- గత ఆరు నెలల్లో అసాధారణ పురోగతి
- సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ రంగం అసాధారణ వృద్ధి సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిటీలో అంతర్జాతీయ, దేశీయ కంపెనీల ఆఫీస్ స్పేస్ లీజింగ్ లోనూ 40శాతం వృద్ధి నమోదైందని ట్వీట్ చేశారు. ప్రభుత్వం నిశ్శబ్దంగా సమర్థవంతంగా పనిచేస్తే.. ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయన్నారు. తాము కొన్నేళ్లలో హైదరాబాద్‌ను పునర్నిర్మాణం చేసి.. ప్రతి ఒక్కరికీ అవకాశాలు సృష్టిస్తామన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సుమారు 50 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను డెవలపర్లు లీజుకు ఇచ్చారని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిపోర్ట్ తెలిపింది. దీని ప్రకారం… గతేడాది మొదటి ఆరు నెలల్లో గ్రాస్ లీజింగ్ వాల్యూమ్ (జీఎల్‌వీ) 36 లక్షల చదరపు అడుగులు ఉంది.
ఇది 40 శాతం గ్రోత్‌కు సమానం. మిడ్ సైజ్ ఆఫీస్‌లకు గిరాకీ బాగుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో లీజుకిచ్చిన ఆఫీసుల్లో మిడ్ సైజ్ ఆఫీసుల వాటా 48 శాతంగా ఉంది. కిందటేడాది మొదటి ఆరు నెలల్లో ఈ నెంబర్ 26 శాతంగా రికార్డయ్యింది. ఆఫీస్ స్పేస్‌ను ఎక్కువగా లీజుకు తీసుకున్న కంపెనీల్లో ఐటీ-, బీపీఎం కంపెనీలు ముందున్నాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్ కంపెనీల వాటా ఎక్కువగా ఉంది. కంపెనీలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో లీజుకు తీసుకున్న ఆఫీసుల్లో 80 శాతం మాదాపూర్ ఏరియాలో ఉన్నాయి. హైటెక్ సిటీలో తక్కువ ఆఫీసులు అందుబాటులో ఉండడంతో రానున్న రెండుమూడేళ్లలో గచ్చిబౌలి ఏరియాలో డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ మధ్య సిటీలో 27 లక్షల చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది.





