భిన్న ధృవాల్లో ఉభయ రాష్ట్రాలు?

“వాస్తవంలో శ్రీ శైలం జలాశయం వుండేది విద్యుదుత్పత్తి కోసమే నని తెలంగాణ భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మరో వేపు ఆంధ్ర ప్రదేశ్ ఇందుకు భిన్నంగా వాదిస్తోంది.ముందుగా తాగునీరు తర్వాత సాగునీరు తదుపరి విద్యుదుత్పత్తి అంటోంది. ఒక దఫా సుప్రీంకోర్టుకు కూడా ఆంధ్ర ప్రదేశ్ వెళ్లంది. ఈ అంశంపై స్పష్టత లేక తీర్పు ఇచ్చే వేదికంటూ లేదు. ట్రిబ్యునల్ కూడా నీటి కేటాయింపులు చేస్తుంది. తప్ప ప్రాజెక్టు క్లాసిఫికేషన్ చేయదు.”

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయుడు

అక్టోబరు ఒకటవ తేదీ కృష్ణ యాజమాన్య బోర్డు 21 వ సమావేశం జరిగి వుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉప్పు నిప్పుగా వుండేది. ప్రస్తుతం ఈ చిచ్చు చాప కింద నీరు లాగా వుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అదే రోజు వున్నందున బోర్డు సమావేశం వాయిదా పడింది. వాస్తవంలో ఈ సమావేశం ఎప్పుడో జరిగి వుండాలి . ఎల్ నినో ప్రభావంతో పాటు వర్షాభావం ఏర్పడి రిజర్వాయర్ల లోనికి అరకొరగా నీళ్లు వచ్చిన నేపథ్యంలో నీటి సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలకైనా బోర్డు పూర్తి స్థాయి సమావేశం జరిగి వుండాలి. ఎట్ట కేలకు అక్టోబరు ఒకటవ తేదీ నిర్ణయించినా తిరిగి వాయిదా పడింది.

బోర్డు సమావేశం నిర్ణయం కాగానే తమ ఎజెండాగా ఆంధ్ర ప్రదేశ్ సుదీర్ఘ లేఖ రాసింది. ఇందులో తెలంగాణ కూడా తీసి పోలేదు. ఆంధ్ర ప్రదేశ్ లేఖలో ముఖ్యమైన అంశమేమంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు తాము 45 టియంసిలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పాదించిన బనకచర్ల అనుసంధాన పథకాన్ని తెలంగాణ అంగీకరించడం అందుకు ప్రతిగా కృష్ణ లో 45 టియంసిలకు ఆంధ్ర ప్రదేశ్ ఎన్వోసి ఇస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు డిపిఆర్ ను కేంద్రం జల సంఘం ఆమోదించడమనే చర్చలు నాలుగైదు నెలలుగా సాగుతూ వచ్చాయి. 2014 మునుపు తెలంగాణ మొదలు పెట్టిన ప్రాజెక్టులనన్నింటినీ ఆంధ్ర ప్రదేశ్ ఆమోదించితే 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మొదలు పెట్టిన ప్రాజెక్టులను తెలంగాణ ఆమోదించుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు ఆదిత్య నాథ్ దాస్ పలు వేదికల మీరు ప్రకటించారు.

యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ రాసిన లేఖతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం అంతా తలకిందులైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్ ఆమోదం పొంది బిఆర్ఎస్ నాయకుల నోళ్లకు తాళాలు వేయాలని చూసారు. ఒక వేపు రాయలసీమలో ప్రాజెక్టులకు కేటాయింపులు లేకుండా ఎన్వోసి తెలంగాణకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాహసించలేదేమో. ఈ ప్రభావం ఇతర అంశాల మీద ప్రబలంగా పడే అవకాశం ఉంది. మరో వివాదాశం ఆంధ్ర ప్రదేశ్ లేవ నెత్తింది. నీటి ఎద్దడి పైగా ఎల్ నినో రోజుల్లో శ్రీ శైలం జలాశయం నుండి విద్యుదుత్పత్తి చేయ కుండా తెలంగాణను నిలువ రించాలని కోరింది.

వాస్తవంలో శ్రీ శైలం జలాశయం వుండేది విద్యుదుత్పత్తి కోసమే నని తెలంగాణ భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మరో వేపు ఆంధ్ర ప్రదేశ్ ఇందుకు భిన్నంగా వాదిస్తోంది.ముందుగా తాగునీరు తర్వాత సాగునీరు తదుపరి విద్యుదుత్పత్తి అంటోంది. ఒక దఫా సుప్రీంకోర్టుకు కూడా ఆంధ్ర ప్రదేశ్ వెళ్లంది. ఈ అంశంపై స్పష్టత లేక తీర్పు ఇచ్చే వేదికంటూ లేదు. ట్రిబ్యునల్ కూడా నీటి కేటాయింపులు చేస్తుంది. తప్ప ప్రాజెక్టు క్లాసిఫికేషన్ చేయదు.

ఎడతెగకుండా రెండు రాష్ట్రాల మధ్య 2014 నుండి రావణ కాష్టం వున్న మరో అంశమూ చర్చకు వచ్చి వుందేది. అయితే పరిష్కారం మాత్రం లభించేది కాదు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ పద్దతి పై కృష్ణ జలాలు పంచుకొందామని తెలంగాణ వాదిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ అందుకు అంగీకరించడం లేదు. 66:34 శాతం పద్దతి ఆంధ్ర ప్రదేశ్ చెబుతోంది. ఈ అంశాలన్నీ కొత్తవేమీ కాదు. రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుండి నలుగుతూనే వున్నాయి. కాగా ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల వాడుకొన్న నీటిపై తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉండినది. ఈ పరస్పర వాదోపవాదాలకు దారి తీయ వచ్చు. . ఇందుకు పూర్తి బాధ్యత యాజమాన్య బోర్డు నిర్లక్ష్య వైఖరి కారణం. బోర్డును కంట్రోల్ లో పెట్టుకొని వున్న కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఇటీవల దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇర్రిగేషన్ మంత్రి ఇద్దరూ కేంద్ర జల శక్తి శాఖ మంత్రి పాటిల్ ను కలిశారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి పథకానికి మహారాష్ట్ర నుండి అనుమతి గురించి చర్చించారు. గాని గతంలో ఆంధ్ర ప్రదేశ్ తో కుదిర్చిన మధ్యవర్తిత్వం ప్రస్తావన వచ్చినట్లు లేదు. యధావిదిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఇతర ప్రాజెక్టుల డిపిఆర్ ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

వాస్తవంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరద జలాల ఆధారంగా బనకచర్ల అనుసంధానం గాని మరొక ప్రాజెక్టు గాని విరమించు కొంటే అంతర్ రాష్ట్ర జల వివాదాలు ఉభయ రాష్ట్రాల మధ్య తీవ్ర తరమయ్యే అవకాశం వుంది. ఎందుకంటే అటు బనకచర్ల అనుసంధానం కోసం ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కోసం రెండు వేపుల సంయమనం పాటిస్తున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. అయితే పరిస్థితులు భిన్నంగా వున్నాయి. కాగా ఆ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల అనుసంధానం ఈ టర్మ్ లో విరమించుకొన్నట్లు ప్రకటించారు. పైగా మొన్న రాయలసీమ రైజింగ్ సభలో గోదావరి కావేరి అనుసంధానం మాత్రమే ప్రస్తావించారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కాంగ్రెస్ నేతలు మిన్న కున్నా బిఆర్ఎస్ పార్టీ నేతలు దాని మీడియా ఆంధ్ర ప్రదేశ్ కు వ్యతిరేకంగా హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణ గోదావరి జలాలను ఆంధ్ర ప్రదేశ్ కు దోచి పెడుతున్నారని నిత్యం గోల చేస్తున్నారు. బనకచర్ల అనుసంధానం తెర మరుగైతే బిఆర్ఎస్ పార్టీ నేతల దాడి తగ్గుముఖం పడుతుంది. మరో వేపు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతి పక్షమైన వైసిపి నేతలు గానీ దాని మీడియా ఇవేవీ పెద్దగా పట్టించు కోవడం లేదు.

బిఆర్ఎస్ పార్టీ నేతలు దాని మీడియా ఆరోపణల గురించి ముఖ్యమంత్రి గాని ఇర్రిగేషన్ మంత్రి ఇవేవీ పట్టించుకోవడం లేదు. తెలంగాణలో అధికార ప్రతి పక్షాల మధ్య సాగుతున్న పోరులో సాగునీటి ప్రాజెక్టుల అంశం ప్రధాన భూమిక పోషించుతోంది. కెసిఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ లోనికి తెస్తే తెలంగాణలో యాభై శాతం పోరు తీవ్రత తగ్గి పోతుంది. కృష్ణ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ దృష్టి పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *