పర్యావరణ పరిరక్షణలో సరికొత్త చరిత్ర!

దేశ రాజధాని దిల్లీ  సహా ప్రధాన మెట్రో నగరాలన్నీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ, భాగ్యనగరం హైదరాబాద్  మాత్రం పర్యావరణ పరిరక్షణలో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి  తాజాగా ప్రకటించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026’ ఫలితాల్లో దేశంలోని ఐదు ప్రధాన మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో  హైదరాబాద్ 174.2 పాయింట్లు (మొత్తం మార్కులు 200) సాధించి జాతీయ స్థాయిలో 19వ ర్యాంకులో నిలిచింది. గతేడాదితో పోలిస్తే నగరం మూడు స్థానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. ఇదే విభాగంలో దేశ రాజధాని దిల్లీ 21వ స్థానంలో, ముంబై 28వ స్థానంలో, బెంగళూరు 32వ స్థానంలో నిలిచాయి. ఆరు ప్రధాన మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలవడం నగర పాలనకు దక్కిన గౌరవం. మరోవైపు 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల విభాగంలో తెలంగాణకే చెందిన సంగా రెడ్డి 8వ ,నల్గొండ 10వ  ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. నగరంలోని జూబ్లీహిల్స్, గన్‌ఫౌండ్రీ వార్డులు ఉత్తమ పనితీరుతో ప్రత్యేక పురస్కారాలు అందుకోవడం విశేషం.
‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026’లో మెట్రో నగరాల్లో అగ్రస్థానంలో నిలిచిన భాగ్యనగరం, గడిచిన ఏడేళ్లలో తన గాలిలో హానికర ధూళి కణాల సాంద్రతను గణనీయంగా తగ్గించుకోగలిగింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం  నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో వార్షిక సగటు పీఎం10  ధూళి కణాల స్థాయి 26.37 శాతం మేర తగ్గింది. 2017-18లో క్యూబిక్ మీటర్ గాలిలో 110 మైక్రోగ్రాములుగా ఉన్న పీఎం10 సాంద్రత, 2024-25 నాటికి 81 మైక్రోగ్రాములకు దిగివొచ్చింది . ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి  ప్లాంట్ల ఏర్పాటు ఇందుకు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ , నైట్రోజన్ ఆక్సైడ్ , బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి  నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిశ్రమల్లో శుభ్రమైన ఇంధన వినియోగం, బీఎస్-6 వాహనాల రాక ఇందుకు దోహదపడ్డాయి. దీనికి తోడు ఉత్తర భారతదేశంలా పంట వ్యర్థాలను కాల్చే సంస్కృతి లేకపోవడం, నగరం చుట్టూ ఉన్న రాతి గుట్టలు హైదరాబాద్‌కు భౌగోళికంగా కలిసివస్తున్నాయి.
వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన సూక్ష్మ ధూళి కణాల (పీఎం10) స్థాయి నగరంలో 26 శాతం మేర తగ్గడానికి ప్రధాన కారణం నిర్మాణ ,కూల్చివేత వ్యర్థాల  నియంత్రణపై అధికారులు తీసుకున్న కఠిన చర్యలే.ఇప్పటివరకు భవనాలు కట్టాక వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారబోసే విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో కొత్త నిర్మాణ అనుమతులు పొందాలంటే వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక సమర్పించడం తప్పనిసరి చేసింది. నగరంలో రోజూ వెలువడే సుమారు 2,000 టన్నుల నిర్మాణ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు జీడిమెట్ల, ఫతుల్లాగూడ ప్లాంట్లతో పాటు ఇటీవల పశ్చిమ హైదరాబాద్‌లోనూ కొత్త కలెక్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. రహదారులపై ధూళిని శుభ్రం చేసేందుకు వాడుతున్న మెకానికల్ రోడ్ స్వీపింగ్ యంత్రాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిని సక్రమంగా నిర్వహిస్తే నగర గాలి నాణ్యత మరో 20 శాతం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నిబంధనల అమలుతో పాటు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తేనే హైదరాబాద్ నిజమైన ధూళి రహిత నగరంగా మారుతుంది.
జాతీయ స్థాయిలో మెట్రో నగరాల్లో నంబర్ 1 ర్యాంకు సాధించడం హర్షణీయమే అయినప్పటికీ, ఇది అంతిమ విజయం కాదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ’ అనేది కాలుష్య నియంత్రణకు స్థానిక సంస్థలు తీసుకుంటున్న చర్యల పనితీరును మాత్రమే కొలుస్తుంది. క్షేత్రస్థాయిలో కొన్ని లోపాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి.ప్రధాన రహదారులపై ధూళిని శుభ్రం చేసేందుకు వాడుతున్న మెకానికల్ రోడ్ స్వీపింగ్ యంత్రాల ఫిల్టర్లు, బ్రష్‌లను సకాలంలో మార్చకపోవడం వల్ల కొన్నిచోట్ల ధూళి పూర్తిగా తొలగడం లేదని ఐఐటీ హైదరాబాద్ అధ్యయనం స్పష్టం చేసింది. వీటిని సక్రమంగా నిర్వహిస్తే గాలి నాణ్యత మరో 20 శాతం మెరుగుపడుతుంది.
వార్షిక సగటు బాగున్నప్పటికీ, శీతాకాలం ,పండుగల సమయంలో బాణసంచా వల్ల పంజాగుట్ట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో వాయు నాణ్యత ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి పడిపోతుంది . కొత్తగా రానున్న వేలాది ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా బస్సు డిపోలలో హై-టెన్షన్ విద్యుత్ లైన్లు, చార్జింగ్ పాయింట్లను సకాలంలో సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.19వ ర్యాంకు అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే. జాతీయ ప్రమాణాల ప్రకారం గాలిలో ధూళి కణాలను 60 మైక్రోగ్రాముల లోపునకు తీసుకురావాలంటే ప్రభుత్వ చర్యలతో పాటు పౌరుల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం. ప్రజా రవాణాను వినియోగించడం, టెర్రస్ గార్డెనింగ్ పెంచడం, నిర్మాణ నిబంధనలు పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తేనే హైదరాబాద్ నిజమైన ‘క్లీన్ ఎయిర్ సిటీ’గా చిరస్థాయిగా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *