ప్రస్తుతం ఎంజింఎంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఎమర్జెన్సీ వార్డులో సైతం పిలిస్తే పలికే నాథుడుండడు. పేషంట్లు ఎంతో బాధతో కొట్టుమిట్టాడుతున్నా, పరిస్థితి విషమమించినా పట్టించుకునే వారు కనిపించరు. అక్కడ పేషెంట్ల, వారి అటెండెంట్లది అరణ్య రోదనే. వార్డులో రోజూ ఉదయం పూట ఒకసారి లేక రెండు సార్లు మాత్రమే వైద్యులు వొచ్చి పేషంట్లను పరిశీలించి వెళ్లిపోతే.. మళ్లీ తెల్లారే వరకు వార్డు మొత్తానికి డ్యూటీ ఒక్క డాక్టర్ కూడా ఉండడు. ఇక వార్డులో ఉన్న నర్సుల వద్ద అత్యవసర వైద్య పరికరాలు ఆక్సీమీటర్, బిపి మిషన్ వంటివి ఏవీ ఉండవు. ఒక్కోసారి రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి గంట గంటకు..ఇంకా అవసరమయితే క్షణక్షణానికి చెక్ చేయాల్సిన ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి వ్యవస్థ కనిపించదు.. ఉదయం ఒకసారి డాక్టర్ రౌండ్‌కు వొచ్చిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ నర్చులను ఏదడిగినా వారిచ్చే సమాధానం ఒక్కటే.. రేపు డాక్టర్లు వొస్తారు వారిని అడగండి.. ఇక్కడ అత్యవసర పరిస్థితి అంటే ఇంకా ఐదు నిమిషాలకు చనిపోయేవారికి మొదటి ప్రాధాన్యం, పది నిమిషాల్లో చనిపోయేవారికి రెండో ప్రాధాన్యం అలా ఉంటుందేమో.. ! అది కూడా స్పష్టంగా అర్థం కాని పరిస్థితి. పేషంట్‌కు ఏదైనా అత్యవసర చికిత్స అవసరమైతే పక్కన ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పీజీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న, లేదా అప్పటికే అక్కడ ఉన్న, ఓపిక నశించి, విసుగు చెందిన పరిస్థితిలో ఉన్న ఒకే ఒక డాక్టర్ వొచ్చి చికిత్సనందించాలి. ఈ స్థితిలో అక్కడి పేషంట్లకు ఏ మేరకు వైద్యం అందుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక పేషంట్ల పట్ల తీసుకునే జాగ్రత్తలు, అక్కడ అందించే ఆహారంపై కనీస సూచనలు, సలహాలు ఇచ్చే వారే ఉండరు. మందులు, సెలైన్లు పేషంట్ బెడ్ మీద పడేస్తారు. వారి అటెండెంట్లు పది సార్లు వెళ్లి పిలిస్తే కాని నర్సులు వొచ్చే పరిస్థితి ఉండదు. ఇక కనీసంగా అన్ని బెడ్లకు బెడ్ షీట్లు కూడా ఉండవు. సెలైన్లు ఎక్కించడానికి బాటిళ్లు వేలాడదీయాల్సిన స్టాండ్లు ఉండవు. రెండు బెడ్ల మధ్య ఒక స్టాండ్ పెట్టి రెండు వైపులా సైలైన్ బాటిళ్లు వేలాడదీసి ఇరు పేషంట్లకు ఎక్కించడానికి కూడా సరిపోవు. అంతే కాకుండా ఇలాచేయడం వల్ల పొరపాటున ఒక పేషంట్ పక్కకు జరిగితే పక్క పేషంట్‌కు సెలైన్ ఎక్కించే పైపు మొత్తానికే ఊడిపోయే ప్రమాదం ఉంది. ఆ స్టాండ్‌ల కోసం పేషంట్లు వాదులాడుకోవాల్సిన దుస్థితి. ఇక బెడ్‌కు బెడ్‌కు మధ్యన కనీసం అటెండెట్లు నిలబడే స్థలం కూడా ఉండదు. పేషంట్లకు సంబంధించిన ఆహారం, వారి వస్తువులు కింద నేల మీద తప్ప వేరే పెట్టుకునే అవకాశం లేదు. శుభ్రత అనేది అసలు ఉండదు. ఒక పేషంట్‌కు ఉన్న ఇన్‌ఫెక్షన్ పక్క పేషంట్‌కు కానీ, పేషంట్ల అటెండెంట్లకు కానీ సోకే అవకాశాలు ఉన్నాయి. ఇక వాష్ రూమ్‌ల పరిస్థితి అత్యంత దారుణం. ఆ వాష్ రూమ్‌లకు పేషంట్లను తీసుకుని పోతే ఉన్న రోగం పోవడమట్లుంచి కొత్త రోగాలు సోకుతాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇక అటెండెంట్లు తమ పేషంట్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే వారు లేక, పేషంట్లు అవస్థ పడుతున్నా ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతేంటారు. ఇక పేషెంట్ల రక్త పరీక్షల నమూనాలు కానీ, ఇతరత్రాలను నర్సులు పేషంట్ నుంచి సేకరించి బెడ్‌పైనే పడేస్తారు. అవి తీసుకుని వెళ్లి ల్యాబ్‌లో ఇచ్చే బాధ్యత కూడా అటెండెంట్లదే. ఆ విషయంపై స్పష్టమైన సమాచారం లేక, వాటిని ఎక్కడ ఇవ్వాలో, ఏం చేయాలో చెప్పేవారు లేక కొన్ని గంటల పాటు అవి బెడ్లపైనే పడి ఉండే పరిస్థితి. అటెండెంట్లు వాటిని తీసుకుని వెళ్లే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే, రిపోర్టులు మారినా..తప్పుగా వొచ్చినా ఎటువంటి తీవ్రపరిణామాలుంటాయో అర్థం చేసుకోవచ్చు.
వ్యక్తిగతంగా ఎదురైన చేదు అనుభవం
వరంగల్ కొత్తవాడలో నివాసముంటున్న మా అన్న విష్ణుదాసు వేణుగోపాల్ రావు అక్టోబర్ 2న ఉదయం విరేచనాలతో బాధపడుతూ హైదరాబాద్‌లో ఉన్న ఫోన్‌లో నాకు సమాచారం అందించారు. ఆయన భద్రకాళీ దేవాలయం సమీపంలోని సాయిబాబా గుడిలో సేవలందిస్తూ ఒంటరిగా జీవిస్తున్న ఆయన . అనారోగ్యం గురించి సమాచారం అందించగా నేను బంధువుల సాయంతో అన్నను హుటాహుటిన ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించాను. అక్కడ వైద్యులు వారికి చికిత్సనందించి ఏ ఆపాయం లేదని ఇంటికి పంపించారు. అనంతరం వారు ఇంటికి తీసుకుని రాగా పేషంట్‌కు మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం, ముఖం వేలాడేయడం ఆ వెంటనే తిరిగి ఎంజిఎం తీసుకుని వెళ్లడం, వారు రెండవసారి కూడా చికిత్స చేసి మళ్లీ ఇంటికి పంపించారు. రెండవసారి ఇంటికి రాగానే మళ్లీ ఎంజిఎంకు తీసుకుని వెళ్లడం డాక్టర్లకు పరిస్థితిని ఒకటికి రెండుసార్లు వివరించి హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం జరిగిన పరిణామాల వరుస క్రమం. పరిస్థితి తీవ్రతను గమనించిన నేను మా కుమార్తెతో సహా ఆ సాయంత్రమే వరంగల్ చేరుకున్న తర్వాత వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన అనుభవం ఇదీ.. అక్కడ నెలకొన్న దుర్భర పరిస్థితులు చూసి చలించిపోయాను. పేదరికంతో వైద్యం కోసం గంపెడాశతో వొచ్చిన పేషంట్లు, వారి బంధువులు పడే అష్టకష్టాలను హాస్పిటల్ అధికారులు, పాలకుల దృష్టికి తీసుకుని వొచ్చే చిన్న ప్రయత్నం ఇదీ..
ఇక అసలు విషయానికొస్తే ఫిట్స్‌తో హాస్పిటల్‌లో చేరిన ఒక పేషంట్ ఆరు రోజులు హాస్పిటల్ ఉండి, సరైన చికిత్స అందక చనిపోయే వరకు కూడా రోగానికి సంబంధించి తప్పనిసరిగా పరీక్షించి చికిత్స చేయాల్సిన న్యూరాలజిస్ట్(నరాల వైద్య నిపుణుడు) అత్యవసర పరిస్థితిలో కూడా అందుబాటులో లేరు. కేవలం డ్యూటీలో ఉన్న జనరల్ ఫిజియన్ నేతృత్వంలోనే చికిత్స అందించడం ఎంతవరకు సమంజసం. ఫిట్స్ వొచ్చిన, కొంత కాలం క్రితమే తలకు దెబ్బతగిలి అదే ఎంజిఎంలో చికిత్స తీసుకున్న విషయాన్ని డాక్టర్ల దృష్టికి తీసుకురాగా సదరు డాక్టర్లు పేషంట్‌కు ఎంఆర్‌ఐ, ఈఈజీ తీయాల్సిన అవసరం ఉందని రికమెండ్ చేశారు. అయితే రోజూ వేలాదిగా పేషంట్లకు సేవలందించే అంత పెద్ద ఎంజీఎం హాస్పిటల్‌లో ఒకే ఒక ఎంఆర్‌ఐ మిషన్ ఉండడం అత్యంత దారుణం…ఆశ్చర్యకరం. ఇక ఉన్న ఈఈజీ మిషన్ నామమాత్రమే. అది సరిగా పనిచేయడం లేదు. ఆ పరీక్ష కోసం పేషంట్‌ను కాకతీయ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాల్సిందే. ఇక ఎంఆర్‌ఐ మిషన్ ఒక్కటే కావడంతో పది రోజుల తర్వాత కానీ సదరు పేషంట్ కు అవకాశం దక్కదు.. చివరకు ఎంఆర్ విభాగం సిబ్బందిని పేషంట్‌కు సంబంధీకులు ప్రాధేయపడగా దాన్ని నాలుగు రోజులకు కుదించారు. అయితే పేషంట్ అత్యవసర పరిస్థితిని గమనించి పైసలు ఖర్చు పెట్టుకుని అయినా బయట తీయించి తీసుకొద్దామని నిర్ణయించి డాక్టర్లను సంప్రదించగా అందుకు హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవంటూ వారు అనుమతించలేదు. ఆరు రోజులలో మూడు రోజుల చికిత్స అనంతరం పేషంట్ పరిస్థితి దిగజారుతుండడాన్ని గ్రహించి డాక్టర్లను సంప్రదించి ప్రైవేటు హస్పిటల్‌కు తీసుకుని వెళ్లి చికిత్స అందించడానికి కూడా యత్నించగా ఆ పరిస్థితి కూడా లేకపోడంతో, ఎటూ పాలుపోక విధిలేని పరిస్థితుల్లో అక్కడే కొనసాగాల్సిన వొచ్చింది. పేషంట్ ఆరోగ్యం క్షీణించి నోటి ద్వారా ఆహారం తీసుకోలేని, శ్వాస అందని పరిస్థితి ఏర్పదింది. దీంతో ముక్కు నుంచి వేసిన పైపుతో ద్రవాహారం అందించడం, సిలిండర్ ద్వారా ఆక్సీజన్ అందించాం. అలా మొదటగా అక్టోబర్ 2న మధ్యాహ్నం ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసిన పేషంట్‌ను అదే రోజు రాత్రికి మేల్ మెడికల్ వార్డుకు, అనంతరం మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు, అక్కడి నుంచి జబ్బుకు, చికిత్సకు సంబంధం లేని ఐఎంసి (పాయిజనింగ్ కేసెస్) వార్డుకి తరలించారు.
అక్టోబర్ 7న సాయంత్రం పేషంట్ సంబంధీకులు గుర్తు చేసిన అనంతరం సిబ్బంది ఎంఆర్‌ఐకి తరలించే యత్నం చేశారు. పేషంట్ కృత్రిమంగా అందిస్తున్న ఆక్సీజన్‌తో ఊపిరి అందుతున్న దశలో ఆక్సీజన్ లేకుండా పేషంట్‌ను ఎంఆర్‌ఐకి తరలించే క్రమంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం విషాదకరం. డ్యూటీలో ఉన్న నర్సులు పట్టించుకోలేదు.చివరకు పేషంట్‌ను తరలించే వార్డుబాయ్ సూచనతో సంబంధీకులు పక్క వార్డులో ఉన్న డాక్టర్ రిక్వెస్ట్ చేసి ఆక్సీమీటర్ తెచ్చి చూడగా ఆక్సీజన్ నడుస్తుండగానే కనీసం 95 ఉండాల్సిన లెవెల్స్ 79 ఉన్నాయి. ఎంఆర్‌ఐ తీయడానికి కనీసం 40 నిమిషాల పాటు ఆక్సీజన్ లేకుండా ఉంచాల్సిన పరిస్థితి. అంటే ఆ సమయంలో ఒక వేళ ఆక్సీజన్ లెవెల్స్ చెక్ చేయకుండా పేషంట్‌ను తరలిస్తే వెంటనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. హాస్పిటల్‌లో రోగుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి ఇంత కన్నా ఘోరం ఏముంటుంది. హాస్పిటల్‌లో ఈ పరిస్థితులకు కేవలం డాక్టర్లనో, నర్సులనో తప్పుబట్టడం లేదు. నిజంగా వారు అందిస్తున్న సేవలు అమూల్యం. ఆ వాతావరణంలో బయటివారు వరుసగా పది రోజులు ఉంటే రోగాల బారిన పడడం ఖాయం.. అలాంటిది వారు నిత్యం అన్నిటికీ వోర్చి ఎంతో ఓపికతో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అంకిత భావంతో అందిస్తున్న సేవలను మాటల్లో వర్ణించలేం. అయితే డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగానే వారు పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతున్నారు. అయితే ఎక్కడైనా ఓ మేరకు బాధ్యతా రాహిత్యంగా విధులు నిర్వహించే వారు ఉండడం సాధారణం. ఇక్కడ కూడా అందుకు మినహాయింపు లేదు. అయితే కొంత ఎక్కువే అని చెప్పొచ్చు. అది వేరే విషయం.
నామమాత్రంగా నిధుల కేటాయింపు
సరిపడా నిధులు కేటాయించకుండా ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించడం అసాధ్యం. అయితే బడ్జెట్‌లో ఈ రంగాలకు కేటాయింపులు నామమాత్రమే. ఈ ఏడాది కూడా షరామామూలుగా వైద్య రంగానికి కేవలంగా 5.69 శాతం, విద్యారంగానికి 8.6 శాతం కేటాయింపులు మాత్రమే జరిగాయి. శాశ్వతమైన బిల్డింగ్‌ల నిర్మాణం, మౌలిక వసతుల వంటి క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ల మాట అటుంచి ఈ కేటాయింపులు జీతాలు, నిర్వహణకు కూడా సరిపోని దుస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రామాణిక విద్య, మెరుగైన వైద్యం అందుతాయనుకోవడం అత్యాశే. దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసిందనే చెప్పాలి. ఈ ఏడాది అక్కడి ప్రభుత్వం బడ్జెట్‌లో వైద్య రంగానికి 13 శాతం, విద్యా రంగానికి 24.2 శాతం నిధులు కేటాయించి ఆదర్శంగా నిలిచింది. అంతే కాకుండా అక్కడ దాని సత్ఫలితాలను నివేదికలు నిరూపిస్తున్నాయి.
సమాజ శ్రేయస్సుకు… రాష్ట్ర, దేశ అభివృద్ధికి అందుబాటులో ప్రామాణిక విద్య, మంచి వైద్యం అత్యంత ఆవశ్యకం. అవి సరిగా అందకపోవడానికి ప్రజలు కూడా కారణమే. రాజకీయ లబ్ధి కోసం, అధికారం కోసం పార్టీలు, నాయకులు ఎర వేస్తున్న తాయిలాలకు, ఉచితాలకు తమ చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన వోటు అనే ఆయుధాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా ఫణంగా పెడుతున్నారు. నాయకులు ఆ తాయిలాలను కూడా కొంత మేరకు అందించి మన ప్రాథమిక అవసరాలైన, మనకు హక్కుగా రావాల్సిన విద్య, వైద్యాన్ని అటకెక్కిస్తున్నారు. ప్రజలకు ఇవి అందితే అసలు తాయిలాలకు చేయి చాచాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాలపై దృష్టి సారిస్తే తప్పకుండా మార్పు వొచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా అడుగులు పడుతాయని ఆశిద్దాం..





