు చేరుకునేసరికి వారి సంఖ్య ఎందుకు తగ్గిపోతున్నది? కార్పొరేట్‌ వ్యవస్థ సమర్థతను, సమాజ సమానత్వాన్ని పరీక్షించే ప్రశ్న ఇది. మహిళలకు చదువుకునే అవకాశం కల్పించడమే సాధికారతకు పరిపూర్ణ నిర్వచనం కాదు. ఆ చదువుకు తగిన ఉపాధి, ఆదాయం, గౌరవం, అధికారాన్ని అందించినప్పుడే సాధికారత సార్థకమవుతుంది.

ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ 1990లో ప్రస్తావించిన ‘కనిపించని మహిళలు’ అనే ఆలోచన  ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. కుమారులపై మోజు, బాలికల పట్ల వివక్ష, ఆహారం, ఆరోగ్య సంరక్షణలో అసమానతల కారణంగా ఉండవలసినంత మంది మహిళలు జనాభాలో లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు అదే భావనను భిన్నమైన సందర్భంలో గుర్తుచేసుకోవాల్సి వొస్తున్నది. విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో కనిపిస్తున్న మహిళలు కంపెనీల నిర్ణయ వేదికల్లో మాత్రం అరుదవుతున్నారు. ఇది జనాభాలో అదృశ్యం కావడం కాదు; ప్రతిభ ఉన్నప్పటికీ అధికారానికి దూరంగా మిగిలిపోవడం. రూపాలు వేరైనా, రెండింటి వెనుకా మహిళలకు తక్కువ విలువనిచ్చే సామాజిక దృక్పథం పనిచేస్తున్నది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక వివరాల ప్రకారం, భారతదేశంలో నిర్వహణ స్థానాల్లో మహిళల వాటా సుమారు 11–12 శాతమే. పరిశీలించిన 34 ఆసియా–పసిఫిక్‌ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 32వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మాత్రమే వెనుక ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహణ స్థానాల్లో మహిళల వాటా 30 శాతానికే పరిమితమైందని ఐఎల్‌ఓ తెలిపింది.

ఈ వెనుకబాటును మహిళల్లో ఆశయం తక్కువగా ఉండటానికో, నాయకత్వ సామర్థ్యం కొరవడటానికో ఆపాదించడం అన్యాయం. ఉద్యోగ ప్రవేశం నుంచి పదోన్నతి వరకు అవకాశాలను నిర్ణయించే పద్ధతులను పరిశీలించాలి. కీలక ప్రాజెక్టులు ఎవరికి అప్పగిస్తున్నారు? ఆదాయం, పెట్టుబడులు, కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతల్లో మహిళలకు ఎంత అవకాశం ఇస్తున్నారు? ఉన్నతాధికారులతో పరిచయాలు, అనధికారిక సమావేశాలు, వ్యక్తిగత సిఫారసులు పదోన్నతులను ప్రభావితం చేస్తే ప్రతిభ ఒక్కటే సరిపోదు. మహిళలను సహాయక విభాగాలకు పరిమితం చేసి, ప్రధాన వ్యాపార బాధ్యతలకు దూరంగా ఉంచితే భవిష్యత్‌ నాయకత్వానికి అవసరమైన అనుభవం ఎలా లభిస్తుంది?

ఇంటి పనులు, పిల్లల పెంపకం, వృద్ధుల సంరక్షణ ప్రధానంగా మహిళల బాధ్యతలేననే భావన మరో పెద్ద అడ్డంకి. కుటుంబ అవసరాల కోసం ఉద్యోగానికి విరామం తీసుకున్న మహిళ తిరిగి వొచ్చినప్పుడు ఆమె అనుభవానికి విలువ తగ్గకూడదు. మాతృత్వాన్ని వృత్తిపరమైన బలహీనతగా చూడకూడదు. ఎక్కువ గంటలు కార్యాలయంలో ఉండటాన్నే నిబద్ధతకు కొలమానంగా భావించే సంస్కృతి మారాలి. పనితీరు, ఫలితాలు, నిర్ణయ సామర్థ్యమే మూల్యాంకనానికి ఆధారం కావాలి. సంరక్షణ బాధ్యతలను పురుషులు సమానంగా పంచుకోకుండా కార్యాలయ సమానత్వం సాధించడం కష్టం.

మహిళల నాయకత్వం సంస్థలకు ప్రయోజనకరమనే ఆధారాలూ పెరుగుతున్నాయి. ఐఎల్‌ఓ సర్వేలో దాదాపు పదింట ఏడు సంస్థలు లింగ సమానత్వం, వైవిధ్య కార్యక్రమాల వల్ల వ్యాపార ఫలితాలు మెరుగయ్యాయని తెలిపాయి. మహిళలు నాయకత్వంలో ఉన్న సంస్థలు మెరుగైన ఫలితాలను నివేదించే అవకాశం ఎక్కువగా ఉన్నదని కూడా నివేదిక పేర్కొన్నది.  విభిన్న అనుభవాలకు స్థానం కల్పించే సంస్థాగత సంస్కృతి విలువను ఈ పరిశీలనలు సూచిస్తున్నాయి. లాభాలతో సంబంధం లేకుండానే సమాన అవకాశం మహిళల హక్కు.

కంపెనీలు ముందుగా తమ నియామకాలు, వేతనాలు, పదోన్నతుల విధానాలను పారదర్శకం చేయాలి. ప్రతి స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం, ఉద్యోగ విరమణకు కారణాలు, నాయకత్వానికి ఎదగడానికి పట్టే సమయాన్ని పరిశీలించాలి. కీలక బాధ్యతలకు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు మహిళలకు సముచిత అవకాశం కల్పించాలి. నాయకత్వ శిక్షణతోపాటు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నిర్వహించే అనుభవమూ ఇవ్వాలి. మహిళా దినోత్సవ ప్రసంగాలు, ప్రచార చిత్రాలు, పురస్కారాలతో బాధ్యత ముగిసిపోదు. సమానత్వ లక్ష్యాలను సాధించడంలో ఉన్నతాధికారుల పనితీరునూ కొలవాలి. బోర్డులో ఒక మహిళ కనిపించడాన్ని విజయంగా ప్రకటించుకునే ధోరణి నుంచి సంస్థలు బయటపడాలి.

ప్రభుత్వాల బాధ్యత కూడా అంతే స్పష్టం. అందుబాటు ధరల్లో నాణ్యమైన శిశు సంరక్షణ కేంద్రాలు, సురక్షిత ప్రజారవాణా, ఉద్యోగానికి తిరిగివొచ్చే మహిళలకు నైపుణ్య శిక్షణ అవసరం. కార్యాలయాల్లో వేధింపులపై ఫిర్యాదు చేసినందుకు బాధితురాలే అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఉండకూడదు. చిన్న సంస్థలకూ సంరక్షణ సదుపాయాలు అందేలా ఉమ్మడి ఏర్పాట్లను ప్రోత్సహించాలి. గ్రామీణ, దళిత, ఆదివాసీ, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు అవకాశాలు చేరుతున్నాయా అన్నదీ పరిశీలించాలి. కొద్దిమంది సంపన్న మహిళలు శిఖరాలకు చేరడమే సమగ్ర మహిళా పురోగతికి నిదర్శనం కాదు .

మహిళలను వోటర్లుగా ఆకర్షించే రాజకీయ వ్యవస్థ, వినియోగదారులుగా గుర్తించే మార్కెట్‌, నిర్ణయాధికారులుగా అంగీకరించడంలో ఎందుకు వెనుకబడుతున్నాయి? ఈ వైరుధ్యాన్ని ప్రశ్నించాలి. ఆర్థిక వ్యవస్థలో సగం జనాభా ప్రతిభను పరిమితం చేసుకుంటూ ప్రపంచ నాయకత్వాన్ని ఆశించడం అసంబద్ధం. మహిళల ఎదుగుదలకు ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం ప్రత్యేక అనుగ్రహం కాదు; సమానత్వానికి అవసరమైన చర్య. చదువులో సాధించిన విజయాలు వృత్తి జీవితంలో అధికారంగా మారాలి. కార్పొరేట్‌ శిఖరాల్లో కనిపించని మహిళలు కనిపించాలంటే అవకాశాల పంపిణీ మారాలి. నిర్ణయాధికారాల్లో   వారికి సమాన స్థానం దక్కాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *