కవిత్వంలో ఎడతెగని భావధార ఏ గిరిగీతలకు తలవంచక ప్రవాహమై సాగితే అద్భుత సత్యాల ఆవిష్కరణకు అది సాక్ష్యంగా నిలిచిపోతుంది. అనేకానేక సంవేదనల్ని, సంఘర్షణల్ని కవిత్వీకరించడం ద్వారా మనిషి చేసే నిత్య జీవన యుద్ధమెంత భయంకరమైందో ఎంతో స్పష్టంగా ప్రముఖ కవయిత్రి మహెజబీన్ ఆకురాలు కాలం కవితాసంపుటిలోని కవితల ద్వారా చెప్పారు. ప్రశ్నల్ని సంధించి, సూటిదనంతో ఖరాఖండీగా చెప్పడం ఆమె కవిత్వనైజం. మొత్తం 26 కవితలు ఇందులో ఉన్నాయి . మంచి నీటి స్వచ్ఛత లాంటి మనుషుల్ని తీర్చిదిద్దే ప్రేరకంగా ఆమె తన కవిత్వాన్ని మలిచారనడానికి ఈ కవితలు తప్పక సాక్ష్యంగా నిలుస్తాయి.
జండర్, కులం, మతం, ప్రాంతం, భాష పేర జరిగే దోపిడీని, అసమానతలు సృష్టించి చెలరేగిపోయే ఆధిపత్యాన్ని ప్రశ్నించి, ఉనికిని, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిష్టించడం అన్న శిఖర లక్ష్యం ఈ కవితల్లో అభివ్యక్తమైంది. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు సంబంధించిన సంఘటనలతో తాత్వికత, ఉద్యమశీలతను, వ్యక్తీకరణ గాఢతను పలు కవితలు వెల్లడించాయి. కవయిత్రికే సంబంధించిన ప్రత్యేక గొంతుకను అనేక కవితా వాక్యాలు విన్పించాయి.
బతికిన గోడలు కవిత ఉద్యమ ప్రేరణతో ఉద్విగ్నంగా సాగింది. తమ కోసం మేల్కొనే రాత్రి సాక్షిగా నినాదాలతో గోడల్ని స్పర్శిస్తాం/ ఎర్రని వాస్తవాలతో గోడల్ని అలంకరిస్తాం అని చెప్పారు. ప్రజా చైతన్యానికి పెట్టని కోటగా నినాదంతో ప్రజ్వరిల్లే గోడ కర్కశం చిందించిన రక్తం సాక్షిగా గోడ స్వర కంపనమై మాట్లాడుతుందని, జాగృతమై ఎక్కుపెట్టిన అస్త్రమవుతుందని తెలిపారు. రేపు ఉంటామో లేదో తెలియని సందిగ్ధ క్షణాల మధ్య మాట్లాడుకున్నాక మనిషి మనిషి మధ్య ఏర్పడిన ప్రేమ రాహిత్యాన్ని గుర్తు చేశారు. ఒక కన్నీళ్ళను తుడవడానికి/ మరో అశ్రు నయనం కావాలి అన్నారు. భూగోళం మీద ఓజోన్‌తో పాటు ప్రేమ తరిగిపోతున్నదంటూ బ్రతకడానికి ప్రేమ కావాలి మరి అని చెప్పారు. అనేక భాషలు/ అనేక రంగుల దేహాలు/ అయినా వేదన ఒకటే అని డాటర్స్ కింగ్ డమ్ కవితలో అన్నారు. వాస్తవాధీన రేఖల్ని దాటి / స్త్రీలు దేశదేశాల సరిహద్దుల్ని కలిపేశారు/ చరిత్రను తిరగరాసే ప్రయత్నంలో/ మా అస్థిత్వాన్ని చూసి/ మేమే గర్వపడుతున్నాం అని చెప్పారు. కళ్ళు సమాంతర రేఖలై సాగిన వెదుకులాటలో తగిలిన స్వర్శ వేగు చుక్కల జావళి గీతమై తొలకరి పగటిని మోసుకొచ్చిందని తెలిపారు. దేహం గాయపడి మనసు కన్నీటి కొలనయ్యే రొటీన్ జీవితం నుండి రక్షించుకుని మైదానంలోకి నడిచొచ్చి కొత్త వ్యవస్థ కోసం కలగంటున్నానని ఒక పచ్చని జీవితానికి అచ్చంగా మార్గం వేశారు.
