చైనా దురాక్రమణ గురించి…

పత్రికలో సదాశివుడు రాశాడు – ప్రజా సభల్లో మంత్రి నరసింహుడు అది చదివాడు

కటంగూరి నరసింహారెడ్డి గారి సంపాదకత్వం లో ‘విశ్వ జ్యోతి’ 1960 లో ఒక మాస పత్రిక గా ప్రారంభం అయింది. ఆయన పరకాల నివాసి. అంతకు ముందు ‘విశ్వ ప్రజా సేవా సమాజ్’ అనే సామాజిక సేవా సంస్థ నేర్పరిచి ప్రజలలో సామాజిక చైతన్యం, మానవతా దృక్పథం పట్ల అవగాహన కల్పించాలని ‘పంచ శీల సూత్రాలు’ అని ఒక చిన్న పుస్తకం ప్రచురించారు. 1955 ప్రాంతాల్లో వారికి పాములపర్తి సదాశివరావు గారితో సాన్నిహిత్యం ఏర్పడింది. దాదాపు నెలకు 15 రోజులు సదాశివరావు గారి ఇంట్లోనే పడుకునే వారు, కాషాయ రంగు లాల్చి, పైజామా ధరించి భుజానికి ఒక ఖద్దరు సంచీ తగిలించుకొని 4, 5 అంగుళాల గడ్డం కలిగిన ఆయన పెద్ద, పెద్ద అంగలతో నడిచే వారు. ఐతే ఆయన మనసులో ఏముందో కనిపెట్టడం ఎవరి తరం కాదు. మృదుభాషి.విశ్వ జ్యోతి పత్రిక 5, 6 వందలు మాత్రమే ప్రింట్ చేసే వారు. వాటిని ఎట్లా అమ్మేవారో ఆయనకే తెలియాలి. ముందుగా రెగ్యులర్ గా వచ్చినా తరువాత 2 , 3 నెలల కొక్కసారి, ఆ తరువాత ఎప్పుడో ఒకసారి వచ్చేది. సుమారు దశాబ్ద కాలం నడిచింది. ఐతే దానిలో వచ్చిన ఒక్కొక్క ప్రత్యేక వ్యాసం ఒక్కొక్క ఆణిముత్యం. జర్నలిస్టులకు ఆలోచన మరియు రచనా విధానంలో మార్గ దర్శకం. కొన్ని వ్యాసాలు సామాన్య జనంలో ఆలోచనలు రేకెత్తించేవిగా వుండేవి. ఇవన్నీ పాములపర్తి సదాశివ రావు గారు వ్రాసేవారు.

1962 లో చైనా దురాక్రమణ సందర్భంగా చైనా ప్రధాని చౌ ఎన్ లై పై రాసిన ఒక వ్యంగ విమర్శనాత్మక వ్యాసం అనేక మందిని ఆకట్టుకుంది. కొంత మంది అది కరపత్రాలు లాగా ప్రింట్ చేయించి ప్రజల్లో పంచి పెట్టారు. ‘ఆంధ్ర జనత’ దిన పత్రిక లో దీనిని ముద్రించారు. ఆచార్య కోవెల సుప్రసన్న గారు ఈ వ్యాసం గురించి ‘ చౌ ఎన్ లై ను వెక్కిరిస్తూ రాసిన ఈ వ్యాసం ఏ అభ్యుదయవాది చేయని’ రచన గా పేర్కొన్నారు. ఇక అసలు విషయానికి వస్తే అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార మంత్రి పీ వీ నరసింహారావు గారిని కూడా ఇది ఆకట్టుకుంది. ఆయన వెంటనే సదాశివరావు కు ఒక ఉత్తరం రాస్తూ ఈ రచనను ప్రజా సభల్లో ‘చైనా చేసిన మోసంగా’ చెప్పే ఉపన్యాసాలల్లో వాడుకుంటానని తెలిపారు. ఆ లేఖ చివరిలో చైనా చేసిన ఇటువంటి మోసాల గురించి ప్రజలకు తెలియపరిచే మరిన్ని వ్యాసాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రచురిత ‘ఆంధ్రప్రదేశ్’ మాస పత్రికకు రాయాలని సదాశివరావును కోరడమైంది.

చౌ ఎన్ లై గురించి సదాశివ రావు రాసిన వ్యంగ్యాత్మక విమర్శనను ముఖ్య వేదికలపై చదువుతానన్న పీ వీ గారు చైనా దురాక్రమణ విధానాలపై ప్రభుత్వ ‘ఆంధ్ర ప్రదేశ్’ మాసపత్రిక కు ప్రతి నెలా రచనలు పంపించాలని సదాశివ రావు ను కోరిన పీ వీ గారు.

1965 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగును అధికారిక భాషగా చేయాలని అందుకుగాను పారిభాషక పదకోశం తయారు చేయాలని భావించి సంబంధిత బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టినపుడు ‘విశ్వజ్యోతి’ 16 పేజీల ఒక ప్రత్యేక సంపుటి ‘అధికార భాష గా తెలుగు – అనువాద సమస్యలు’ శీర్షికన ఒక వ్యాసాన్ని ముద్రించింది. శాసనసభలో వాడీవేడిగా జరిగిన చర్చలో శ్రీయుతులు తెన్నేటి విశ్వనాథం, వావిలాల గోపాలకృష్ణయ్య తదితర హేమాహేమీ ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించినపుడు తగు సమాధానం చెప్పడానికి సంబంధిత మంత్రి పీ వీ గారికి యీ వ్యాసం ఎంతో ఉపకరించింది. ఈ వ్యాసాన్ని ఆ మాసపు ‘ఆంధ్ర ప్రదేశ్’ సంచిక లో ప్రచురించినట్లు జ్ఞాపకం.
1964లో శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు పార్టీని చీల్చినపుడు విశ్వజ్యోతి లో ప్రచురించిన ‘మెజారిటీ ముఠా తో సుందరయ్య హఠ వర్గం’ అనే విమర్శనా వ్యాసం సుందరయ్య గారిని నొప్పించిందట. ఇక 1969 తెలంగాణ ముల్కీ ఉద్యమ ప్రారంభ దశలో విశ్వజ్యోతిలో ప్రచురించిన ముల్కీ రక్షణోద్యమ సమర్థత వ్యాసం సంచలనం సృష్టించింది. వివిధ ఉద్యమకారులు ఆ వ్యాసాన్ని కరపత్రాలు గా ముద్రించి తెలంగాణ అంతటా ప్రజల్లో పంచి పెట్టారు.

“1956 లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని కర్నూల్ రాజధానిగా వున్న ఆంధ్ర రాష్ట్రం తో కలిపినప్పుడు చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందానికి ప్రభుత్వం తిలోకదాలిచ్చిన సందర్భంలో వాటి వివరాలను వెలుగు లోకి తెస్తూ తెలంగాణ హక్కుల ఉద్యమం కోసం వారు వ్రాసిన ఒకే ఒక్క వ్యాసం ఓరుగల్లు లోనే కాక తెలంగాణ అంతటా ముసురుకొని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి వర్గాలను హడలెత్తించింది. గడగడలాడించింది” అని ఈ వ్యాసం గురించి ‘తెలంగాణ వైతాళికులు’ అన్న గ్రంథంలో శ్రీ పల్లేరు వీరాస్వామి గారు తన రచనలో పేర్కొన్నారు.విచిత్రమేమంటే పాములపర్తి సదాశివ రావు ఆప్త మిత్రుడు, బహిఃప్రాణం పీ వీ నరసింహారావు అప్పుడు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో విద్యా శాఖామంత్రి , సమెక్యవాది.

శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *