నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు

14మంది భారతీయ పర్యాటకుల మృతి

ఖాట్మండ్‌,ఆగస్ట్23: ‌నేపాల్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత పర్యటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్‌ ‌జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వీరంతా భారతీయులే. వీరిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్ర నంబరు ప్లేట్‌తో ఉన్న ఓ ట్రావెల్స్ ‌బస్సు శుక్రవారం ఉదయం నేపాల్‌ ‌లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొండల ప్రాంతంలో అదుపు తప్పి మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది.

ఈ సమాచారమందుకున్న ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల్లో ఇప్పటివరకు 16 మందిని కాపాడగా.. మరో 14 మంది మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక డియా కథనాలు వెల్లడించాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్‌ ‌రిలీఫ్‌ ‌కమిషనర్‌ ‌స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు.  ఈ ఏడాది జూన్‌లోనూ నేపాల్‌ ‌లో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *