చల్లగా చంపేస్తుంది..

  • ఈ రకమైన ఐస్ తో ఆరోగ్యానికి ప్రమాదం
  • బావులు, చెరువులు, బోరు నీటితో తయారు
  • నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లు, నార కురుపు
  • నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష, జరిమానా

ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర మార్చి 21: వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ చల్లని పానీయాలతో ఉపశమనం పొందేందుకు యత్నిస్తారు. అయితే పండ్ల రసాలు, చెరకు రసం వంటివి విక్రయించే చోట ఆరోగ్యానికి హాని కలిగించే ఐస్ వినియోగిస్తున్నట్టు ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఐస్ ఉపయోగిస్తున్నారనే విషయాన్నిఒక్కసారి వినియోగదారులు గమనించాలని సూచిస్తున్నారు. స్టోరేజీ కోసం వినియోగించే ఐస్ తో కూడిన పానీయం తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం నగరంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా చల్లని పానీయాలు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీటిల్లో వందల కిలోల ఐస్ ను వినియోగిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే వేసవిలో పది నుంచి 20 రెట్లు అధికంగా ఐస్ వినియోగం పెరుగుతుంది. అయితే ఐస్ తయారీ కంపెనీల్లో ఎక్కువ చోట్ల అపరిశుభ్రమైన నీటిని వినియోగిస్తున్నట్టు గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆహారభద్రత, ప్రమాణాల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

ఖమ్మం నగర పరిధిలోని ఐస్ తయారు చేసే కంపెనీలు (Ice factory ) ఉన్నాయి. వీటిలో అనేక కంపెనీలు బోర్లు, చెరువులు, బావుల్లోని నీటినే నేరుగా ఐస్ తయారీకి వినియోగిస్తున్నాయి. శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఐస్ తయారీకి వినియోగించాలి. అంటే ప్రాసెస్డ్ వాటర్ లేదా మినరల్ వాటర్ తోనే ఐస్ తయారుచేయాలి. ఆ నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియా, రసాయనాలు లేకుండా చూడాలి. అటువంటి ఐస్ ను మాత్రమే పానీయాల్లో వినియోగించాలి. కానీ పారిశ్రామిక అవసరాల కోసం, స్టోరేజీ కోసం తయారు చేసిన ఐస్ ను జ్యూస్, కూలింగ్ సెంటర్లలో వినియోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఆరోగ్యానికి ప్రమాదం…

నగర పరిధిలో 90 శాతం వ్యాపారులు ప్రమాదకరమైన ఐస్ వినియోగిస్తున్నారు. కలుషిత నీటితో తయారుచేసిన ఐస్ ను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందులో వుండే సూక్ష్మక్రిముల వల్ల నీళ్ల విరేచనాలు అవుతాయి. బ్యాక్టీరియా వల్ల పారా టైఫాయిడ్, కలరా, వైరస్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వేధిస్తాయి. ఇంకా పచ్చకామెర్లు, నార కురుపు, రక్తహీనత వంటి వ్యాధుల బారినపడే అవకాశముంది. ఆమ్లం, క్షారం ఎక్కువగా వుంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, ఎసిడిటీ సమస్యలు, కంటి, చర్మ, ముక్కు సంబంధిత సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్, సైనసైటిస్, జలుబు వంటివి కూడా వచ్చే ప్రమాదముంది. నీటిలో రసాయనాలు వుంటే దీర్ఘకాలిక వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముంది. ఐస్ వినియోగించే నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా వుంటే ఫ్లోరోసిస్ (ఎముకలు గుల్ల బారడం), నైట్రేట్ ఎక్కువగా వుంటే నీలి రంగులోకి మారడం, మాంగనీసు ఎక్కువగా ఉంటే మెదడు వాపు వ్యాధి, ఆర్సినిక్ వుంటే కేన్సర్లు, మెర్క్యూరీ వుంటే శ్వాసకోశ వ్యాధుల బారినపడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పరీక్షల్లో తేలితే.. ఆరు నెలలు జైలు..

తాము నిర్వహించే పరీక్షల్లో కలుషిత నీటిని, రసాయనాలను ఐస్ తయారీకి వినియోగించినట్టు నిర్ధారణ అయితే కఠిన శిక్షలు తప్పవని ఆహార, భద్రతా ప్రమాణాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐస్ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షిస్తామని, తేడా ఉన్నట్టు తేలితే ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ. 3 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం వుందని ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page