- ఒకరు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
- మానుకోట ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
- శోక సంద్రంలో చర్లపాలెం.. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు
మరిపెడ (నర్సింహులపేట), ప్రజాతంత్ర, మార్చి 21: రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబాలు.. ప్రతిరోజు కూలి పనుల నిమిత్తం ఏదో ఒక గ్రామానికి వెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకునేవారు.. రోజు లాగానే శుక్రవారం కూడా తెల్లవారుజామున 17 మంది మహిళా కూలీలు మిర్చి ఏరటానికి ఆటోలో మరిపెడకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెదనాగారం స్టేజి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ అజాగ్రత్తగా నడపడంతో ఆటో లారీ వెనుక భాగంలో తగిలి కుదుపున గురై రోడ్డు పక్కగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం (Accident ) లో ఒక మహిళా కూలి మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన 17 మంది మహిళా కూలీలు, ఆటో డ్రైవర్ తో కలిపి మొత్తం 18 మంది మిర్చి తోట ఏరటానికి మరిపెడ వైపునకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో నరసింహులపేట మండలంలోని పెదనాగారం స్టేజి సమీపంలో లారీ ఢీకొట్టడంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది కూలీలకు గాయాలవగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వటంతో అందుబాటులో ఉన్న అంబులెన్స్లు క్షతగాత్రులను మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చల్లపాలెం గ్రామానికి చెందిన గూడెల్లి అరుణ (38) మృతి చెందగా, మిగతా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వాహనం కోసం గాలిస్తున్నట్టు ఎస్సై సురేష్ వెల్లడించారు.