స్ట్రీట్ చిల్డ్రన్ కవితలో చెత్తకుప్పల మీద పరుచుకున్న శాపగ్రస్త బాల్యాన్ని చూసి వేదన చెందారు. కేవలం బతకడానికి ఎన్నెన్ని యుద్ధాలు చేస్తారు వాళ్ళు/ ఎన్ని సార్లు గాయపడ్తారో తెలుసా అని.. వాళ్ళను చూస్తుంటే/ పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు / వాళ్ళు నడుస్తుంటే/ ఆత్మస్థైర్యం సాకారమైనట్టు అనిపిస్తుందని చెప్పారు. తొలి సంధ్య కాంతిలో వర్తమానాన్ని మోస్తూ గడపదాటిన జ్ఞాపకాన్ని ఉద్వేగభరితంగా గుర్తు చేసుకున్నారు. తరాల విలాసాల చరిత్ర మిగిల్చిన అవశేషాలు మనల్ని తలెత్తుకోనీకుండా చేస్తాయని హెచ్చరించి మెహిందీ శిథిల శకలాలు సరిహద్దు రేఖల్ని గీస్తాయని విడమర్చి విశదీకరించారు. అక్షరాలను వొదిలి కవిత్వం, కళ్ళతో మునిగి కవ్వింపుగా మెరిసే స్పర్శ వంటి ఆలోచనాత్మక వాక్యాలు అతని సమక్షంలో అన్న కవితలో ఉన్నాయి. అమ్మ రెక్కల కింద బాల్యం/ సురక్షితంగా రూపుదిద్దుకుంది అన్నారు. ప్రేమలేని తనంతో రక్తసంబంధం/ ఆనవాలు లేకుండా పోయిందని చెప్పారు. చీకట్లోంచి వెలుతురులోకి అన్న కవితలో మర్రి చెట్టు నీడలో మొక్కగా సరిపెట్టుకున్నానే తప్ప/ నా బతుకేదో నేను బతికుంటే/ ఈ పాటికి వృక్షమయ్యేదాన్ని కదా అన్న అంతర్గత మధనాన్ని అక్షరమయం చేశారు. సరితారణ్యమంతా కలిసి తిరిగే అవకాశాన్నిచ్చిన చెట్టుతో సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నానని ముందు జాగ్రత్త చర్య కవితలో చెప్పారు.
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని, పక్షుల పాటల్ని వెంట తెచ్చే అతనిప్పుడు లేడు/ ఈ మధ్య అర్థాంతరంగా వచ్చిన/ ఆకురాలే కాలానికి ఎక్కడ రాలిపడ్డాడో అని వేదనాత్మకంగా ఆకురాలు కాలం కవితలో అన్నారు. అతని సమక్షంలో బాల్యం ప్రవహించి, శరీరం అనుభవాల పాఠశాల అవుతుందని అన్నారు. నవస్మృతి అన్న కవితలో గుండె చప్పుడు కడుపులో వినిపించే/ అద్భుతాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని ఆకాంక్షించారు. జీవిత సంబంధం తెగిపోయాక/ బంధాలన్నీ బంధనాలే అని అమ్మ కళ్లు కవితను ప్రారంభించి కలల శాలువా కప్పుకొని నాన్నతో ఏడడుగులు నడిచి అత్తింటికి వచ్చిన అమ్మ చుట్టూ ఆంక్షలు సంకెళ్ళున్నాయని, చిరకాలం మౌనమే ఆమెకు జీవన సహవాసి అయ్యిందన్నారు. విస్తరాకుల్లో మెతుకులేరే పోటీలో/ మనుషుల్తో కలిసి కుక్కలు పాల్గొంటాయంటూ విపరీత దైన్యాన్ని చూపించారు. ఆకాశం జారవిడిచిన రాత్రి ఛాయలు/ ఒక్కొక్కటిగా అదృశ్యమౌతుంటే / చీకటి దారుల వెంట/ నక్షత్రాలు లెక్కపెట్టుకుంటూ వచ్చే పని పిల్ల ఇంట్లో ఎవరినీ పనిచేయకుండా తానే అన్నీ అన్నంతగా మారి చేసిందంటూ అంగార ధారికగా ఆమెను ప్రత్యేకంగా అభివర్ణించారు.
