
kinjarapuamaravathi588@gmail.com
ప్రస్తుతం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నెల మొత్తానికి కలిపి సుమారు 70 రోజుల ముందే ఒకేరోజు ఒకేసారి విడుదల చేస్తున్నారు. రోజుకు సుమారు ఇరవై వేల చొప్పున లెక్కిస్తే, నెలకు దాదాపు ఆరు లక్షల టికెట్లు ఒకే సమయంలో విడుదల కావడం వల్ల సర్వర్లపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోంది. ఫలితంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారికే కొంత ప్రయోజనం కలుగుతుండగా గ్రామీణ ప్రాంతాల భక్తులు వెనుకబడుతున్నారు. ఐదు నుంచి ఆరు నిమిషాల కౌంట్‌డౌన్ పూర్తయిన తర్వాత కూడా సమయ పరిధిని ఎంపిక చేస్తే “మీరు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్న స్లాట్‌ను వేరేవారు ప్రయత్నిస్తున్నారు” అనే సందేశం కనిపించడం, చివరి దశలో చెల్లింపు విఫలం కావడం వంటి సమస్యలు భక్తుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి.
ఈ పరిస్థితికి పరిష్కారం క్లిష్టమైనది కాదు. నెల మొత్తానికి ఒకేసారి కాకుండా దర్శన తేదీకి నిర్దిష్ట రోజుల ముందుగా ప్రతిరోజూ ఆయా రోజుకు సంబంధించిన టికెట్లను మాత్రమే విడుదల చేయాలి. ముందుగానే టికెట్ రద్దు చేసుకునే అవకాశం కల్పించి, రద్దైన టికెట్లను వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న భక్తులకు స్వయంచాలకంగా కేటాయిస్తే ఒక్క దర్శన అవకాశం కూడా వృథా కాకుండా చూడవచ్చు. టికెట్ లేదా వసతి బుక్ చేసుకునే ప్రతిసారీ పేరు, వయస్సు, ఆధార్ నంబర్, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాలన్నింటినీ మళ్లీ నమోదు చేయాల్సి వస్తోంది. టికెట్లు క్షణాల్లో పూర్తవుతున్న సమయంలో ఈ ప్రక్రియ విలువైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా, తొందరపాటులో వివరాలు తప్పుగా నమోదయ్యే ప్రమాదాన్ని పెంచుతోంది. వాటిని తర్వాత సవరించుకునే అవకాశం కూడా లేకపోవడం మరో లోపం. భక్తులు ముందుగానే తమ కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించిన శాశ్వత ప్రొఫైల్‌గా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి. బుకింగ్ సమయంలో కేవలం ఆ ప్రొఫైల్‌ను ఎంపిక చేస్తే సరిపోయే విధంగా వ్యవస్థను రూపొందించాలి. భవిష్యత్తులో దర్శనం, వసతి, ఆర్జిత సేవలన్నింటినీ ఒకే డిజిటల్ పాస్‌తో అనుసంధానిస్తే మరింత సౌలభ్యం కలుగుతుంది.
తిరుమల, తిరుపతి వసతి గదుల కోటాలను ఒకేసారి విడుదల చేయడం వల్ల సర్వర్లపై అదనపు భారం పడుతోంది. రెండు ప్రాంతాలకు వేర్వేరు రోజుల్లో బుకింగ్ ప్రారంభిస్తే ఈ సమస్య గణనీయంగా తగ్గుతుంది. వసతి గదుల బుకింగ్‌ను కూడా దర్శన టికెట్ల మాదిరిగానే రోజువారీ విధానంలోకి తీసుకురావాలి. లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం వంటి ఆర్జిత సేవలు పొందిన భక్తులకు తిరుమలలో వసతి దొరకకపోవడం మరో ప్రధాన సమస్య. తెల్లవారుజామున జరిగే సేవలకు హాజరయ్యే భక్తులకు సేవా టికెట్‌తో పాటు వసతిని కూడా అనుసంధానించడం ద్వారా అనవసర ఇబ్బందులు తొలగిపోతాయి. ఆన్‌లైన్ ద్వారా వసతి పొందిన భక్తులు కొండపైకి చేరుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ ధ్రువీకరణ కోసం తప్పనిసరిగా కేంద్రీయ వసతి కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడి నుంచి కేటాయించిన కాటేజీలకు లగేజీతో చేరుకోవడం వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలకు భారంగా మారుతోంది. కొండపై వివిధ ప్రాంతాల్లో ధ్రువీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ సమస్య చాలావరకు తగ్గుతుంది.
“కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడం టీటీడీకి భగవంతుడు అప్పగించిన పవిత్రమైన బాధ్యత. సాంకేతికత భక్తులకు అడ్డంకిగా మారిన రోజు అది సంస్కరణ కాదు,సాంకేతిక వ్యవస్థ వైఫల్యానికి సంకేతం. రోజుకు ఎంతమందికి దర్శనం కల్పించిందనే సంఖ్యతో రికార్డుల కోసం పరితపించే విధానానికి బదులుగా భక్తుడి అనుభవాన్ని కేంద్రంగా ఉంచి, పారదర్శకత, సమానత్వం, సమర్థ నిర్వహణ, మానవీయ దృక్పథంతో సంస్కరణలు చేపట్టాలి..”
తిరుమలలో ప్రతి భక్తుడి ప్రయాణం ప్రశాంతమైన దర్శనంతో ముగియాలి. వెండి వాకిలి దాటిన తర్వాత తోపులాటల మధ్య రెండు సెకన్లు కూడా స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోలేక బయటకు రావాల్సిన పరిస్థితి మారాలి. ఒకే రోజు ఎంతమందికి దర్శనం కల్పించామన్న గణాంకం కంటే ప్రతి భక్తుడు ఎంత ప్రశాంతంగా దర్శించుకున్నాడన్నదే సేవా నాణ్యతకు నిజమైన ప్రమాణం. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలకు ప్రత్యేక నిరీక్షణ మండపాలు, వీల్‌చైర్లు, బ్యాటరీ వాహనాలు, సహాయక సిబ్బందిని మరింతగా అందుబాటులో ఉంచాలి. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉంటే, వివిధ సిఫార్సులు, ప్రత్యేక కేటగిరీల పేరుతో వీఐపీ దర్శనాలు కొనసాగడం అసంతృప్తిని పెంచుతోంది. అత్యవసర ప్రోటోకాల్ దర్శనాలను మినహాయించి మిగిలిన ప్రత్యేక దర్శనాలపై టీటీడీ సమగ్ర సమీక్ష చేపట్టాలి. తిరుమలలో ప్రతి భక్తుడికి సమాన గౌరవం, సమాన సౌకర్యం లభించేలా చర్యలు తీసుకోవాలి. దేవుడి సన్నిధిలో హోదా కాదు. భక్తికే ప్రాధాన్యత ఉండాలి.
డిజిటల్ సేవలు ఎంత విస్తరించినా ప్రతి భక్తుడికి ఇంటర్నెట్ సౌకర్యం లేదా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండదు. గ్రామీణ ప్రాంతాల భక్తులను దృష్టిలో ఉంచుకుని గతంలో ఉన్నట్లుగా ప్రతి జిల్లాలో టీటీడీ సమాచార కేంద్రాలను పునఃప్రారంభించాలి. అక్కడ పరిమిత సంఖ్యలో దర్శన టికెట్లు, వసతి బుకింగ్‌లను ఆఫ్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచితే సాంకేతిక కారణాలతో ఎవరూ నష్టపోరు. సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చే వరకు డిజిటల్, ఆఫ్‌లైన్ సేవలు పరస్పరపూరకంగా కొనసాగాలి. దర్శనం, వసతి టికెట్లు విడుదలైన కొన్ని నిమిషాల్లోనే కోటా పూర్తవుతుండటంతో ఆన్‌లైన్ వ్యవస్థపై భక్తుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అత్యాధునిక స్వయంచాలక ప్రోగ్రామ్‌ల (బాట్స్) నిరోధక సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత మోసాల గుర్తింపు వ్యవస్థలను అమలు చేసి అసాధారణ బుకింగ్ ప్రయత్నాలను వెంటనే అడ్డుకోవాలి. టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో రద్దీ, నిరీక్షణ సమయం, క్యూల స్థితి వంటి వివరాలను ప్రత్యక్షంగా అందుబాటులో ఉంచాలి. అలాగే ప్రతిరోజూ ఎన్ని టికెట్లు విడుదలయ్యాయి, ఎన్ని బుక్ అయ్యాయి, ఎన్ని రద్దయ్యాయి, వెయిటింగ్ లిస్ట్ ద్వారా ఎన్ని కేటాయించారనే వివరాలను భక్తులకు వెల్లడించాలి. దర్శనం పూర్తయిన తర్వాత భక్తుల అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా సేవల్లో మార్పులు తీసుకురావాలి. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక నమోదు సంఖ్య ఇచ్చి నిర్ణీత గడువులో పరిష్కరించే బాధ్యతాయుత వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
కోట్లాది మంది భక్తులు వినియోగించే టీటీడీ ఆన్‌లైన్ వ్యవస్థలను కేవలం సాఫ్ట్‌వేర్ నిర్వహణ స్థాయిలో చూడడం సరిపోదు. సమాచార సాంకేతిక నిపుణులు, సైబర్ భద్రతా నిపుణులు, కృత్రిమ మేధ నిపుణులు, డేటా నిర్వహణ నిపుణులతో కూడిన స్వతంత్ర సాంకేతిక సలహా మండలిని ఏర్పాటు చేయాలి. టికెట్ వ్యవస్థ, వసతి బుకింగ్, సర్వర్ల సామర్థ్యం, బాట్ దాడుల నివారణ, భక్తుల అభిప్రాయాల విశ్లేషణ వంటి అంశాలను ఈ మండలి నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన సంస్కరణలను సూచించాలి.
స్థానిక కార్లు, జీపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నా సమర్థమైన నియంత్రణ కనిపించడం లేదు. మరోవైపు ఉచిత బస్సులు తరచూ కిక్కిరిసిపోతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఉచిత బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు, బస్సుల రాకపోకల సమాచారాన్ని మొబైల్ యాప్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రత్యక్షంగా అందుబాటులో ఉంచాలి. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్లాస్టిక్‌ను నిషేధించడం స్వాగతించదగ్గ నిర్ణయమే. అయితే అదే పేరుతో సాధారణ తాగునీరు లేదా ఇతర నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించబడకుండా టీటీడీ సమర్థమైన ధరల నియంత్రణ అమలు చేయాలి.
కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడం టీటీడీకి భగవంతుడు అప్పగించిన పవిత్రమైన బాధ్యత. సాంకేతికత భక్తులకు అడ్డంకిగా మారిన రోజు అది సంస్కరణ కాదు,సాంకేతిక వ్యవస్థ వైఫల్యానికి సంకేతం. రోజుకు ఎంతమందికి దర్శనం కల్పించిందనే సంఖ్యతో రికార్డుల కోసం పరితపించే విధానానికి బదులుగా భక్తుడి అనుభవాన్ని కేంద్రంగా ఉంచి, పారదర్శకత, సమానత్వం, సమర్థ నిర్వహణ, మానవీయ దృక్పథంతో సంస్కరణలు చేపట్టాలి.





