“ఇప్పటి పరిస్థితులు సమీక్ష చేస్తే జల వివాదాలు పరిష్కారం దేవుడెరుగు సమావేశం ఈ నెలాఖరులో జరుగుతుందా? అనే అనుమానం కూడా వుంది. ఎందుకంటే గత అనుభవం మన ముండుంది. ఎజెండాపైననే ఏకీభావం లేక పోతే సామరస్యంగా సమస్య మూలాలలోనికి వెళ్లి ఏలా చర్చలు జరుపుతారు? గోదావరిలో ఎంత నీరు వుందో అంచనా లేకనే తెలంగాణకు చెంది ఏడు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారని ఆంధ్ర ప్రదేశ్ అధికారులు లేవ నెత్తిన అంశంపై తెలంగాణ అధికారులు దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులు తిరిగి సమీక్ష చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కోరింది. ఈ ఏడు ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వుంది..”
గత వారం ప్రజాతంత్రలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకెక్కడి సయోధ్య అని నేను రాసినట్లే మొన్న 7 వతేదీ దిల్లీ లో జరిగిన జల వివాదాల సమన్వయ కమిటీ సమావేశంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతోనే సరి పెట్టారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరే పరిస్థితి కన్పించడం లేదు. గమనార్హమైన అంశమేమంటే గత జనవరిలో ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశం ఎజెండా రూప కల్పనకు సరిపెట్టారు. ఈ కమిటీకి అధ్యక్షత వహించిన కేంద్ర జల సంఘం ఛైర్మన్ తమ తమ ఎజెండాలు పది రోజుల్లో సమర్పించమని చెప్పి అప్పట్లో సమావేశాన్ని వాయిదా వేశారు. పది రోజుల్లో కాదు కదా! నెలలు గడచి పోయాయి. నిన్న మొన్నటి వరకు ఎవరూ తమ ఎజెండా సమర్పించ లేదు. ఏడు నెలల తర్వాత మరల మొన్న 7 వతేదీ దిల్లీలో కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ ప్రసాద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అసంపూర్ణిగా తమ ఎజెండా ఇచ్చింది. తెలంగాణ కూడా పది అంశాలతో తమ ఎజెండా సమర్పించింది. తమాషా ఏమంటే సమావేశం నిర్వహణకు పూర్తి ఎజెండా ఖరారు కాకనే రెండు రాష్ట్రాల అధికారులు వాదులాడుకొన్నారు.
ప్రధానంగా శ్రీ శైలం జలాశయంలో విద్యుదుత్పత్తిపై వాదోపవాదాలు జరిగాయి. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ ప్రసాద్ చిర్రెత్తుకొచ్చిందో ఏమో సమావేశాన్ని వాయిదా వేశారు. పది రోజుల్లో రెండు రాష్ట్రాలు తమ పూర్తి ఎజెండాలను పంపాలని తదుపరి ఈ ఎజెండాలను పరస్పరం పంపి ఆమోదం తీసుకొని రెండు వారాల తర్వాత సమావేశం నిర్వహించుతానని చెప్పి చేతులు దులుపుకున్నట్లుంది. ఇప్పటి పరిస్థితులు సమీక్ష చేస్తే జల వివాదాలు పరిష్కారం దేవుడెరుగు సమావేశం ఈ నెలాఖరులో జరుగుతుందా? అనే అనుమానం కూడా వుంది. ఎందుకంటే గత అనుభవం మన ముండుంది. ఎజెండాపైననే ఏకీభావం లేక పోతే సామరస్యంగా సమస్య మూలాలలోనికి వెళ్లి ఏలా చర్చలు జరుపుతారు? గోదావరిలో ఎంత నీరు వుందో అంచనా లేకనే తెలంగాణకు చెంది ఏడు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారని ఆంధ్ర ప్రదేశ్ అధికారులు లేవ నెత్తిన అంశంపై తెలంగాణ అధికారులు దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులు తిరిగి సమీక్ష చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కోరింది. ఈ ఏడు ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వుంది.
పైగా గోదావరిలో ఎంత నీరు వుంది? ఎవరి వాటా ఎంతో తేల్చేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ నియమించాలని ఈ పాటికే ఆంధ్ర ప్రదేశ్ తమ ఎజెండాలో చేర్చివుంది. అయితే కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ ప్రసాద్ జోక్యం చేసుకొంటూ ఈ ఏడు ప్రాజెక్టులకు నిబంధనల మేరకే అనుమతులు ఇవ్వబడ్డాయని ప్రకటించి ఆంధ్ర ప్రదేశ్ వాదనకు తెర దించారు. కాని గోదావరి ట్రిబ్యునల్ కు తెలంగాణ అంగీకరించదు. పైగా తమ వాటా 968 టియంసిలంటే ఆంధ్ర ప్రదేశ్ తమ వాటా 776 టియంసిలంటోంది.
మరొక కీలక మైన అంశమూ ఆంధ్ర ప్రదేశ్ లేవనెత్తుతోంది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ నదిపై అనుమతులు లేకుండా నిర్మించే ప్రాజెక్టులను సమీక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ కోరుతోంది. ఈ అంశాలు ఎజెండాలో వుంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించక పోవచ్చు. ప్రతి పక్ష బిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును పవిత్రమైన దేవాలయంగా భావిస్తోంది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్లు ఢిల్లీ సమావేశంలో పోలవరం బనకచర్ల అనుసంధాన పథకం ఆమోదించుతారని బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రకటనలు దిల్లీ సమావేశం ముందుటి రోజు ప్రకటనలు గుప్పించారు. వాస్తవంలో ఇందుకు భిన్నంగా జరిగినా ఆంధ్ర ప్రదేశ్ వాదనను పూర్వ పక్షం చేయడంలో ముందుంటుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ తమ ఎజెండాలో బనకచర్ల అనుసంధానం మాత్రం చేర్చింది. ఎప్పుడో కేంద్ర జల శక్తి శాఖ కు చెందిన సాంకేతిక సలహా మండలి ఆమోదించిన ఏడు ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ తిరగతోడుతుంటే తీవ్ర వివాదంలో చిక్కుకున్న బనకచర్ల ప్రాజెక్టు ఎజెండాలో వుండేందుకు తెలంగాణ అంగీకరించుతుందా?లేక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పోటీగా పెడుతుందా?
మొన్న 7 వతేదీ దిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణ సలహాదారు ఆదిత్యనాద్ దాస్ మాట్లాడుతూ 2014 ముందు ప్రతి పాదనల్లో వుండిన తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ అంగీకరించితే 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించి ప్రాజెక్టులను తెలంగాణ ఆమోదించుతుందని చెప్పారు. ఈ ఫార్ములా పరిశీలించితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలుకు బనకచర్ల అనుసంధానానికి పోటీ పెడుతున్నట్లు భావించాలి. అయితే ఇది ఎంత వరకు సాధ్యమో వేచి చూడాలి.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం పైననే కెసిఆర్ ఎన్నికల వరకు తన ఎజెండా జల యుద్ధం మని ప్రకటించిన నేపథ్యంలో మరీ ఆంధ్ర ప్రదేశ్ మరింత పొగ బెడుతున్నందున నీళ్ళే నిప్పులు అవుతాయోమో. ఈ ప్రభావం జల వివాదాల కమిటీ ఎజెండా రూప కల్పనపై తప్పక వుంటుంది.
మరో వేపు తెలంగాణ సమర్పించిందని చెప్పబడుతున్న ఎజెండాను ఆంధ్ర ప్రదేశ్ అంగీకరించ వచ్చు. అయితే ఆమోదానికి వచ్చే సరికి ససేమిరా అనక తప్పదు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణా జలాలను ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో పెంచుకోవాలని తెలంగాణ కోరింది. ఈ అంశం రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి నానుతోంది. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలకు ఆంధ్ర ప్రదేశ్ ఆమోదం తెలపాలని కోరుతోంది. ఇవన్నీ అటుంచి శ్రీ శైలంలో జల విద్యుత్ తమ హక్కనే ధోరణిలో తెలంగాణ వ్యవహరిస్తోంది. వాస్తవంలో ఈ ప్రాజెక్టును విద్యుదుత్పత్తి కోసం నిర్మించారని తెలంగాణ చెబుతోంది. అంతే కాకుండా పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఆంధ్ర ప్రదేశ్ 34 టియంసిలు మాత్రమే తీసుకొనే హక్కు వుందని తెలంగాణ ఎజెండాలో పొందుపర్చిందని చెబుతున్నారు. అంతిమంగా రెండు రాష్ట్రాలు పూర్తి ఎజెండా తయారు చేస్తే మరెన్ని వివాదాంశాలు చోటు చేసుకొంటాయో వేచి చూడాల్సిందే.





