– వచ్చే ఏడాదిలో ఉస్మానియా సేవలు ప్రజలకు అందాలి
– మూడు టిమ్స్‌కు ఏకీకృత నియామకాలు
– నిమ్స్.. టిమ్స్‌ల మధ్య సమన్వయం ఉండాలి
– వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్ విస్తరణ పనులు జూన్ 2వ తేదీ నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఉస్మానియా నూతన హాస్పిటల్ పనులు పూర్తి చేసి ప్రజలకు సేవలందించేలా చూడాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా నూతన దవాఖానాల నిర్మాణ పనులు, వాటికి అవసరమైన పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలు ఏకకాలంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూడేళ్లలోనే తొమ్మిది మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌ల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు సంబంధించి ఏకీకృత విధానం పాటించాలని సీఎం ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా మూడు టిమ్స్ మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా ఉండాలన్నారు. హాస్పిటల్స్ నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టాలని సూచించారు. టిమ్స్‌ల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామని, హౌస్ కీపింగ్ సిబ్బందిపై పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామని తెలిపారు. నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు సమయం ఎక్కువ తీసుకుంటున్నందున సనత్ నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. నిమ్స్‌లో బెడ్స్ లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఆలస్యమైనా సనత్ నగర్ టిమ్స్‌ను వినియోగించుకోవాలన్నారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్, టిమ్స్ డైరెక్టర్లు నిత్యం సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. టిమ్స్‌లో వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటినుంచి వైద్యులను నియమించుకోవాలని, అందుకు అవసరమయ్యే మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. నిర్మాణంలో ఉన్నమరో 79 డయాలసిస్ సెంటర్ల పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. టిమ్స్‌తోపాటు బోధన కళాశాలలు, నర్సింగ్ కళాశాలల పనులు, పరికరాల కొనుగోలు ప్రక్రియ ఏకకాలంలో పూర్తవ్వాలని, అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో వైద్యులు, సిబ్బంది హాజరైన సమయం, విధుల నుంచి వెళ్లే సమయాన్ని నమోదు చేయాలని, హాజరు విషయంలో బయోమెట్రిక్ విధానం అమలయ్యేలా చూడాలని, ఏఐతో పర్యవేక్షణ చేయాలని శాఖాధికారులను ఆదేశించారు.
మూడేళ్లలోనే ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బెడ్ల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఔట్ పేషెంట్ల సంఖ్య 7 లక్షల నుంచి 9 లక్షలకు పెరగడం, ఇన్ పేషెంట్ల సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి గతంలో సగటున 3.9 శాతం కేటాయించగా గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మూడేళ్లలోనే వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, పారా మెడికల్ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసే క్రమంలో వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులను విడుల చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, టీజీఎంఎస్ఐడీసీ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ ముష్రఫ్ అలీ ఫరూఖీ, ఆర్ అండ్ బీ కార్యదర్శి ఇలంబర్తి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌పై సమీక్ష
అనంతరం పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(పీఆర్టీఎస్)పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పీఆర్టీఎస్ కోసం ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్ స్టాండ్ వరకు ఒక లైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీ మెట్రో నుంచి రవీంద్ర భారతి, సెక్రటేరియట్, ఐమాక్స్ నుంచి బేగంపేట్‌కు కలుపుÔతూ ఇంకో లైన్ ఏర్పాటు చేయాలని, నెక్లెస్ రోడ్డులో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలని సూచించారు. కేపీహెచ్బిబీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్ స్పేస్, బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు లైన్‌ను వెంటనే చేపట్టాలన్నారు. గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలని, డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏడాదిలో ఈ లైన్ పూర్తి అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, హైదరాబాద్ మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో అదనపు ఎండీ అజిత్ రెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





