14 రోజుల జ్యుడీ•షియల్ కస్టడీకి కోర్టు ఆదేశం
కోల్‌కతా,ఆగస్ట్23(ఆర్‌ఎన్‌ఎ): వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోల్‌కతాలో ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు నిందితుడిని భారీ భద్రత మధ్య సీల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం సంజయ్‌రాయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో.. పోలీసులు అతడిని జైలుకు తరలించనున్నారు. అలాగే, సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరుచేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ఇటీవల వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భాంరతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై జరిగిన ఈ దారుణం, ఆస్పత్రిపై దాడి ఘటనల నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వచ్చాయి.
మరోవైపు, ఈ దారుణం జరిగిన రోజు డ్యూటీలో ఉన్న ఆర్జీ కర్ ఆస్పత్రి, వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులను సీబీఐ విచారించింది. ఈ విచారణలో సందీప్ ఘోష్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయనకు లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి మంజూరు చేసింది.