తీపి స్మృతుల శిథిలాలు/ చేదు అనుభవాల శకలాల మధ్య ఒక్కోసారి హృదయం కల్లోలిత ప్రాంతంగా మారుతుందన్నారు. జీర్ అవర్ కవితలో సంయుక్త స్వప్నాల మానిఫెస్టో, యుద్ధం మొదలవక ముందే పోగొట్టుకున్న ఆయుధం అన్న ప్రయోగాలు ఆలోచింపజేస్తాయి. అనంతాకాశం కింద స్వప్న సౌధాల్ని మోస్తూ నిరంతరంగా నడుస్తూనే ఉంటానన్నారు. సరిహద్దులన్నీ చెరిపేసుకున్నాక/ ఆకాశం ఒక్కటే నాకు హద్దయింది అన్న వాక్యాలు కవయిత్రి అనంతాలోచనకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రయోజనం లేదు/ అంతా అయిపోయాక అని అనురాగ స్మృతి కవితలో చెప్పి గుండె చప్పుడు ఆగిపోయాక/ ఏ ఉపగ్రహం ప్రేమ లేఖల్ని మోసుకెళ్ళదు అన్నారు. ఒకానొక మనసు ప్రవహించిన రాత్రి/ ఆవిష్కరించిన దీర్ఘకాలిక కానుకైన తన బిడ్డలో తన రక్తంతో పాటు కవిత్వం కూడా సజలంగా ప్రవహిస్తుందన్న అచంచలమైన నమ్మకాన్ని ప్రకటించారు. దేహం అట్టడుగు పొరల్లో/ అనుభవాల నిక్షేపాల మధ్య/ కదలాడే జ్ఞాపకమై శరీరారణ్యంలో వికసించిన తొలి గుల్మెహర్ సుమమైన ఆమె కోసం జావళి పాడారు. కలల కాశ్మీరాన్ని తలపోస్తూ సాగిన లోయ కవితలో ఒక కరచాలనం, రెండు చేతులుగా విడిపోయే బాధామయ దృశ్యానికి, అక్షర రూపమిచ్చి గాయాలమయమైన లోయ అందాలు, విరిగిన స్వప్న సౌధాలతో వచ్చిపడ్డ అస్తవ్యస్త జీవనాన్ని వెల్లడించి ప్రశాంతతో సేదతీరే రోజు రావాలని ఆకాంక్షించారు. పాట, మాటకు అడ్డుపడకుండా స్వేచ్ఛగా, అభీష్టానికి ప్రతిరూపంగా ఉండే పరిస్థితి రావాలన్నారు. రసోయి ఘర్ ఖిల్వత్ మధ్య జీవితాన్ని, చార్‌దివారీ లేని ఇల్లును కవయిత్రి కోరుకున్నారు. త్రిపురనేని శ్రీనివాస్ జ్ఞాపకంగా రాసిన ఎలిజీలో నేలరాలిన జ్ఞాపకాల నడుమ/ నిస్తేజంగా నిలబడి వున్నాను/ చెదిరిన స్వప్నాల మధ్య దిక్కుతోచక నిలబడి పోతానని తెలిపారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఈ సంపుటిలోని కవితలలో మార్పులు, చేర్పులతో పునర్ముద్రణ జరిగింది. పరిణామ పరిణతను సాధించిన ఈ కవిత్వంలో స్త్రీ వాద దృక్పథంతో పాటు నిత్య జ్వలన పోరాట గీతమై ఎగిసిపడే వర్గాల పట్ల ప్రేమతత్వం, సానుభూతి వ్యక్తమై, ఆత్మస్థైర్యం సాకారమై సరికొత్త వాగ్దానమైంది.
– డా. తిరునగరి శ్రీనివాస్