అసెంబ్లీలో గెలిచిన పార్టీలు. ప్రజాస్వామ్యంలో ఓడిన ప్రజలు.!!

“మరోవైపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కేవలం ప్రతిపక్షం సభకు రాకుండా అడ్డుకునేందుకు మహిళా పోలీసులతో విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహిళలు కానిస్టేబుల్స్ ను ప్రభుత్వం కవచంలా ఉపయోగించింది..  అంతేకాదు, ఏకంగా అసెంబ్లీకి వస్తున్న ప్రతి పక్ష నేతలపై చరిత్రలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మహిళా పోలీసులతో లైంగిక వేధింపుల కేసులు పెట్టించి సమాజం సిగ్గుపడేలా సర్కారు వ్యవహరించింది..”
ప్రజాస్వామ్య ప్రజలే దేవుళ్ళు. చట్ట సభలే దేవాలయాలు. రాజ్యాంగమే ప్రజలకు పవిత్ర గ్రంథాలు. “ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు” ప్రభుత్వాలు ఏర్పడటమే  ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనమని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్  చెప్పాడు. ప్రజాస్వామ్యనికి కర్త కర్మ క్రియ అన్నీ ప్రజలే. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు గెలవాలి..పార్టీలు ఓడాలి అప్పుడే ప్రజాస్వామ్యమనుగడ మరింత పటిష్టంగా కొనసాగుతోంది. కానీ గత కొంతకాలంగా అందుకు పూర్తి భిన్నంగా ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం నిర్వచనమే పార్టీలు, పాలకులు మార్చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే అనుకుంటున్నారు. అంతకంటే బలమైన భావాన, లోతైన నిర్వచనం ఉందన్న సంగతి పార్టీలు కన్వీనియెంట్ గా మరిచిపోతున్నాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు, ఓట్లు, సీట్లు ఎంత ముఖ్యమో రాజ్యాంగ బద్ధమైన పాలన, చట్ట సభల్లో ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చలు కూడా అంతే ముఖ్యం. పార్లమెంట్, అసెంబ్లీలో అధికార ప్రతినిధి పక్షాల మధ్య చర్చలు జరగాలి. చుట్టూ సభల్లో ప్రజల సమస్యలపై చర్చలు ఎంత భాగా జరిగితే ప్రజాస్వామ్యం అంత వికసిస్తుంది. చట్ట సభల్లోనే కాదు ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడటం, ప్రశ్నించడం, అవకాశాల కోసం ఆందోళనలు, రాజ్యాంగం కల్పించిన  హక్కుల కోసం పోరాటాలు చేయడం,  పౌరులు సభలు, సమావేశాలు, సంఘాలు పెట్టుకుని సంఘటితమయ్యే వాతావరణం పాలకులు కల్పించడం అసలైన ప్రజాస్వామ్యం. .దురదృష్టవశాత్తు ఈ అంశాలన్ని ఇవాళ్టి ప్రజాస్వామ్యంలో క్రమంగా రద్దు చేయబడుతున్పాయి. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఒక్కటే నిర్వచనంగా నాయకులు మార్చారు. ఇప్పుడు ‘సర్’ పేరుతో దాన్ని కూడా రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి.  ప్రజల స్వేచ్ఛను హరిస్తూ కార్పోరేట్ కంపెనీల దోపిడీకి స్వేచ్ఛను తీసుకువచ్చారు. ఇవాళ ప్రజాస్వామ్యం నిర్వచనమే మార్చి దోపిడీ కోసం, దోపిడీ వర్గాల కోసం  దోచుకునే వాళ్ళ స్వేచ్ఛనే ఆధునిక ప్రజాస్వామ్యంటూ కొత్త నిర్వచనం పాలకులు ఇచ్చారు. ప్రజాస్వామ్యం కాస్తా దోపిడీస్వామ్యంగా మారింది.

ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన చట్ట సభల్లో రాజకీయ ప్రతీకార చర్యలపై చర్చలు జరుపుతున్నారు. వ్యక్తిగత కక్షలు, వెండేటా రాజకీయాలకు కేంద్రంగా మార్చుతున్నారు. పార్లమెంట్ లో అయిన రాష్ట్రాల అసెంబ్లీలో అయిన చాలా చర్చలు ప్రతిపక్షాలు లేకుండానే జరుగుతున్నాయి. విపక్షాలను చట్ట సభల నుంచి సస్పెండ్ చేస్తూ, ప్రజా ప్రతినిధుల హక్కులే కాదు, వాళ్ళకు ఓట్లేసి గెలిపించిన కోట్లాదిమంది ప్రజల హక్కులను కూడా అధికార పార్టీలు చేస్తున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా ఏమీ లేదు అన్నీ పార్టీలది అదే ఎజెండా. పార్టీల భావాలు, సిద్దాంతాలు మేనిఫెస్టోలు వేరు కావొచ్చు గానీ ఆలోచన మాత్రం ఒక్కటే. ఇవాళా ప్రభుత్వాలు చేసే బిల్లులు, పాలసీలు న్యాయ స్థానంలో రద్దు కాకుండా చట్ట సభల్లో విపక్షాలు లేకుండానే  అధికార పార్టీ నేతలే ఏక పక్షంగా చర్చించి చట్టాలు, పాలసీలు చేస్తున్నారు. ప్రతి పక్షాలు లేకుండా అధికార పార్టీలు చట్ట సభల్లో చేసే బిల్లులు టెక్నికల్ గా చట్టాలుగా మారుతాయి కావొచ్చు కానీ అందులో మెజారిటీ ప్రజల అభిప్రాయాలుగా చూడలేం..ఎందుకంటే అధికార పార్టీలకు 40 శాతం ఓట్లోస్తే, విపక్షాలకు 60 శాతం వస్తాయి. చట్ట సభల్లో  విపక్షాలు లేకుండానే ఆమోదించిన బిల్లులు సాంకేతికంగా చట్ట రూపం ధరించిన ఇది నిజమైనా డెమొక్రసికి  కొలమానం కాదు. అసంపూర్ణ ప్రజాస్వామ్యంగా భావించాల్సి ఉంటుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి కానీ ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడంలో విఫలమైతున్నాయి. అంతిమంగా ప్రజలు ఓడిపోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓడిపోవడం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం. పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వరకు ప్రతిపక్షాల విశ్వాసం లేకుండానే సభలో సాగుతున్నాయి. పాలనలోనే కాదు సభలను నడపడంలో కూడా ప్రభుత్వాలు బుల్డోజర్ విధానాలు అమలు చేస్తున్నాయి. ప్రతి పక్షాలకు ఏదో దురుద్ధేశాలు అంటగట్టి అన్నీ రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్షాలను టార్గెట్ చేసినట్లే చట్ట సభల్లో స్పీకర్ వ్యవస్థను చెరబట్టిన అధికార ట్రెజరీ బెంచ్ లు ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ చట్టాలను ఏకపక్షంగా ఆమోదించుకుంటూ ప్రజాస్వామ్యనికి ప్రమాదకర పరిస్థితులు తీసుకువచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల దగ్గరకు వద్దాం. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో పై చేయి సాధించేందుకు అధికార, ప్రతి పక్షాలు తమ రాజకీయ వ్యూహంలో సభ హుందాతనాన్ని దిగజారుతున్నారు. ప్రత్యార్థులపై ఆధిపత్యం కోసం పోటీ పడుతు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

దళితవాదం, స్త్రీవాదం ముసుగులో అసెంబ్లీలో ప్రజా వాదంపై చర్చ లేకుండా పోయింది. అసెంబ్లీ వస్తున్న ప్రతిపక్షాలను పోలీసులను అడ్డుపెట్టి ప్రభుత్వం అడ్డుకుంది. మహిళల పోలీసులను ముందు పెట్టి సర్కారు చిల్లర రాజకీయాలు చేసింది. అటు ప్రతి పక్షం సహనం కోల్పోయి మాట్లాడారు. ఇంకోవైపు కేసీఆర్ చావు కోరుకుంటున్నాం, కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ చావు డప్పు కొట్టింది. మరోవైపు తమ హక్కులను ప్రభుత్వం హరిస్తుందని, తమ మహిళా ఎమ్మెల్యేల పట్ల సంస్కారహీనంగా పోలీసులు వ్యవహరించారని ప్రతిపక్షం గరవ్నర్ కు, జాతీయ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేస్తుంటే, ఇంకోవైపు ప్రభుత్వం మహిళా పోలీస్ కానిస్టేబుళ్లతో ప్రతిపక్ష నేతలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అధికార ప్రతి పక్షాలు ఎక్కడ తగ్గడం లేదు. ప్రత్యర్థులపై ఆధిపత్యం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల ఎజెండా ప్రాధాన్యతలే మారిపోయాయి. ప్రభుత్వం వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సభలో చర్చించే అవకాశమే లేకుండా పోయింది.

అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సక్సెస్ కావొచ్చు కానీ, సభలో చర్చించనంత మాత్రానా ప్రతి పక్షాన్ని మాట్లాడకుండా చేసినంత మాత్రాన ప్రజల నుంచి సమస్యలను దూరం కావు. వెరసి అవి మరింతగా ప్రజల్లో చర్చకు దారితీస్తుంది. తమ సమస్యలపై ప్రతిపక్షం సభలో మాట్లాడాలి, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టి పరిష్కారం చూపించాలి ప్రజలు కోరుకుంటారు. అయితే ప్రభుత్వం సభలో ప్రతి పక్షం గొంతు నొక్కితే ప్రజలే మరింత బలంగా గొత్తెత్తుతారు. చరిత్ర పొడవునా ఇదే చూశాం, మొన్నటికి మొన్న దేశంలో జెన్ జీ తరం పోరాటం చూశాం. ఈ వారం రోజుల అసెంబ్లీ సమావేశాలను గమనిస్తే రాష్ట్రంలో పోటాపోటీ ఎత్తుగడలతో రాజకీయ పార్టీలు గెలిచాయి..కానీ తన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనుకుని పార్టీలను గెలిపించిన ప్రజలు మాత్రం ఓడిపోయారని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓడిపోరని ప్రజాస్వామ్యం బలంగా ఉండాలని కోరుకునేవారు మాట్లాటవచ్చు, కానీ ఎన్నికల వ్యవస్థ, చట్ట సభల్లో జరుగుతున్న చర్చలను చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రస్తుతం ప్రజలు ఓడిపోతున్నారని చెప్పక తప్పదు. ఈ మాట ప్రజాస్వామ్యవాదులకు నచ్చకపోవచ్చు, జీర్ణించుకోకపోవచ్చు కానీ జరుగుతున్నది అదే అన్నది చెప్పుకోవాల్సిందే.

“మరోవైపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కేవలం ప్రతిపక్షం సభకు రాకుండా అడ్డుకునేందుకు మహిళా పోలీసులతో విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహిళలు కానిస్టేబుల్స్ ను ప్రభుత్వం కవచంలా ఉపయోగించింది.. అంతేకాదు, ఏకంగా అసెంబ్లీకి వస్తున్న ప్రతి పక్ష నేతలపై చరిత్రలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మహిళా పోలీసులతో లైంగిక వేధింపుల కేసులు పెట్టించి సమాజం సిగ్గుపడేలా సర్కారు వ్యవహరించింది..”ఇది కద అద్భుతమైన ఇందిరమ్మ పాలన, వండర్ ఫుల్ ప్రజా పాలన. ప్రతి పక్ష నేతలపై ఇలాంటి చిల్లర, సమాజం సిగ్గుపడేలా కేసులు పెట్టడం దేశ రాజకీయ చరిత్రలో ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి వెలుతుంటే అడ్డుకోవడమే పోలీసు శాఖ చేసిన తప్పని స్వయంగా న్యాయ స్థానం చెప్పింది. దాని తప్పించుకోకే క్రమంలో తప్పుల మీద తప్పులు డిపార్ట్మెంట్ చేస్తోంది.

.అసెంబ్లీలో ప్రభుత్వం అసమర్థ, రేవంత్ ఫేక్ అకౌంట్ తో సభలో తప్పుడు ప్రచారం చేసి నువ్వులపాలై ఇప్పుడు దాని డైవర్షన్ కోసం ఏఐ ఫోటోలు విడుదల చేస్తూ, మహిళా పోలీసులను అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.దీనిపై కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ సిగ్గుపడాలి. సరే ప్రతీకారంతో ప్రతి పక్ష నేతలపై కేసులు పెట్టాలనుకుంటే పెట్టొచ్చు..కానీ సభ్య సమాజం సిగ్గుపడేలా ఇలాంటి లైంగిక వేధింపుల సెక్షన్ల కింద కేసులు పెట్టడం అంటే అది కాంగ్రెస్ చిల్లర బుద్ధికి నిదర్శనం. అనవసరంగా మహిళలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వారిని బెదిరించి ఇలాంటి కేసులు పెట్టించి రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ సంతోష పడవచ్చు. కుల రాజకీయాలతో ఈ సెషన్ నుంచి గట్టేకామని ఆనందపడవచ్చు, కానీ కుల రాజకీయాలతో రాష్ట్రానికే కాదు ప్రజలకు నష్టమే.

ఇలాంటి కేసులు భవిష్యత్తు రాజకీయాలను కలుషితం చేస్తాయి. ఇవాళా అధికారం ఉందని, డిపార్ట్మెంట్ చేతిలో ఉందని, భజన చేసే మీడియా ఉందని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం, సంచలనాల కోసం ఇలాంటి లైంగిక వేధింపుల సెక్షన్లు పెట్టి పబ్బం గడుపుతారు కావచ్చు. కానీ భవిష్యత్తు రాజకీయాలకు ఇది చెడు ప్రాక్టీస్. ఇలాంటి రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీని అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళా అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఏమీ తెలియని అమాయక మహిళా పోలీసులను అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తూ చిల్లర కేసులు పెట్టినట్లే దేశంలో ప్రధాన ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ మీద కూడా ఇలాంటి లైంగిక వేధింపులు బీజేపీ పెట్టవచ్చు. సభకు వస్తున్న ప్రతిపక్షాలపై లైంగిక వేధింపులు పెట్టాలన్న దారి కేంద్రానికి రేవంత్ రెడ్డి చూపిస్తున్నట్లు ఉంది. రేవంత్ రెడ్డిలాగా, కాంగ్రెస్ లాగా అలాంటి కు సంస్కార రాజకీయాలు , దిగజారుడు రాజకీయాలు బీజేపీ చేయదనే అనుకుంటున్న.

ఇక్కడ ఇంకో విషయం కూడా మరిచిపోవద్దు. ప్రజాస్వామ్యం పాలన, రాజ్యాంగ బద్ధమైన పాలన, ఏడో గ్యారంటీ అయిన పౌర హక్కుల పాలన అని బొక్కబోర్లా పడ్డా ప్రజాస్వామ్యవాదులకు, పౌర హక్కుల సంఘాలకు, చివరికి కాంగ్రెస్ ను భుజాన మోస్తూ, అసెంబ్లీలో రేవంత్ భజన చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు కూడా ఇది ఒక హెచ్చరిక. రేపు కమ్యూనిస్టు పార్టీలు చేసే పోరాటాలను మహిళా పోలీసులను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలపై లైంగిక వేధింపుల కూడా పెట్టవచ్చు. అంతేకాదు విద్యార్థి యువజన పోరాటాలను కూడా ఇలాంటి శిఖండి రాజకీయాలతో అణచివేయవచ్చు. భవిష్యత్తులో హక్కుల కోసం, ప్రజల కోసం పనిచేసే వారిని, ధర్నాలు చేసే సంఘాలపై కూడా మహిళా పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలు ఉద్యమకారులపై లైంగిక వేధింపుల కేసులు పెట్టే ప్రమాదం లేకపోలేదు. ఉద్యమాలను అడ్డుకునేందుకు, ఉద్యమకారులను వేధించేందు ఇప్పటిలాగే మహిళలు పోలీసులను అడ్డుపెట్టుకుని లైంగిక వేధింపుల కేసులతో అణచివేయవచ్చు. ఇలాంటి సంప్రదాయం ప్రజాస్వామ్యానికి, ప్రజా పోరాటాలకు, పౌర సంఘాల భవిష్యత్తు ఉద్యమాలకు తీరని నష్టం చేస్తోంది.

తస్మాత్ జాగ్రత్త..!!

-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *