– వర్షాభావ పరిస్థితులున్నా రైతుకు ఖచ్చితమైన ఆదాయం
– మన కొణిజర్ల నుంచే ఆయిల్ పామ్ సీడ్స్
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– గోద్రెజ్ అగ్రివేట్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం
ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 20 : ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికే పరిమితమైన తరుణంలో ఇక్కడి రైతాంగానికి అధిక దిగుబడి, మెరుగైన రాబడి అందించేందుకు ఆయిల్ పామ్ సాగు ఒక అద్భుతమైన వరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ పామ్ ఆయిల్ పరిశ్రమను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉండేవి.. జిల్లాల పునర్విభజన తర్వాత ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికే పరిమితమైందని, ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నీటి ప్రవాహం, పాలేరు, వైరా రిజర్వాయర్లు.. వీటి మీద ఆధారపడి ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయం మన జీవన ఆధారంగా మారిన పరిస్థితుల్లో రైతులకు అధిక దిగుబడి, రాబడి వచ్చేలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా రైతులు ఆయిల్ పామ్ సాగువైపు మళ్లాలని సూచించారు. ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితులు, వర్షాభావ స్థితిగతులు ఏర్పడినా ఆయిల్ పామ్ సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాబోవన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకుì ఎకరాకు రూ.4 నుంచి రూ.45 వేల వరకు సబ్సిడీని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు దేశంలో 25 లక్షల మిలియన్ టన్నుల పామ్ ఆయిల్ అవసరం ఉంటే 12 లక్షల మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మిగిలిన దాంట్లో కేవలం మÖడు లక్షల టన్నుల పామాయిల్‌ను దేశం దిగుమతి చేసుకుంటున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. ఈ దిగుమతి వల్ల రూ.1.5 లక్షల కోట్లు విదేశీ మారకంగా వేరే దేశాలకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే పామాయిల్‌ను మనం ఇక్కడే ఉత్పత్తి చేయగలిగితే దేశానికి ఆర్థికంగాను, రైతుకు లాభసాటిగా కూడా ఉంటుందని చెప్పారు.ఉమ్మడి ఏపీలో 1991-92 ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో మొదటిసారి ప్రోత్సహించినట్లు చెప్పారు. ఆనాటి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా అశ్వారావుపేట, సత్తుపల్లి వంటి పరిసర ప్రాంతాలు దీనికి ఉపయోగపడతాయని చెప్పి సర్వే చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయిల్ పామ్ పోత్సహించేందుకు ఆనాడు వేసిన బీజాలు ఈరోజు పరిశ్రమ ప్రారంభం చేసుకునే వరకు వచ్చిందన్నారు. దేశంలో దాదాపు 70 లక్షల ఎకరాలకు సాగు చేయాల్సిన అవసరం ఉంటే కేవలం 15 లక్షల ఎకరాల్లోనే చేసుకోగలుగుతున్నామని, పూర్తిస్థాయిలో సాగు చేయగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవగలమని చెప్పారు. 1991-92లో మొదలుపెట్టిన ఈ సాగు నేడు 3 లక్షల ఎకరాలకు చేరిందని, ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్రంలోనూ, దేశంలోనూ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2023లో టన్ను గెల ధర రూ.12,500 ఉంటే ఈరోజు రూ.23,000ల వరకు ఉందని లెక్కలు చెబుతున్నాయని, రెండు మూడేళ్లలోనే ఆయిల్ పామ్ ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయిల్ పామ్ ద్వారా రైతాంగ సోదరులు సమృద్ధిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. పామ్ ఆయిల్ ఇండస్ట్రీని ఈరోజు కొణిజర్ల మండలంలోని అంజనాపురం గ్రామంలో ప్రారంభోత్సవం చేసుకున్నామని, వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి ఉన్న ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులకు ఇదొక మంచి వరంగా తాను భావిస్తున్నట్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ పరిశ్రమను ప్రారంభించే సందర్భంలో ఇంకా అభివృద్ధి చెందడానికి కావలసిన రహదారులు కావాలని అడిగారంటూ అందుకోసం ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా రహదారులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుందని చెప్పారు. ఇది యాంకర్ ఇండస్ట్రీగా మారి అనేక అనుబంధ పరిశ్రమలు ఈ పరిసర ప్రాంతాలకు రావాలని, ఈ ప్రాంతం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్‌కు ఒక మంచి కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పామ్ ఆయిల్‌కు అవసరమైన సీడ్‌ను మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఇక్కడినుంచే దేశానికి అవసరమైన విత్తనాలను అందించే స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
– కూలీలతో ఉప ముఖ్యమంత్రి భట్టి మాటామంతి 
– క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలపై ఆరా
గండగలపాడు నుంచి స్నానాల లక్ష్మీపురం వెళ్లే మార్గమధ్యంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్ అకస్మాత్తుగా ఆగింది. భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యేలోపే ఆయనే స్వయంగా రోడ్డు పక్కన పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతు కూలీల వైపు వెళ్లారు. డిప్యూటీ సీఎం తమ వద్దకు రావడంతో కూలీలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వారితో చేతులు కలిపేందుకు, మాట్లాడేందుకు అక్కడి వారంతా పోటీ పడ్డారు. పొలం గట్టుపై నిలబడి కూలీలతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. నేరుగా లబ్దిదారులతోనే సంక్షేమ ఫలాల తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కయ్యా.. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా, మీ ఇంటికి ఉచిత విద్యుత్ సరఫరా వస్తోందా, రేషన్ షాప్ నుంచి సన్న బియ్యం తెచ్చుకుని తింటున్నారా, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కూలీలు ఎంతో సంతోషంగా స్పందిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ మాకు అందుతున్నాయి సార్.. ముఖ్యంగా మాలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి దృష్టికి రవాణా కష్టాలు
ఇదే సమయంలో కూలీలు తమ రోజువారీ ఇబ్బందులను కూడా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైరా నుంచి ముసలిమడుగు వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
పది లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం : తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా గోద్రెజ్ సంస్థ ఆయిల్ పామ్ గెలల కొనుగోలు లో రైతులకు భాగస్వామిగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఆయిల్ పామ్ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసే అవకాశాలు మరింత విస్తరించాయని, దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన ఆయిల్ పామ్ సాగు, నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో దానిని 10 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. దేశం వంటనూనెల్లో స్వయం సమృద్ధి సాధించాలంటే సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవసరమని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ఆయిల్ పామ్ సాగులో దాదాపు 90 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే జరుగుతోందన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మూడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు పనిచేస్తుండగా, గోద్రెజ్ ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ నాలుగో ఫ్యాక్టరీ అని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఆయిల్ పామ్‌కు ప్రత్యేక సీడ్ గార్డెన్ లేకపోవడం గమనార్హమని, గోద్రెజ్ సంస్థ మలేషియా భాగస్వామ్యంతో ఖమ్మంలో దేశంలోనే తొలి ఆధునిక సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. సీడ్ గార్డెన్‌తో పాటు పరిశోధన కేంద్రం, రైతులకు అవగాహన కల్పించే ప్రదర్శన విభాగాలు, శిక్షణా కార్యక్రమాలు, నాణ్యమైన నర్సరీల ఏర్పాటు వంటి కార్యక్రమాలకు కూడా నేటి నుంచే శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మెన్ నాదిర్ బి. గోద్రెజ్, ఆగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కటారియా, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఖమ్మం కలెక్టర్ దివాకర్, సీపీ సునీల్ దత్, గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు సౌగత నియోగి, రాకేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





