జల హక్కుల సాధనలో ఐక్యతే శ్రీరామరక్ష!

సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి అసలైన గీటురాయి కేంద్ర-రాష్ట్ర సంబంధాలే. దేశాభివృద్ధిలో రాష్ట్రాలే కీలక భాగస్వాములు. రాజకీయ విభేదాలకు అతీతంగా రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. న్యూదిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జరిపిన భేటీ ఈ కోణంలోనే ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర జీవనాడులైన సాగునీటి ప్రాజెక్టులకు చట్టబద్ధమైన అనుమతులు, ఆర్థిక సహాయం , అంతరాష్ట్ర వివాదాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు జల కళ తీసుకురావడంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ, పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క సాగర్ వంటి ప్రాజెక్టులు అత్యంత కీలకం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గ్రావిటీ ద్వారా సాగు, తాగునీరు అందించే ప్రాణహిత-తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర సమ్మతి తప్పనిసరి. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పూర్తి పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ప్రధాని చొరవ చూపాలి. అలాగే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుండి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇప్పించడం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ సాగర్, డిండి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ , సాంకేతిక అనుమతులను వేగవంతం చేయడం ద్వారా కేంద్రం ‘పెద్దన్న’ పాత్ర పోషించాలి. అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారంలో కేంద్రం మధ్యవర్తిత్వం రాజ్యాంగబద్ధమైన బాధ్యత కూడా.

మరోవైపు, ఆర్థిక వనరుల కేటాయింపులోనూ కేంద్రం ఉదారత చాటుకోవాలి. రాష్ట్రంలో దాదాపు 70 నుండి 90 శాతం పనులు పూర్తయిన మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు కేవలం నిధుల కొరతతో ఆగిపోవడం వల్ల అంచనా వ్యయం పెరగడమే కాకుండా, ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉంది. ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ (ఎస్ఏఎస్సీఐ 2026-27) పథకం కింద కేంద్ర బడ్జెట్‌లో రూ. 2 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ, తెలంగాణకు ఇప్పటివరకు కేవలం రూ. 1,457 కోట్లు మాత్రమే అందాయి. ఈ పథకం కింద అదనంగా రూ. 5,000 కోట్లు మంజూరు చేస్తే, పూర్తి దశలో ఉన్న ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరందించవొచ్చు.అదేవిధంగా, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ. 392 కోట్లు, చిన్న కాళేశ్వరానికి రూ. 171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ. 103 కోట్లు విడుదల చేయాలన్న రాష్ట్ర విజ్ఞప్తి సహేతుకమైనది. ఈ నిధులు అందితే రాష్ట్రంలోని ఆయకట్టు స్థిరీకరణ జరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

మరోవైపు, ఈ భేటీ , ప్రాజెక్టుల విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తుంటే, తెలంగాణ జల హక్కులను తాకట్టు పెట్టవద్దని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల హైడ్రాలజీ అనుమతులు వొచ్చినా, ప్రస్తుత ప్రభుత్వం డీపీఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని  ఆయన ఆరోపించారు. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న చనాకా-కొరాటా వంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, తుమ్మిడిహెట్టి పేరుతో ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతుందని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలపై చారిత్రక బాధ్యత ఉంది.

సాగునీటి ప్రాజెక్టులు ఏ ఒక్క పార్టీకో చెందినవి కావని, అవి కోట్లాది మంది తెలంగాణ రైతుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని వారు గుర్తించాలి. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించేలా బీజేపీ ఎంపీలు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. ముఖ్యంగా మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ఆ రాష్ట్రాన్ని ఒప్పించడంలో వారు ప్రత్యేక చొరవ చూపాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల విమర్శలు ప్రభుత్వాలను అప్రమత్తం చేసేవిగా ఉండాలి. బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని రాష్ట్ర ప్రభుత్వం చేతల్లో నిరూపించుకోవాలి. కేంద్రం నుండి నిధులు, అనుమతులు రాబట్టడంలో దిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకే పరిమితం కాకుండా, తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉండేలా జల హక్కుల సాధనలో ఐక్యంగా ముందుకు సాగాలి.

అయితే, కేంద్రం నుండి నిధులు, అనుమతులు రాబట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతర్గత ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలి. గత అనుభవాల దృష్ట్యా సాంకేతిక లోపాలకు తావివ్వకుండా, భూసేకరణ , నిర్వాసితుల పునరావాసం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్మాణాత్మక సూచనలు అందించాలి. కేంద్ర ప్రభుత్వం తన ‘సహకార సమాఖ్య’ నినాదాన్ని చేతల్లో చూపిస్తూ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వేగంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. జల వనరుల సద్వినియోగంతోనే తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉంటుందన్న సత్యాన్ని ఇరు ప్రభుత్వాలు గుర్తించి ముందుకు సాగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *