ఎడ్లబండ్ల నుండి స్వయంచోదిత కార్ల దాకా: జీవనయానం

“ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే: ఎడ్లబండి నుండి అటానమస్ కారు వరకు మనం సాధించిన భౌతిక ప్రగతి అపారమైనది. అందులో సందేహం ఇసుమంతైనా లేదనే అనాలి. అనక తప్పాడు. సాంకేతికత మనకు వేగాన్ని, అపరిమితమైన సౌకర్యాన్ని ఇచ్చిందేకానీ, అదే సమయంలో ప్రకృతితో మనకున్న సహజమైన బంధాన్ని, ఆత్మీయమైన జీవన శైలిని దూరం చేసింది, ఇంకా చేస్తూ పోతున్నది..”

(గత వారం తరువాయి ) 

మనం ఆహారం తినే పాత్రలను గమనిస్తే: పర్యావరణ హితమైన జీవనశైలి నుండి ‘వాడి పారేసే’ (డిస్పోజబుల్) సంస్కృతి వైపు మనం ఎంతగా మారిపోయామో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు చేత్తో కుట్టిన మోదుగ ఆకులు లేదా తాజా అరటి ఆకులలో ఎంతో రాజసంగా భోజనం చేసేవాళ్లం. ఆ తర్వాత కాలంలో రాతివెండి, అల్యూమినియం, స్టీల్ ప్లేట్ల వాడకం మొదలైంది. ఇక ధనవంతులైతే మధ్యలో ఒక చిన్న బంగారు పువ్వు డిజైన్ చెక్కబడిన అద్భుతమైన వెండి పళ్లాలలో భోజనం చేసేవారు. ఆ తర్వాత పగిలిపోయే పింగాణీ (పోర్సిలిన్) పాత్రల కాలం వచ్చింది. కానీ నేడు వాటన్నింటి స్థానాన్ని ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న పేపర్ ప్లేట్లు పూర్తిగా ఆక్రమించాయి. మన కప్పులు, గ్లాసులు కూడా ఇదే చౌకబారు ‘యూజ్ అండ్ త్రో’ పద్ధతిని అనుసరించడం వల్ల పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాల కొండలు పేరుకుపోతున్నాయి. ఇప్పుడదీ వ్యాపారమే!

ఒకప్పుడు స్నానం చేయడం అనేది పల్లెటూరి తెరిచిన బావుల నుండి బరువైన బకెట్లతో నీళ్లను తోడటంతో కూడిన ఒక శక్తివంతమైన, చన్నీళ్ల సంప్రదాయం. ఇక వేడి నీళ్ల విషయానికి వస్తే, భారీ రాగి కాగుల (పాత్రల) కింద ఎండిన కంది కట్టెలు లేదా తుమ్మ చెక్కల వంటి వ్యవసాయ వ్యర్థాలను కాల్చేవాళ్లం. ఈ పద్ధతి కాలక్రమేణా పొట్టు పొయ్యిలు, పొగలేని రాకెట్ స్టోవ్‌లు, బొగ్గు కుంపట్లు, కిరోసిన్ స్టోవ్‌లు, ఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ రాడ్ల (వాటర్ హీటర్లు) వైపు పరిణామం చెందింది. ఆపై కొద్దిరోజుల్లోనే భారీ స్టోరేజ్ ట్యాంక్ గీజర్లు, విద్యుత్ ఆదా చేసే హీట్ పంపులు, ఇంటి పైకప్పులపై సోలార్ హీటర్లు, అప్పటికప్పుడు నీటిని ఉడికించే అత్యాధునిక డిస్పెన్సర్ టాప్‌ల వైపు మనం మారిపోయాము. సహజ వనరుల వాడకం నుండి, యాంత్రికం అలవాటుగా మారింది.

మనం పడుకునే పరుపులు, మంచాలు కూడా ఇలాగే ప్రకృతికి దగ్గరగా ఉండే సహజమైన వస్తువుల నుండి కృత్రిమమైన సౌకర్యవంతమైన వ్యవస్థలుగా రూపాంతరం చెందాయి. నేలపై పరిచే (ఈత, తుంగ) చాపల నుండి, గట్టి చెక్క బల్లలపైకి, ఆపై పట్టుసడలని ‘నులక మంచాల’ (రోప్ కాట్స్) పైకి ప్రయాణించాము. ఇది కాస్తా ‘నవారు మంచాలు’, పత్తి పరుపులతో కూడిన సింగిల్ ఉడెన్ బెడ్‌లు, స్టీల్ స్ప్రింగ్‌లతో కూడిన డబుల్ కాట్ మంచాలుగా మారింది. నేడు, ఇళ్లలో ఒంటి నొప్పుల నుండి ఉపశమనం కలిగించే (పోనీ నొప్పులు కలిగించే!) మెమరీ ఫోమ్ లేదా లాటెక్స్ పొరలతో కూడిన భారీ క్వీన్, కింగ్-సైజ్ బెడ్‌లు దర్శనమిస్తున్నాయి. తాజా ఆవిష్కరణల విషయానికి వస్తే: మనకు నచ్చినట్లు వంగే స్మార్ట్ అడ్జస్టబుల్ బెడ్‌లు, కృత్రిమ వాతావరణాన్ని నియంత్రించే అత్యంత ఆధునికమైన ‘స్లీప్ పాడ్’ (Sleep Pod) వ్యవస్థల వరకు మన కల్తీ నిద్ర చేరుకుంది.

మనం కప్పుకునే దుప్పట్లు, పరిచే బెడ్షీట్స్ కూడా పల్లెటూరి చేతివృత్తుల తయారీ నుండి భారీగా ఉత్పత్తి చేయబడే సింథటిక్ వస్త్రాలుగా మారిపోయాయి. నా చిన్ననాటి రోజుల్లో స్థానిక చేనేత కుటుంబాలు ఎంతో ప్రేమతో నేసిన గరుకైన దుప్పట్లు ఉండేవి. అందులో పొడవైన-వెడల్పైన సాంప్రదాయ ‘ఏడు మూరల దుప్పటి’ ఒక ప్రత్యేకమైనది. ఈ దుప్పట్లు బాగా అరిగిపోయి పల్చగా మారినప్పుడు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాటన్నింటినీ కలిపి చేత్తో కుట్టి, బరువైన పొరల బొంతగా (రజాయిగా) మార్చేవారు. ఆ తర్వాత కాలంలో మిల్లుల్లో తయారయ్యే సోలాపూర్ కాటన్ చద్దర్లు, సింథటిక్ దుప్పట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈజిప్షియన్ కాటన్ బెడ్‌షీట్లు, కంఫర్టర్లు, శరీర బరువును సమన్వయం చేసే స్మార్ట్ వెయిటెడ్ బ్లాంకెట్ల కింద ప్రస్తుతం నిద్రిస్తున్నాము.

ఒకప్పుడు ఎంతో శ్రమతో, వ్యాయాయంతో కూడుకున్న, సామూహికంగా బట్టలు ఉతికే పద్ధతి, తద్వారా కొందరికి ఉపాధి లభించే అవకాశం, నేడు పూర్తిగా ఆటోమేటిక్, నీటి అవసరం లేని సరికొత్త సాంకేతికత వైపు మళ్లింది. పల్లెటూరి రజకులు (చాకలివారు) వచ్చి బట్టలను సేకరించి, స్థానిక వాగుల-చెరువుల దగ్గరకు తీసుకెళ్లి, బండలపై బాది ఉతికి, తీరాన ఆరబెట్టేవారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ ఇంటి లోపలికి మారి, రాగి కాగులలో బట్టలు ఉడకబెట్టడం, చెక్క స్క్రబ్బింగ్ బోర్డులు, లాండ్రీ సబ్బు బిళ్లల కాలం వచ్చింది. త్వరలోనే సెమీ-ఆటోమేటిక్ ట్విన్-టబ్ మెషీన్లు, ఆపై ఫుల్లీ ఆటోమేటిక్ టాప్-లోడింగ్ మెషీన్లు వచ్చాయి. క్రమేపీ, AI ఫ్యాబ్రిక్ సెన్సార్లు, స్టీమ్-శానిటైజింగ్, నీటి అవసరంలేని అల్ట్రాసోనిక్ వాషర్-డ్రైయర్ కాంబోలతో కూడిన ఫ్రంట్-లోడర్లు వచ్చాయి. మన పూర్వీకుల వంట పద్ధతులు, దుస్తుల సంరక్షణ పూర్తిగా విప్లవాత్మకమైన మార్పులకు లోనై, మన గృహ జీవిత వేగాన్ని, పరికరాలను, అసలు నైజాన్నే మార్చివేశాయి. దుస్తుల ఇస్త్రీ విషయానికి వస్తే, నిప్పు కణికలతో నింపిన బరువైన బొగ్గు ఇస్త్రీ పెట్టెలతో ప్రారంభమై, దశాబ్దాల కాలంలో సాధారణ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సులుగా, నేడు దుస్తులను ఆటోమేటిక్‌గా ఇస్త్రీ చేసే స్మార్ట్ స్టీమ్ క్లోసెట్‌లుగా (Steam Closets) రూపాంతరం చెందాయి.

అదేవిధంగా, వంట ప్రక్రియ కూడా నిదానంగా మండే బొగ్గు పొయ్యిలు, మట్టి పాత్రల నుండి, పోర్టబుల్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్లు, పైప్‌డ్ గ్యాస్ లైన్ల వైపు పరిణామం చెందింది. నేడు, సాంప్రదాయ ప్రెజర్ కుక్కర్లు కూడా పక్కకు నెట్టబడి, వాటి స్థానంలో క్లీన్ ఇండక్షన్ స్టోవ్‌లు, శీఘ్రంగా వండే ఎయిర్ ఫ్రైయర్‌లు, AI మార్గదర్శకత్వంలో పనిచేసే కౌంటర్‌టాప్ మల్టీ-కుక్కర్‌లు వచ్చేశాయి. ఈ ఆధునిక గృహోపకరణాలు మన వంటగదులకు అపూర్వమైన వేగాన్ని తీసుకువచ్చాయనేది నిశ్చయమే, అయినప్పటికీ అవి సాంప్రదాయ గృహ వంటకాలలో ఉండే ఆ నిదానమైన, ఆత్మీయమైన కమ్మదనాన్ని మాత్రం పూర్తిగా దూరం చేశాయి.

ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే: ఎడ్లబండి నుండి అటానమస్ కారు వరకు మనం సాధించిన భౌతిక ప్రగతి అపారమైనది. అందులో సందేహం ఇసుమంతైనా లేదనే అనాలి. అనక తప్పాడు. సాంకేతికత మనకు వేగాన్ని, అపరిమితమైన సౌకర్యాన్ని ఇచ్చిందేకానీ, అదే సమయంలో ప్రకృతితో మనకున్న సహజమైన బంధాన్ని, ఆత్మీయమైన జీవన శైలిని దూరం చేసింది, ఇంకా చేస్తూ పోతున్నది. అయితే, ఈ మార్పులను కేవలం ‘అనివార్యమైన దుష్పరిణామాలు’ (necessary evils) అని సరిపెట్టుకోలేము. ఎందుకంటే, తప్పు సాంకేతికతది కాదు. సౌకర్యం కోసం ప్రాకులాడుతూ కల్తీని ప్రోత్సహిస్తున్న బహుళజాతి కంపెనీల వ్యాపార శైలిది. ఆ బ్రాండ్ల మాయలో పడి అసలైన మూలాలను మరుస్తున్న మన వినియోగదారుల వైఖరిది! పరోక్షంగా వీటి వాడకానికి మద్దతునిస్తున్న ప్రభుత్వాలది. ప్రగతి బాటలో ముందుకు సాగుదాం, కానీ మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకునే విచక్షణను కోల్పోకూడదనేదే ఈ తరం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *