వోట్ల లెక్కల వెనుక రాజకీయ చదరంగం!

ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉండే నమ్మకమే ఆ వ్యవస్థకు అసలైన బలం. ఆ నమ్మకం సన్నగిల్లితే ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోతాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చుట్టూ చెలరేగిన వివాదం సరిగ్గా ఇటువంటి ఆందోళననే రేకెత్తిస్తున్నది . సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రంగంలోకి దిగి, వోటర్ల జాబితా నుండి 1.27 కోట్ల మంది హిందూ వోటర్ల పేర్లు గల్లంతయ్యాయని, అదే సమయంలో ముస్లిం వోటర్ల సంఖ్య 1.65 శాతం పెరిగిందని సంచలన ఆరోపణలు చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. సాధారణంగా ప్రతిపక్షాలు మాత్రమే చేసే ఇటువంటి ఆరోపణలను అధికార పక్ష అధినేతే చేయడం ఎన్నికల సంఘం పనితీరును, దాని విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది.

ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలను లోతుగా పరిశీలిస్తే, ఈ వివాదానికి మూలం గణాంకాల విశ్లేషణలో ఉన్న సాంకేతిక లోపాలేనని స్పష్టమవుతున్నది . రాష్ట్ర పంచాయతీ వోటర్ల జాబితాలో పేర్లు ఉన్న 66 లక్షల మంది, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన 55 లక్షల మంది, 4.5 లక్షల మంది యువ వోటర్ల పేర్లు అసెంబ్లీ వోటర్ల జాబితాలో లేవన్నది ఆయన ప్రధాన వాదన. అయితే, ఈ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా ఇచ్చిన వివరణ కీలక వాస్తవాలను బయటపెట్టింది. ఎన్నికల సంఘం వద్ద వోటర్ల మతం లేదా కులానికి సంబంధించిన ఎలాంటి డేటా ఉండదని, ఏ ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వోట్లను తొలగించే కుట్ర జరగలేదని సీఈఓ తేల్చి చెప్పారు.

వాస్తవానికి, పంచాయతీ వోటర్ల జాబితాకు, అసెంబ్లీ వోటర్ల జాబితాకు మధ్య దాదాపు 2.4 కోట్ల వ్యత్యాసం ఉండటానికి బలమైన పరిపాలనా, సాంకేతిక కారణాలు ఉన్నాయి. అసెంబ్లీ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘంనిర్వహిస్తుండగా, పంచాయతీ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా రూపొందిస్తుంది. ఈ రెండు డేటాబేస్‌ల మధ్య ప్రత్యక్ష అనుసంధానం లేదు. ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్లిన 2.17 కోట్ల మంది వోటర్ల పేర్లు, బూత్ స్థాయి అధికారుల తనిఖీల్లో స్థానికంగా లేనందున అసెంబ్లీ జాబితా నుండి తొలగించబడ్డాయి. కానీ పాత పంచాయతీ రికార్డులలో వారి పేర్లు ఇంకా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, అనేక గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో విలీనం కావడం వల్ల కూడా గ్రామీణ అసెంబ్లీ వోటర్ల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నది . బయటి వ్యక్తులు అనధికారిక సాష్ట్ వేర్ల  ద్వారా పేర్ల ఆధారంగా మతాన్ని అంచనా వేసి విడుదల చేసిన లెక్కలను ఆధారంగా చేసుకుని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యలు చేయడం వల్ల అనవసరమైన అపోహలు తలెత్తుతున్నాయి.

ఇదే సమయంలో ఈ వివాదం వెనుక ఉన్న లోతైన రాజకీయ వ్యూహాలను కూడా విస్మరించలేము. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, మతపరమైన వోట్ల తొలగింపు అనే అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా తమ సంప్రదాయ వోటు బ్యాంకును ఏకం చేసే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు దీనిని చూస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో, క్షేత్రస్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేయడానికి, వోటర్ల నమోదుపై దృష్టి సారించేలా చేయడానికి అధికార పక్షం ఈ ఎత్తుగడ వేసి ఉండవొచ్చు. మరోవైపు, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తూ, తమ పీడీఏ ( వెనుకబడిన, దళిత, మైనారిటీ) వోట్లు కోటికి పైగా గల్లంతయ్యాయని ఆరోపించడం గమనార్హం. వోటర్ల జాబితా సవరణ వంటి పూర్తిస్థాయి సాంకేతిక ప్రక్రియకు మతపరమైన, కులపరమైన రంగు పులమడం ద్వారా ఇరు పక్షాలు తమ వోటు బ్యాంకులను కాపాడుకునే రాజకీయ క్రీడకు తెరలేపాయి.

 ఎన్నికల సంఘం  తన బాధ్యతను  సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. 2026 జనాభా అంచనాల ప్రకారం యూపీలో 18 ఏళ్లు నిండిన వారు 16.16 కోట్ల మంది ఉండగా, ప్రస్తుత ముసాయిదా జాబితాలో 13.58 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 2.58 కోట్ల మంది అర్హులు ఇంకా జాబితా వెలుపలే ఉన్నారు. పంచాయతీ , అసెంబ్లీ జాబితాలను సరిపోల్చి అర్హులందరినీ చేర్చాలని యూపీ సీఈఓ తీసుకున్న తాజా నిర్ణయం అభినందనీయం. డిసెంబర్ 16, 2026 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉన్నందున, రాజకీయ పార్టీలు ఆరోపణలు మాని తమ బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా అర్హులైన వోటర్ల పేర్లను నమోదు చేయించడంపై దృష్టి సారించాలి. వోటు హక్కు అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు. దానిని మత రాజకీయాలకు అతీతంగా కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంతో పాటు అన్ని రాజకీయ పార్టీలపైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *