గల్ఫ్‌ జైళ్లలో వేలాది భారతీయులు

ఉన్న ఊరిలో ఉపాధి కరువై, పొట్టచేత పట్టుకుని ఎడారి దేశానికి వెళ్లి నాలుగు రూపాయలు సంపాదించ వచ్చుననే ఆలోచనలతో గల్ఫ్‌ బాట పట్టిన యువకులు అనూహ్యంగా అవాంఛిత అలవాట్లకు లోనై, జైలు పాలు అవుతున్నారు. కఠినమైన చట్టాలు ఉండే గల్ఫ్‌ దేశాలలో తెలంగాణ యువత తెలిసీ తెలియక, అవగాహన లేకుండా డ్రగ్స్‌ ఉచ్చులో పడి జీవిత ఖైదు అనుభవిస్తున్న సంఘటనలు హృదయ విదారకంగా  ఉన్నాయి. ఒళ్ళు నొప్పి మాత్రలు, గసగసాలు, మత్తు పదార్థాల సరఫరా రాకెట్‌ లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  2023 ఆగస్టు 11న లోక్‌ సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం 4,630 మంది ప్రవాస భారతీయులు ఆరు అరబ్‌ గల్ఫ్‌ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో రకరకాల కేసులలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక శిక్షలు పడిన ఖైదీలు, విచారణ ఖైదీలు కూడా ఉన్నారు.  యూఏఈ లో (1,611), సౌదీ అరేబియా లో (1,461), ఖతార్‌ లో (696), కువైట్‌ లో (446), బహరేన్‌ లో (277), ఓమాన్‌ లో (139) మంది జైళ్లలో ఉన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలానికి చెందిన 24 ఏళ్ల యువకుడు జనవరిలో మత్తు పదార్థాలు కేసులో అనుమానితుడిగా యూ ఏఈ దేశంలోని దుబాయిలో అరెస్టయ్యాడు.

ప్రస్తుతం అబుదాబి లోని సుహాన్‌ సెంట్రల్‌ జైల్లో మగ్గుతూ విచారణను ఎదుర్కొం టున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ కు చెందిన ఒక యువ ఇంజనీర్‌ జాతీయ భద్రతా కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్టయి అబుదాబి జైల్లో మగ్గుతున్నాడు.  నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌ పల్లి, జగిత్యాల జిల్లా కన్నాపూర్‌ కు చెందిన ఇద్దరు కార్మికులు ఒళ్ళు నొప్పి మాత్రల కేసులలో, కామారెడ్డి జిల్లా కరడ్‌ పల్లి కి చెందిన ఒక కార్మికుడు గంజాయి కేసులో వేరు వేరుగా దుబాయి జైల్లో గత పదేళ్లుగా మగ్గుతున్నారు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యులు 2016 లో ఢల్లీి వెళ్లి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.  విదేశాల్లో ఖైదు చేయబడిన భారతీయులకు కాన్సులర్‌ అసిస్టెన్స్‌ (దౌత్య సహాయం), లీగల్‌ ఎయిడ్‌ (న్యాయ సహాయం) అందించాలి.  కార్మికులకు గల్ఫ్‌ దేశాల చట్టాలపై అవగాహన కల్పించడానికి  ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలను  నిర్వహించాలి. ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఫండ్‌ కు అధికం నిధులను కేటాయించి పేద కార్మికులను ఆదుకోవాలి. ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఎంబసీలలో ప్యానల్‌ లాయర్ల సంఖ్యను పెంచాలి.
-రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *