
(సీనియర్ జర్నలిస్టు ,రచయిత ,సామాజిక కార్యకర్త)
సెల్:9441864514,
అసహనం మనుష్యుల కే కాదు!ప్రభుత్వాలకి ఉంటుంది? మానసిక వైకల్యం మనుష్యులకే కాదు!వ్యవస్థలు కూడా ఒక్కోసారి అలా మారిపోతుంటాయి.ముఖ్యంగా అధికారం పోగుపడ్డ అహంకారం గాయపడ్డప్పుడు చేష్టలే కాదు భాష కూడా విచలితం అవుతుంటుంది.ఇప్పుడు తెలంగాణలో నెత్తుటి భాష రాజ్యం ఏలుతుంది.. నెత్తుటి మరకలు రాజకీయ చరిత్ర ముఖం మీద పుట్టుమచ్చలు,పెట్టుమచ్చలు అవబోతున్నాయి.తెలంగాణానే కాదు, ఆంధ్రప్రదేశ్ లోకూడా అదే అసహనం, అశాంతి రాజ్యం ఏలుతుంది.
వాస్తవంగా పాలకులకు కాస్తా ఓపిక,సహనం ఎక్కువ పాళ్ళలో ఉండాలి.కానీ, ప్రస్థుత పరిస్థితి అలా కనిపించడం లేదు.రాజకీయాల్లో అసహనం,అభద్రతాభావం కాస్తా పరుష భాషగా,నెత్తుటి ఆనవాళ్ళను కూడా పరిచయం చేస్తుంది.సరైన సమయంలో,సరైన ప్రజాసమస్యలు ప్రస్తావించడం ప్రతిపక్షాలు కర్తవ్యం.వాటిని అర్థం చేసుకొని,ఆకళింప చేసుకొని పరిష్కారం చేయడం ప్రభుత్వం లో ఉన్న పెద్దల విధి.వాటి గురించి ఆచితూచి మాట్లాడడం రెండు పక్షాల బాధ్యత.కానీ,ఎవరు బాధ్యత విస్మరించినా ప్రజల్లో అసంతృప్తి గూడు కట్టుకోవడం సహజం.రాజకీయ పరిభాషలో ప్రతిపక్షం అయినా అధికారపక్షం అయినా మాటలతో కాలే కడుపులు నింప లేరు.మాటలతో ఎన్నాళ్ళో మాయ పుచ్చలేరు..! ఆశల కల్పనకు ఓ హద్దు ఉంటుంది.వింటానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి.. పాలకులు ప్రజల సహనాన్ని కూడా పరీక్షించలేరు.అర్థం చేసుకోలేరు.ఎందుకంటే,ఆచరణ మాత్రమే గీటురాయిగా ఉంటుంది.అందులో ఎటువంటి అనుమానం లేదు.
ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాభావ పరిస్థితి గురించి మాట్లాడుతూ”ప్రతిపక్ష నేతలు హరీష్ రావు, కేటీఆర్ , కేసీఆర్ ముగ్గురు రక్తాన్ని రైతుల పంట భూముల్లో చల్లుతాము” అని మాట్లాడిన రక్తపు భాష ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు నోటినుండి వెలువడాల్సిన మాట కానే కాదు.ఇది నిజంగా విచక్షణ కోల్పోయిన క్రిమినల్స్ నిత్యం వాడే పదజాలం.అంత కటువైన పదజాలం ముఖ్యమంత్రి నోటి నుండి ఎందుకు వచ్చింది అన్నది ఊహకు అందని అంచనాగా ఉంది.ఇంత అసహనం ముఖ్యమంత్రి లో ఎందుకు పొడ చూపింది అనేది ప్రధాన ప్రశ్న.. ఎల్ నినో నేపథ్యం లో నోళ్ళు తెరుస్తున్న రైతుల భూములు గొంతు తడపడం ఎట్లా అనేది ఓ భౌతిక ప్రశ్న! ప్రతిపక్ష నాయకులుగా హరీష్ రావు, కేటీఆర్ లు కాళేశ్వరం పంపు నీళ్ళు ఎత్తిపోయాలని కోరడం,మీరు పంపులు ఆన్ చేయకపోతే తామే ఆ పని చేస్తామని ప్రకటించారు.అందుకు ప్రతిగా మంత్రులు ప్రతిస్పందన కాస్తా కటువు గానే ఉంది..కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందా లేదా అనే అంశం ప్రక్కన పెడితే..ఇక్కడ ఒక విషయం గుర్తించాలి.గొంతెండుతున్న ప్రజలు దాహం తీర్చడం ముఖ్యం.
అదే గోదావరి జలాలు ఆధారంగా కేంద్రం నిధులు తో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు గత నలభై ఏళ్ళుగా నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.పెండింగ్ లోనే కొట్టు మిట్టాడుతుంది.కానీ ఎవరేమన్నా, దానివెనుక ఉద్దేశ్యం ఏమున్నా కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేయడం ఒకరకంగా కేసీఆర్ పట్టుదలకు ,కార్యదీక్షకు నిదర్శనమే! తెలంగాణ ప్రధాన డిమాండ్ నీళ్ళు,నియామకాలు,నిధులు వివక్ష రూపు మాపడంలో అంతర్భాగంగా ఆయన తీసుకున్న సంకల్పం,బాధ్యత అనడంలో సందేహం లేదు.అంతరాష్ట్ర జలపంపిణి,వివాదాలు పరిశీలించినా కృష్ణా, గోదావరి ప్రవహిస్తున్న తెలంగాణా భౌగోళిక స్థితి గతులు (దక్కన్ పీఠభూమి ఎత్తు)సమీక్షించినా ఇంతకంటే గత్యంతరం లేదు.ఎందుకంటే గత మూడేళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్యాచరణ నీటిపారుదల రంగంలో అంత మెరుగ్గా కూడా లేదు! ఎండలు మండుతున్న ఎల్ నినో సందర్భంలో పంట భూముల సంగతి అటుంచి భూగర్భ జలాలు అడుగంటుతూ త్రాగు నీటిసమస్య తెలంగాణా ప్రజల్ని అతలాకుతలం చేస్తుంది.ఈదశలో ప్రతిపక్షాలు కాళేశ్వరం గుర్తు చేయడంలో తప్పులేదు.వీలైతే ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ నీళ్ళు వాడుకోవడం కూడా ధర్మమే! ప్రభుత్వం ప్రతిగా భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల సమస్య పై ప్రతివిమర్శకు దిగాల్సిన అవసరం లేదు.కానీ, అసహనానికి గురైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం లో నెత్తుటి భాష మాట్లాడడం అంత సమంజసంగా అనిపించ లేదు.
నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేత చంద్రబాబు నాయుడు నోటి నుండి పదేపదే “గొడ్డలి “పార్టీ అని ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఆయన ఇష్టం , ఆత్మానందం కావచ్చును.పదేపదే కార్యకర్తల్లో ద్వేష భావం నిలబెట్టడానికి, పెంచడానికి ఎత్తుగడ గా కావచ్చును.వాస్తవంగా పరోక్షంగా ఆయన కూడా రక్తం భాషనే మాట్లాడుతున్నట్లు లెక్క! .
అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకులు కూడా మా రక్తం ఇస్తాం,భూముల్లో చల్లండి.ప్రజల్ని రక్షించండి.ప్రతి విమర్శ కూడా అంత ప్రతి స్వరంలో అవసరం లేదు.ఎందుకంటే పాలకుల నైనా,ప్రతిపక్షాలనైనా ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారు.అర్థం చేసుకుంటూనే ఉంటారు.అంచనాలు కడతారు.ఎక్కడ వ్యక్తం చేయాలో అక్కడే వారి నిర్ణయం వ్యక్తం చేస్తారు.ఏ పక్షం పరుషంగా మాట్లాడినా ఆయా పార్టీల కార్యకర్తలు చప్పట్లు కొడతారే కానీ,ప్రజలకు అర్థం కాదు అనుకోవడం రాజకీయ పక్షాల అల్ప ఆలోచనా ధోరణి కి నిదర్శనం మాత్రమే అవుతుంది.ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేని అసహజ వాతావరణం నుండే ఇలాంటి నెత్తుటి భాష ,మరకలు ఉద్భవిస్తాయి అనేది జగమెరిగిన సత్యం.
ఇక పోతే ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి అసహన రాజకీయ వాతావరణం మే నడుస్తొంది.నిత్యం,అరెస్టులు,దా
ఇప్పటికే ఉత్తర భారత దేశం లో వివక్షలు,దాడులు, కూల్చివేతలు నిత్యకృత్యం అయ్యాయి.ఒక రకంగా ఉత్తర భారతదేశ రాజకీయాల్లో నెత్తుటి ఆనవాళ్ళు ఒక దశాబ్ద కాలంగా కొనసాగుతున్నాయి.ఇవన్నీ కొందరు ప్రజల అజ్ఞానం పెట్టుబడిగా పాలకులు పెంచి పోషిస్తున్న రాజకీయ క్రీడలే, అప్పుడప్పుడు పాలనా దుర్భలత్వం తో వెల్లడవుతున్న క్రీనీడలే.కానీ,మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిభాషలో నెత్తుటి భాష పలకడం చూస్తుంటే వాటిని ఆదర్శంగా స్వీకరిస్తున్నారనే భావం,ఆ ఆనవాళ్లు రేఖామాత్రంగా మాటల్లో కనిపిస్తున్నాయి.కనుక అసహనం, ఆందోళనకు గురౌతున్న పాలనా వైఫల్యాలు నుండే ఎక్కడైనా నెత్తుటి భాష స్థిరీకరణ జరుగుతుంది.కనుక పాలకులారా! ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త! రాజ్యాంగ ఉన్నత పదవిలో ఉండి ఏమి జారినా సరిదిద్దుకోవచ్చును.కానీ,మాట జారితే ,లేదా నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోవడం చాలా కష్టం,సాధ్యం కాదని కూడా పాలకులు గుర్తించడం మంచిది.అలాగే అధికార పక్షానికే కాదు ,ప్రతిపక్షాలకు సైతం అన్యోపదేశంగా నైనా ఇదే సూత్రం నూటికి నూరు శాతం వర్తిస్తుంది.





