ప్రధాని మోదీకి మాజీ సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు…
హరీష్ రావు సహా పలువురు ప్రముఖుల ప్రశంస
ఆలస్యంగా అయినా గుర్తింపు దక్కిందన్న పీవీ కుమార్తె వాణీదేవి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించడంపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పీవీకి భారత రత్న ప్రకటించడంపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్‌ఎస్ పార్టీ చేసిన డిమాండ్‌ను గౌరవించి పురస్కారం ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రధాని మోదీ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో షంతోషాన్ని కలిగించిందని కేసీఆర్ పేర్కొన్నారు.
యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయమని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తన(ఎక్స్) ఖాతాలో పేర్కొన్నారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, బహుభాషా కోవిదుడని, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి అని ఆయన కొనియాడారు. స్వరాష్ట్రంలో పీవీకి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చిందని, ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందని, ఏడాదిపాటు పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని హరీష్ రావు గుర్తుచేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని మొదటిసారి డిమాండ్ చేసింది బీఆర్‌ఎస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా పీవీని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ ముద్దు బిడ్డ’ అని కొనియాడారని హరీష్ రావు గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ డిమాండ్‌ను గౌరవించి పీవీకి భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటిండం సంతోకరమైన విషయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక (ఎక్స్) ఖాతాలో ఆయన పోస్టు పెట్టారు. పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా..పీవీకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ గత ఏడాది జూన్‌లో పెట్టిన ట్వీట్‌ను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించడంపై బీఆర్‌ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వండం పట్ల దేశమంతా హర్షిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు అరుదైన గౌరవం దక్కిందని మాజీ ఐఎఎస్ కెవి రమణాచారి హర్షం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆలస్యంగా అయినా ఆయన సేవలను కేంద్రం గుర్తించిందని, అందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఆలస్యంగా అయినా గుర్తింపు దక్కిందన్న పీవీ కుమార్తె వాణీదేవి
మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన కుటుబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రశంసనీయమని ఆయన కుమార్తె వాణీదేవి స్వాగతించారు. పీవీకి భారతరత్న ఆలస్యంగా ప్రకటించినా సంతోషంగా ఉందని అన్నారు. పీవీకి భారతరత్న తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్ధిక సంస్కరణలతో పీవీ నరసింహారావు దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. గొప్ప వ్యక్తులకు సన్మానం మన సంస్కారమని అన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించినందుకు ఆమె కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన కుమారుడు పీవీ ప్రభాకరరావు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా ఈ సమయం కోసం వేచిచూశామని అన్నారు. సంస్కరణలతో పీవీ దేశాన్ని వృద్ధి పధంలో నిలిపారని అన్నారు.