ఈసీ విశ్వసనీయతకు ‘సుప్రీం’ పరీక్ష!

భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, సర్వోన్నత ఎన్నికల కమిషన్ (ఈసీ) లోపల నిర్ణయాధికారాల పంపిణీకి సంబంధించిన అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్న సోమవారం సుప్రీంకోర్టు ముందుకు వొచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్, మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి ,సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తీరు ప్రజాస్వామ్య ఉనికికి, స్వయంప్రతిపత్తి గల సంస్థల అంతర్గత సమతుల్యతకు ఎంతో ప్రాధాన్యత కలిగినదిగా భావించవొచ్చు.

పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణల తీవ్రత దృష్ట్యా సీఈసీని తక్షణమే సస్పెండ్ చేయాలన్న అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చడం ఇక్కడ గమనార్హం. ఒక కీలక రాజ్యాంగ సంస్థకు నేతృత్వం వహిస్తున్న అత్యున్నత అధికారిపై కేవలం ఆరోపణలు రాగానే తొందరపాటు చర్యలకు దిగడం వ్యవస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని కోర్టు భావించి ఉండవొచ్చు. ఇది న్యాయసమ్మతమైన, పరిణతి చెందిన నిర్ణయం. అయితే, అదే సమయంలో ఈ ఆరోపణలను కోర్టు తేలికగా తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, స్వయంగా సీఈసీతో పాటు సంబంధిత అధికారులందరికీ నోటీసులు జారీ చేయడం ద్వారా ఈ వివాదం వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గుతేల్చడానికి సుప్రీంకోర్టు సిద్ధమైంది. అటు సీఈసీకి క్లీన్ చిట్ ఇవ్వకుండా, ఇటు పిటిషనర్ల తక్షణ డిమాండ్లకు లొంగకుండా కోర్టు అవలంబించిన తటస్థ వైఖరి అభినందనీయం. విచారణలో  ఫామ్–6 (వోటరు నమోదు దరఖాస్తు) పై న్యాయస్థానం వ్యక్తం చేసిన స్పష్టమైన అభిప్రాయం ఇక్కడ కీలకం. ఎన్నికల ప్రక్రియలో వోటరు నమోదు అనేది ప్రాథమిక , అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ. దీనిపై ఏకపక్ష నిర్ణయాలు లేదా మార్పులు జరిగితే అది మొత్తం ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అందుకే, ఫామ్-6 ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల ఉల్లంఘన జరగకూడదనే కోర్టు స్పష్టత, ఎన్నికల నిర్వహణలో సమష్టి బాధ్యత ఎంత ముఖ్యమో గుర్తుచేస్తున్నది .

ఇటీవలి కాలంలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) నిష్పక్షపాత వైఖరిపై ప్రతిపక్షాలు, పౌర సమాజం నిరంతరం ప్రశ్నలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో, కమిషన్ లోపల ఒక “కమాండ్ అండ్ కంట్రోల్” (ఏకపక్ష ఆధిపత్యం) సంస్కృతి నెలకొందనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) మిగిలిన ఇద్దరు కమిషనర్లను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకున్నారనే వాదన నిజమైతే, అది ఈసీని ఒక స్వతంత్ర సంస్థగా కాకుండా, ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే ఒక బ్యూరోక్రాటిక్ విభాగాంగా మార్చే ప్రమాదం ఉందనే విమర్శలకు బలం చేకూరుస్తుంది. న్యాయస్థానం ప్రత్యేకంగా ప్రస్తావించిన ఫామ్-6 (కొత్త వోటరు నమోదు) అంశం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల సమయానికి ముందు భారీగా వోటర్ల చేర్పులు లేదా తొలగింపులు జరగడం, దానికి సంబంధించిన నిబంధనలను ఏకపక్షంగా సవరించడం వంటి చర్యలు అధికార పక్షానికి లబ్ధి చేకూర్చేందుకేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక నియోజకవర్గంలో కొన్ని వేల వోట్ల తేడాతో గెలుపోటములు మారుతున్న తరుణంలో, ఫామ్-6 ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే అది “మ్యాండెట్ మానిప్యులేషన్” (తీర్పును తారుమారు చేయడం) కిందికే వొస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే సుప్రీంకోర్టు దీనిపై కఠినంగా వ్యవహరించింది.

సుప్రీంకోర్టు సీఈసీని తక్షణమే సస్పెండ్ చేయకపోవడం ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం కలిగించవొచ్చు. కానీ, కేంద్ర ప్రభుత్వానికి . ఈసీకి నోటీసులు జారీ చేయడం ద్వారా “చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు” అనే గట్టి సర్వసమ్మతి  సందేశాన్ని కోర్టు పంపింది. ఎన్నికల ప్రక్రియల పట్ల ప్రజల్లో నమ్మకం సడలిపోతే అది మొత్తం ప్రజాస్వామ్య పునాదులనే కదిలిస్తుంది కాబట్టి, సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిలదీసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, ఎన్నికల కమిషన్ అనేది ఒక సమష్టి సంస్థ. టి.ఎన్. శేషన్ కాలం నాటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కూడా, కమిషన్‌లో నిర్ణయాలు మెజారిటీ ప్రాతిపదికన లేదా ఏకాభిప్రాయంతో జరగాలి తప్ప, సీఈసీకి మిగతా కమిషనర్ల కంటే ఎక్కువ సర్వాధికారాలు లేవు.

ఆయన కేవలం ఒక సమన్వయకర్త మాత్రమే. ఈ నేపథ్యంలో, తోటి కమిషనర్లను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు నిజమైతే, అది రాజ్యాంగ స్ఫూర్తికే భారత ఎన్నికల కమిషన్ సాధించిన అంతర్జాతీయ కీర్తి, ప్రజల్లో దానికి గల నమ్మకం దాని నిష్పక్షపాత వైఖరిపైనే ఆధారపడి ఉన్నాయి. స్వయంప్రతిపత్తి గల సంస్థలలో అంతర్గత ప్రజాస్వామ్యం క్షీణిస్తే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అవుతుంది. సుప్రీంకోర్టు ప్రారంభించిన ఈ విచారణ కేవలం ఒక అధికారిపై వొచ్చిన ఆరోపణల విచారణ మాత్రమే కాదు; ఇది ఎన్నికల కమిషన్ అంతర్గత అధికారాల సరిహద్దులను, నిష్పక్షపాత విలువలను పునరుద్ఘాటించే ఒక చారిత్రాత్మక సందర్భం. కేంద్ర ప్రభుత్వం, ఈసీ ఇచ్చే వివరణలపైనే ఈ వ్యవస్థల భవిష్యత్తు విశ్వసనీయత ఆధారపడి ఉంది. కోర్టు జోక్యం ద్వారా ఈ సంక్షోభానికి త్వరలోనే ఒక స్పష్టమైన, రాజ్యాంగబద్ధమైన పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *