మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ప్రాశస్త్యం
అట్లాంటిక్ మహాసముద్ర తీరాన మాతృభాషా సువాసనలు పరిమళిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, సాంకేతిక, పరిశోధనా రంగాలలో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలోని ప్రతి ప్రధాన నగరంలోనూ తమ ముద్ర వేసిన ప్రవాస తెలుగు సమాజం ఒక బృహత్తర వేదికపైకి చేరుతోంది. ప్రవాస భారతీయ సాంస్కృతిక సమ్మేళనానికి, తెలుగు భాషా పరిరక్షణకు, తరతరాల సంస్కృతీ సాంప్రదాయాల కొనసాగింపునకు నిరంతరం కృషి చేస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తన 19వ మహాసభలను అత్యంత ప్రాభవంతో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్ రాష్ట్రంలోని చారిత్రక బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ త్రైవార్షిక మహాసభలు, విశ్వవ్యాప్త తెలుగు జాతి మేధో సంపత్తికి, సాంస్కృతిక వైభవానికి, సేవా దృక్పథానికి ప్రతీకగా నిలవనున్నాయి. కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా భాష, సాహిత్యం, శాస్త్ర సాంకేతికతలు, వ్యాపారం, మహిళా సాధికారత, యువజన వికాసం, సామాజిక బాధ్యత వంటి బహుముఖ అంశాల సమాహారంగా రూపుదిద్దు కుంటున్న ఈ సభలు, ప్రవాసాంధ్రుల చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా నిలిచి పోనున్నాయి.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ పూర్వాపరాలను పరిశీలిస్తే, 1990వ సంవత్సరంలో లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా ఇది ఆవిర్భవించింది. ఉత్తర అమెరికా ఖండంలో స్థిరపడిన తెలుగు వారి హక్కుల పరిరక్షణ, సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ మరియు భావితరాలకు భారతీయ మూలాలను పదిలంగా అందించే మహోన్నత లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ సంస్థ, గడిచిన ముప్పై ఆరు ఏళ్లలో అపూర్వమైన ప్రగతిని సాధించింది. 1992లో తొలి మహాసభలతో ప్రారంభమైన ఆటా ప్రస్థానం, నేడు అమెరికాలోని 40కి పైగా ప్రధాన నగరాలలో విస్తరించిన శాఖలతో, 50,000 పైచిలుకు ప్రాథమిక సభ్యులతో మరియు లక్షలాది మంది మద్దతుదారులతో అత్యంత బలమైన సాంస్కృతిక వటవృక్షంగా రూపుదిద్దుకుంది. భారతదేశం నుండి ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల కోసం అమెరికాకు వచ్చిన లక్షలాది మంది విద్యార్థులకు, ఐటీ నిపుణులకు, వైద్యులకు, పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలోనూ, వారికి అవసరమైన సామాజిక ఆసరాను కల్పించడంలోనూ ఆటా పోషించిన పాత్ర అద్వితీయమైనది.
ప్రస్తుతం బాల్టిమోర్‌లో నిర్వహించ బడుతున్న 19వ ఆటా మహాసభలు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అత్యంత విశాలమైన కన్వెన్షన్ ప్రాంగణంలో, ప్రపంచవ్యాప్తంగా విచ్చేసే దాదాపు 15,000 మందికి పైగా ప్రతినిధుల భాగస్వామ్యంతో శోభాయమానంగా జరగనున్నాయి. ఈ సభలకు సంబంధించిన విస్తృత ఏర్పాట్లను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో దాదాపు 70 ప్రత్యేక కమిటీలు మరియు వందలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలు గత కొన్ని నెలలుగా అహోరాత్రులు శ్రమిస్తూ పర్యవేక్షిస్తున్నారు. మహాసభల సఫలీకృతం కోసం నిర్వహణ కమిటీ యంత్రాంగాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించారు. ఇందులో భాగంగా 19వ ఆటా మహాసభల కన్వీనర్‌గా మేరీల్యాండ్‌కు చెందిన శ్రీధర్ బానా, కో ఆర్డినేటర్‌గా వర్జీనియాకు చెందిన రవి చల్లా, నేషనల్ కో ఆర్డినేటర్‌గా శరత్ వేముల, డైరెక్టర్‌గా సుధీర్ దమిడి నియామకమయ్యారు. అలాగే కో కన్వీనర్‌గా అరవింద్ ముప్పిడి, కో కోఆర్డినేటర్‌గా జీనత్ కుందూర్, కో నేషనల్ కో ఆర్డినేటర్‌గా కౌశిక్ సామ, కాన్ఫరెన్స్ రీజినల్ కో ఆర్డినేటర్‌గా తిరుమల్ మునుకుంట్ల, కో డైరెక్టర్‌గా కిరణ్ అల బాధ్యతలు చేపట్టారు.

ఈ మహాసభల కోర్ టీమ్‌కు వ్యూహాత్మక పర్యవేక్షణ, సలహాలు మరియు క్షేత్రస్థాయి సహాయం అందించడానికి అనుభవజ్ఞులైన నిర్వాహకులు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ప్రత్యేక ‘అడ్ హాక్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ టీమ్’ను ఏర్పాటు చేశారు. ఈ పర్యవేక్షణ బృందంలో టెన్నెస్సీ నాష్‌విల్లేకు చెందిన రామకృష్ణ ఆల, టెక్సాస్‌కు చెందిన రఘువీర్ మారిపెద్ది, న్యూజెర్సీకి చెందిన విజయ్ కుండూరు, టెక్సాస్‌కు చెందిన జేపీ ముద్దిరెడ్డి, పెన్సిల్వేనియాకు చెందిన రాజు కాకర్ల మరియు ఇల్లినాయిస్‌కు చెందిన మహీధర్ ముస్కుళ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎలాంటి లోటుపాట్లు రాకుండా సాంకేతిక, పరిపాలనా ప్రణాళికలను పర్యవేక్షిస్తున్నారు.
మహాసభల మొదటి రోజైన జూలై 31న ప్రతినిధుల నమోదు ప్రక్రియతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వ్యాపార రంగంలో భాగస్వామ్యాలను పెంపొందించే దిశగా భారత్ మరియు అమెరికా దేశాలకు చెందిన దాదాపు 500 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వెంచర్ క్యాపిటలిస్టులు పాల్గొనే ‘బిజినెస్ మ్యాచ్ మేకింగ్’ సమావేశాలు ఈ రోజే జరగనున్నాయి. రెండు దేశాల మధ్య పెట్టుబడుల అవకాశాలు, సాంకేతిక మార్పిడి, వ్యాపార విస్తరణలపై ఇందులో లోతైన చర్చలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 16 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత కోసం బాల్టిమోర్ హార్బర్‌లో చెసాపీక్ బే జలాలపై ప్రత్యేకంగా విలాసవంతమైన నౌకలో (క్రూయిజ్) వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 4 గంటల పాటు సాగే ఈ నౌకాయానంలో సమకాలీన డీజే సంగీతం, నృత్యాలు, స్థానిక భారతీయ రెస్టారెంట్ల నుండి కన్వెన్షన్ సెంటర్ ఫుడ్ చైన్ పర్యవేక్షణలో తెప్పించిన ప్రామాణిక భారతీయ వంటకాల విందు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రత్యేక యువజన ఈవెంట్‌లో ప్రముఖ సినీ తారలు, క్రీడాకారులు కూడా పాల్గొని ఉత్సాహాన్ని నింపనున్నారు. అనంతరం కన్వెన్షన్ సెంటర్‌లో సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన, భారత్-అమెరికా జాతీయ గీతాల ఆలాపన, నాయకత్వ సందేశాలు, ముఖ్య అతిథుల ప్రసంగాలు, విశిష్ట సేవా పురస్కారాల ప్రదానం మరియు వర్ణరంజిత సంగీత విభావారితో మహాసభలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
రెండవ రోజైన ఆగస్టు 1న మహాసభలు తమ మేధోపరమైన, సాహిత్యపరమైన విస్తృతిని ప్రపంచానికి చాటిచెబుతాయి. వర్తమాన ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డేటా సైన్స్, బయోటెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్‌కేర్ మరియు స్టార్టప్ వ్యవస్థలపై అంతర్జాతీయ స్థాయి నిపుణులు, సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ సీఈవోలు, శాస్త్రవేత్తలు పాల్గొనే ప్రత్యేక విజ్ఞాన సదస్సులు నిర్వహించబడతాయి. ఇవి యువ ఇంజనీర్లకు, విద్యార్థులకు భవిష్యత్ ఉద్యోగ, పరిశోధనా అవకాశాలపై దిశానిర్దేశం చేస్తాయి. సమాంతరంగా, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక మహిళా సదస్సులు, లీడర్‌షిప్ వర్క్‌షాప్‌లు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు జరగనున్నాయి. సాహిత్య విభాగం ఈ మహాసభల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర దేశాల నుండి విచ్చేసిన సుమారు 50 మందికి పైగా ప్రముఖ కవులు, పండితులు, అవధానుల భాగస్వామ్యంతో అవధాన కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు జరగనున్నాయి. వీటితో పాటు వందలాది మంది శాస్త్రీయ, జానపద, సినీ కళాకారుల నృత్య ప్రదర్శనలు, సంగీత కచేరీలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.
మూడవ రోజైన ఆగస్టు 2న, నూతన ఆలోచనలతో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తల కోసం ‘స్టార్టప్ పిచ్’ పోటీలు నిర్వహించనున్నారు. అత్యుత్తమ ఆవిష్కరణలకు నగదు బహుమతులు అందజేయడమే కాకుండా, వెంచర్ క్యాపిటలిస్టుల నుండి నిధుల సమీకరణకు వేదికను కల్పిస్తారు. గత కొన్ని నెలలుగా ఉత్తర అమెరికాలోని వివిధ నగరాల్లో ప్రాథమిక స్థాయిలో నిర్వహించిన “ఝుమ్మంది నాదం” (సంగీత పోటీలు), “సై అంది పదం” (నృత్య పోటీలు) తుది ఘట్టాలు ఈ రోజే జరగనున్నాయి. అలాగే చిన్నారుల బాలల సాంస్కృతిక పోటీలు, పౌరాణిక, దేవీ దేవతల వేషధారణల ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపింపజేస్తాయి. సాయంత్రం జరిగే ముగింపు సభలో, సమాజానికి మరియు తెలుగు భాషకు అసమాన సేవలందించిన ప్రముఖులకు ‘ఆటా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ మరియు ‘సేవా రత్న’ పురస్కారాలను అందజేస్తారు. ఈ వేదికపై నుండి రాబోయే మూడేళ్ల కాలానికి ఆటా చేపట్టబోయే విద్యా, వైద్య, సామాజిక సేవా విస్తరణ ప్రణాళికను ప్రకటిస్తారు.
ఆటా మహాసభల వెనుక ఉన్న ప్రాథమిక అంతస్సూత్రం కేవలం సాంస్కృతిక వినోదానికి పరిమితం కాకుండా, అమెరికాలో జన్మించి పెరుగుతున్న రెండవ, మూడవ తరాల తెలుగు పిల్లలకు తమ సాంస్కృతిక మూలాలను, మాతృభాషా పరిమళాలను, భారతీయ కుటుంబ వ్యవస్థలోని శ్రేష్ఠమైన విలువలను అందించడమే. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 10 లక్షల మందికి పైగా తెలుగువారు నివసిస్తున్నారు. అమెరికన్ సెన్సస్ నివేదికల ప్రకారం, ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారతీయ భాషా వర్గాలలో తెలుగు అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో, స్థానిక పాఠశాలల్లో తెలుగును ఒక ఐచ్ఛిక భాషగా గుర్తింపజేయడం, ‘ఆటా తెలుగు బడి’ ద్వారా వేలాది మంది చిన్నారులకు తెలుగు చదవడం, రాయడం నేర్పించడం వంటి బృహత్తర బాధ్యతలను సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. సభల్లో చిన్నారుల కోసం నిర్వహించే రామాయణ, మహాభారత శ్లోకాల పోటీలు, నాటకాలు పిల్లలలో ధర్మబద్ధమైన ఆలోచనలను, మాతృభాష పట్ల మమకారాన్ని పెంపొందిస్తున్నాయి.
సామాజిక సేవా రంగంలో ఆటా సాధించిన ప్రగతి ప్రశంసనీయమైనది. అమెరికాలో విపత్తులు సంభవించినప్పుడు గానీ, భారతదేశంలో వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గానీ ఆటా కోట్లాది రూపాయల సహాయ నిధులను సేకరించి బాధితులకు అందజేసింది. ప్రతి ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే ‘ఆటా వేడుకలు’ మరియు ‘సేవా డేస్’ ద్వారా లక్షలాది రూపాయల స్కాలర్‌షిప్‌లను పేద విద్యార్థులకు అందిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు, తాగునీటి శుద్ధి కేంద్రాల స్థాపన, రక్తదాన శిబిరాలు వంటి వినూత్న కార్యక్రమాలను సంస్థ నిరంతరం కొనసాగిస్తోంది. నేడు మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఆపిల్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలలో ఉన్నత నాయకత్వ స్థానాల్లో తెలుగువారు రాణిస్తున్నారు. అలాగే వైద్యం, నాసా వంటి పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల ఉపకులపతుల స్థాయి నుండి పారిశ్రామిక సామ్రాజ్యాల వ్యవస్థాపకుల వరకు తెలుగువారి ప్రాతినిధ్యం పెరిగింది. ఈ మేధో సంపత్తిని, ఆర్థిక బలాన్ని ఒకతాటిపైకి తెచ్చి, పరస్పర సహకారం మరియు నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయడంలో ఆటా ఒక శక్తివంతమైన వారధిగా పనిచేస్తోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, వివిధ శాఖల మంత్రులను, ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ ప్రతినిధులు స్వయంగా కలిసి ఈ మహాసభలకు ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, సాహిత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న ఈ సభలు అపూర్వమైన రీతిలో నిలవనున్నాయి. మేరీల్యాండ్ బాల్టిమోర్ నగరం వేదికగా జరగనున్న ఈ 19వ ఆటా మహాసభలు కేవలం ప్రవాసాంధ్రులకు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలకు గర్వకారణమైన ఘట్టం. ‘తేనెల తేటల మాటలతో’ తెలుగు భాషా విశిష్టతను, ‘విశ్వనరుడిగా’ ఎదుగుతున్న తెలుగువాని ప్రగతిని ప్రపంచ యవనికపై చాటిచెప్పే ఈ మహాసభలు, ప్రవాస భారతీయుల సమైక్యతకు, భాషా గౌరవానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి మార్గదర్శకంగా నిలుస్తూ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడటం ఖాయం.
-ప్రజాతంత్ర డెస్క్




