కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫర్
న్యూదిల్లీ,ఆగస్ట్ 27: కొత్త కారు కొనే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పాత వాహనాల్ని తుక్కు కింద సమర్పించి వాలిడ్ డిపాజిట్ సర్టిఫికెట్ చూపిస్తే కొత్త కారు కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్ ను కల్పించింది. కమర్షియల్ లేదా ప్యాసెంజర్ వాహనాల తయారీ కంపెనీలు కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్ కల్పించేందుకు అంగీకరించిందని ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. స్క్రా కంపెనీలు ఈ డిస్కౌంట్ కు ఒకే చెప్పాయన్నారు. అంటే పాత వాహనం స్క్రాప్ కు ఇచ్చినట్టు సర్టిఫికెట్ చూపిస్తే కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై డిస్కౌంట్ పొందవచ్చు. తమ పాత వాహనాలను స్క్రాప్ చేసి కొత్త వెహికల్ కొనుగోలు చేసే వారికి దాదాపు 1.5 శాతం నుంచి 3.5 శాతం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. దిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) సీఈవోలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా ఆటో రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో 1000 వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు.. 400 ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లు అవసరమని నితిన్ గడ్కరీ 2023లో చెప్పిన సంగతి తెలిసిందే..
కూల్చివేతలు తప్పవన్న కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 27: బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎవరినీ వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రాలో మెంబర్స్ గా మంత్రులు ఉన్నారు..అయినా సరే వారివి అక్రమనిర్మాణాలు అని తేలితే కూల్చేస్తామని హెచ్చరించారు. ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి కాలేజీ ల పై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి..ఇప్పటికే విచారణ ప్రారంభించామని అన్నారు. చెరువుల్లో నిర్మాణాలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను గుర్తించాం.. వారిని త్వరలోనే జైలుకు పంపుతామన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించబోతున్నామన్నారు. హైడ్రా ఎవరికీ నోటీసులు ఇవ్వరు.. అక్రమంగా కట్టుకున్నారు అని విచారణలో తేలితే వెంటనే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
రాజ్యసభలో మెజార్టీ మార్క్ చేరిన బిజెపి
న్యూదిల్లీ,ఆగస్ట్ 27: రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాలీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21వరకు నామినేషన్లు స్వీకరించగా.. తొమ్మిది స్థానాల్లో భాజపా, రెండు స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్ఎల్ఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజా పరిణామంతో ఎగువ సభలో ఎన్డీయే మెజార్టీ మార్కును అందుకుంది. తాజా ఎన్నికతో రాజ్యసభలో భాజపా బలం 96కి చేరగా.. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే ఆ బలం 112గా ఉంది. దీనికితోడు అధికార పార్టీకి ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది. తాజాగా కాంగ్రెస్ నుంచి ఒక సభ్యుడు గెలుపొందడంతో రాజ్యసభలో ప్రతిపక్షాల బలం 85కి పెరిగింది. రాజ్యసభలో ప్రస్తుతం మరో ఎనిమిది స్థానాలు ఖాలీగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్లో నాలుగు, మరో నాలుగు నామినేటెడ్ స్థానాలు ఖాలీగా ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 237గా ఉండగా.. ఇందుకు మెజార్టీ మార్కు 119గా ఉంది. కొత్త సభ్యులను కలిపి చూస్తే.. ఎన్డీయేకు రాజ్యసభలో మెజార్టీ ఉంది. కగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో ..కిరణ్ చౌధరి (భాజపా, హరియాణా), మమతా మొహంతా (భాజపా, ఒడిశా), మిషన్ రంజన్ దాస్ (భాజపా, అస్సాం), రామేశ్వర్ తేలీ (భాజపా, అస్సాం), ధైర్యశీల్ పాటిల్ (భాజపా, మహారాష్ట్ర), రవ్నీత్ సింగ్ బిట్టూ (భాజపా, రాజస్థాన్), ఉపేంద్ర కుశ్వాహా (రాష్టీయ్ర లోక్ మోర్చా, బిహార్), నితిన్ పాటిల్ (ఎన్సీపీ-మహారాష్ట్ర-), మనన్ కుమార్ మిశ్ర (భాజపా, బిహార్), జార్జి కురియన్ (భాజపా, మధ్యప్రదేశ్), రాజీబ్ భట్టాచార్య (భాజపా, త్రిపుర), అభిషేక్ మను సింఘ్వీ (కాంగ్రెస్- తెలంగాణ) ఉన్నారు.





