పిల్లలు వర్ధిల్లాలంటే పెద్దలు మారాల్సిందే!

పుస్తక సమీక్ష

‘పిల్లలు వర్ధిల్లాలి’ అనే నినాదంతో అధ్యాపకులు,జనవిజ్ఞాన వేదిక కార్యకర్త ,మాజీ శాసన మండలి సభ్యులు బాల సుభ్రమణ్యం  మరియు ఆదర్శ ఉపాధ్యాయులు సి. వి.కృష్ణయ్య కలిసి రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని జనవిజ్ఞాన వేదిక వారు ప్రచురించారు. పిల్లల పక్షం వహించే వ్యక్తులకు,సంఘాలకు,సామాజిక కార్యకర్తలకు విధాన నిర్ణేతలకు ఎంతో ఉపయోగం. పిల్లల ప్రపంచం అద్భుతమైనది. ఆ ప్రపంచానికి పెద్దల ప్రపంచానికి చాలా తేడా ఉందనేది చాలా అనుభవాలు చెపుతున్నాయి. అదే విషయాన్ని పలు వ్యాసాలలో స్పృశించారు. పిల్లల కేంద్రంగా బడి,ఇల్లు సమాజం అలాగే పిల్లలను గౌరవించే సమాజ స్థాపన కు తపన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఇంటి నుండి మొదలై పాఠశాల ద్వారా బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిన నాటి నుండి తమ బాల్యానికి భరోసా కోసం వెతుకులాడుతుంటారు పిల్లలు. ఈ పెద్దలు మనం చెప్పింది వింటే బాగుండని అనుకుంటుంటే పిల్ల నాయాళ్ళూ మీకేం తెలుసని ,మా చిన్నప్పుడు మేము అని మొదలయ్యే ప్రవచనాలు ప్రతి రోజు వింటూ ఇక ఈ పెద్దలు మారరని బాలల ప్రపంచం నుండి మెల్లి మెల్లిగా ఉపసంహరించుకుని వాళ్ళు కూడా పెద్దల ప్రపంచపు నియమాలు వంట పట్టించుకుంటారు. పుస్తకం లోని ‘పిల్లలే ప్రపంచం పిల్లలే భవిష్యత్తు’ వ్యాసంలో పిల్లల గురించి స‌వివ‌రంగా అందించారు.

అందులో పిల్లలు లేని ప్రపంచమా అనే ప్రశ్న అందరినీ ఆలోచింప చేస్తుంది. ఆడ పిల్ల మన ఆశ నే కాదు మన దిక్సూచి కూడా అని అర్ధం అవుతుంది. కొంత మంది ఆడ పిల్లలు ఒకడుగు ముందుకేసి ‘ఇక చాలు’ అని తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. వచ్చిన చిక్కల్లా ఈ ధిక్కార స్వరాలను వినే సమాజాన్ని తయారు చేయడమే పెద్ద సవాల్‌. కర్ణాటకలో ఆడ పిల్లలు ధరిస్తున్న దుస్తుల మీద  కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులు చదువులకు దూరం చేసిన ప్రయత్నం విచారకరం. దాని పూర్వా పరాలు ఈ వ్యాసంలో పొందుపరిచి రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను వివరించారు. మారుతున్న విద్యా వ్యవస్థలో బాల్యం బలవుతున్న తీరుతో పాటు ఉపాధ్యాయుల నిస్సహాయతలు దిగజారుతున్న విద్యా విధానాల పై ఆందోళన, మారుతున్న గురు శిష్యుల ప్రేమ బంధాలను గమనించ వచ్చు. డిజిటల్ వ్యసన ప్రమాదంలో బాల భారతం అనే వ్యాసం ఉన్న సవాళ్ళతో పాటు మరొక కొత్త సవాల్‌కు తెర లేపిం ది. పిల్లలు రెండు ప్రపంచాలలో జీవిస్తున్నారు. భౌతిక ప్రపంచం డిజిటల్ ప్రపంచం. కొంత మంది పిల్లలు డిజిటల్ ప్రపంచం లోనే ఎక్కువ సమయం గడుపుతూ మొబైల్ తెరల డిజిటల్ వ్యసనానికి అలవాటు పడుతున్న అంశాన్ని ఒక అనుభవం వివ‌రించి మ‌న‌కు క‌నువిప్పు క‌లిగిస్తుంది. ‘బడే భవిష్యత్తు బడే భరోసా’ వ్యాసం పిల్లల ప్రపంచంలోకి  తీసుకెళ్లింది.

పిల్లలను అర్ధం చేసుకోవాలి. దండించడంతో పిల్లల ప్రవర్తన మారుతుంది అని చెప్పే అధ్యయనాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. పైగా బాలలకు పెద్దల పట్ల అగౌరవ భావం కలుగుతుందని గుర్తించాలి. పిల్లలు చదవగలరని, ఉపాధ్యాయులు నేర్ప గలరని నమ్మి. పిల్లలను బడిలోనే ఉంచాలనే రాజీ లేని నిర్ణయాలు తీసుకోవాలని ఒక వ్యాసం ఆలోచింప చేస్తుంది. కారణాలు ఏవైనా విద్యార్థులు బడి మానేస్తే ఉపాధ్యాయులకు బోధన చేసే హక్కును దూరం చేశారని అర్ధం. కావున ఉపాధ్యాయులుగా పిల్లల హక్కులకు కాపలాదారులై ఉండాలి. వారి నాణ్యమైన విద్యా హక్కును, రక్షణ హక్కును రక్షించడం లో ముందు వరసలో ఉండాలి. అదే గురు శిష్య ప్రేమాను బంధాలుగా నిలిచి పోతాయి. వ్యాసాలు చదివితే ఇదే విషయాన్ని నమ్మే చాలా మంది ఉపాధ్యాయులు గుర్తుకొచ్చారు. విద్యను అందించడం ఒక రాజకీయ ప్రక్రియ.

ఎవరు అందిస్తున్నారు ఎవరు అందుకుం టున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఎటువంటి విధానాలు రూపొందిస్తున్నారు అనేది ప్రశ్న. పిల్లలంద రికి సమాన విద్యా అవకాశాలు కలిగించే విధానాలు చేస్తున్నారా అనే చర్చ చేయవలసిన అవసరం ఉందని ఈ పుస్తకంలోని పలు వ్యాసాలలో కనపడుతుంది.  రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనలో మన ప్రభుత్వాలు ఆరితేరి ఉన్నారు. ప్రాథమిక విద్యా రంగం ప్రస్తుతం ప్రత్యాన్మయం అనే వ్యాసం ప్రత్యాన్మయ విద్యా విధాన పత్రంగా మన ముందు ఉంచారు. ఈ విధానాన్ని అంది పుచ్చుకోవడానికి ‘మన పిల్లలకు’ ఒక విధానం ‘మంది పిల్లలకు’ మ‌రో విధానం కాకుండా పిల్లలందరికి సమాన విద్య అందాలని ఆలోచించే ప్రభుత్వాలు వస్తేనే సాధ్యం. ఎడారిలో ఒయాసిస్సులలా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు తమ బడికి వస్తున్న పిల్లలను తల్లిదండ్రులకు విశ్వాసం కలిపించి అరకొర వసతుల మధ్య తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు.పిలలకు న్యాయం చేస్తూ భరోసా నిస్తున్నారు. నిరాశ మార్పుకు దోహదపడదని ఆశ మౌలిక మార్పు కోసం ఎదురుచూసే ప్రక్రియ కాబట్టి వారి స్పూర్తి తోనే ఇటువంటి మంచి పుస్తకం వచ్చిందని భావిస్తున్నా. మొత్తంగా పిల్లలు వర్ధిల్లాలి పుస్తకం సమకాలిన రాజకీయ చర్చ కు దారి తీసి ఒక ప్రత్యాన్మాయ‌ విద్యా విధానం రావాలని అందులో పిల్లలు వర్ధిల్లాలని, బాల్యాన్ని ఆనందంగా ఉంచుకోవడానికి తప్పక చదవవాల్సిన పుస్తకం ‘పిల్లలు వర్ధిల్లాలి’. జులై నెల విశాఖపట్నం లో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర సమావేశం లో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగినది.
-ఆర్. వెంకట రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *