సుప్రీమ్‌ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

ఉద్యమానికి…వర్గీకరణకు మా పూర్తి మద్దతు
ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధితో కృషి
పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ వెల్లడి
మహిళలను అవమానించిన సిఎం రేవంత్‌,  భట్టి : క్షమాపణలు చెప్పాలని కెటిఆర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదని చెప్పారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధితో కృషి చేసిందని తెలిపారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలన్ని వోట్ల రాజకీయం చేశాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం.. వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మాత్రమే ఎస్సీ వర్గీకరణలో మిగతా పార్టీల మాదిరిగా ఒకే పార్టీలో మేము రెండు వాదనలు వినిపించలేదన్నారు. ఒక్క కేసీఆర్‌ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయకోణంలో కాకుండా సామాజిక న్యాయ కోణంలో ఆలోచించారన్నారు.

తెలంగాణ డిమాండ్‌ ఎంత న్యాయమైనదో.. ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యాయమైన డిమాండ్‌ అని కేసీఆర్‌ భావించారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన సంగతిని గుర్తు చేశారు. స్వయంగా సీఎం హోదా లో కేసీఆర్‌ దిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ లేఖ ఇచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణ తన బాధ్యత అని కూడా కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని కూడా కేసీఆర్‌ గతంలో కోరారన్నారు. ఇప్పుడు గౌరవ సుప్రీమ్‌ కోర్టు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని చెప్పారు. ఎస్సీ లకు సంబంధించిన ఉప కులాల జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించటం శుభపరిణామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే వర్గీకరణ పక్రియ ను ప్రారంభించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ తరపున ప్రభుత్వానికి మా సహకారం ఉంటుందన్నారు.

మహిళలను అవమానించిన సిఎం రేవంత్‌,  భట్టి : క్షమాపణలు చెప్పాలని కెటిఆర్‌ డిమాండ్‌
తెలంగాణ శాసన సభలో మహిళా నేతల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. నిండు శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎంలు మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని… వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. వెంటనే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి సీఎం, డిప్యూటీ సీఎంలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా అని చెప్పుకొచ్చారు. ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిదన్నారు. అలాంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *