డిమాండ్ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి

దేశంలో బొగ్గుతోనే 72 శాతం విద్యుదుత్పత్తి
మన జీడీపీలో బొగ్గు, గనుల రంగం వాటా 2 శాతం
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి

దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతోందని,  దీనికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  అన్నారు. ఈనేప‌థ్యంలో డిమాండ్లకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. సోమ‌వారం  ఒడిశాలోని చారిత్రక కోణార్క్‌లో రాష్ట్రాల బొగ్గు, గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సులో జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశ జీడీపీలో బొగ్గు, గనుల రంగం భాగస్వామ్యం 2 శాతం ఉంద‌ని,  పారిశ్రామిక అభివద్ధి, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, పునరుత్పాదక విద్యుత్, ఆధునిక సాంకేతికత, తయారీ రంగం వంటి వివిధ రంగాల్లో బొగ్గుతోపాటు వివిధ ఖనిజాలు పోషించే పాత్ర అత్యంత కీలకమ‌ని అన్నారు.ప్రస్తుతం దేశంలోని72 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోంద‌ని వివ‌రించారు. దేశంలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి మొత్తం విలువ దాదాపు 1.86 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 2024లో 997 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. 2014తో పోల్చుకుంటే ఏకంగా 76శాతం మేర ఉత్పత్తి పెరిగింది. 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామ‌ని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనే విశ్వాసం ఉంద‌న్నారు.
అదేవిధంగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాలు, క్లీన్ టెక్నాలజీ కోసం లిథియం, కోబాల్ట్, కాపర్ వంటి ఖనిజాలకు డిమాండ్ పెరుగుతోంద‌ని, అందుకే బొగ్గు, గనుల రంగంలో భారత ఆత్మ నిర్భరత సాధించడం మనకు అత్యంత అవసరమ‌ని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 10 ఏళ్లుగా బొగ్గు, గనుల రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. 2015 కన్నా ముందు బొగ్గు,  గనుల రంగం తీవ్ర సంక్షోభంలో ఉండేది. గనుల కేటాయింపులో న్యాయపరమైన సమస్యలు ఉండేవి. ప్రభుత్వానికి ఆదాయం కూడా సరిగ్గా ఉండేది కాదు. లీజు రెన్యూవల్స్ విషయంలో కూడా జాప్యం జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 10 ఏళ్లలో ఈ రంగాన్ని పూర్తిగా సంస్కరించాం. దీని కారణంగా.. ఇవాళ బొగ్గు గనుల రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగంగా మారిపోయింది.  ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ యాక్ట్) చట్టంలో సవరణలు తీసుకొచ్చాం.
ఎంఎండీఆర్ చట్టం గనుల రంగానికి సరికొత్త దిశను చూపింది. దీంతో మైనింగ్ రంగ ప్రగతి పరుగులు పెడుతోంది. ఈ పురోగతిలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేశామ‌న్నారు. వేలం వ్యవస్థను తీసుకురావడం వల్ల గనుల రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం వొచ్చింది. ఇప్పటివరకు దాదాపు 442 బ్లాకులకు వేలం జరిగింది.ఈ సంస్కరణల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు ఆదాయం వొస్తోంది. 2015 నుంచి ఇప్పటివరకు వేలం (ఆక్షన్ ప్రీమియం) ప్రీమియం, రాయల్టీ రూపంలో దాదాపు 2.69 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు వెళ్లాయి. అదే 2004-2014 మధ్య కాలంలో.. రాష్ట్ర ప్రభుత్వాలకు సమకూరిన ఆదాయం రూ. 55,636 కోట్లు మాత్రమే. ఇదే కాకుండా గనుల పరిసరాల్లో ఉండే వారి సంక్షేమం కోసం 2015లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) పేరిట ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలకు పైగా డబ్బు జమ చేశాం.
దీంతోపాటుగా ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్ మెంట్ యాక్ట్ లో సవరణలు తీసుకొచ్చామ‌ని తద్వారా భారతదేశంలో తొలిసారి ఆఫ్ షోర్ బ్లాక్స్ ల వేలాన్ని నిర్వహించామ‌న్నారు. ఇటీవల రియాద్ లో ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ – 2025 ఇతివృత్తంతో జరిగిన అంతర్జాతీయ సదస్సులో.. వివిధ దేశాల బొగ్గు, గనుల శాఖ మంత్రులందరూ కలిసి.. వాతావరణంలో సానుకూల మార్పు కోసం సుస్థిర మైనింగ్ అవసరంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమావేశంలో భారతదేశ ప్రతినిధిగా తాను పాల్గొన్నాన‌ని, ఇందులో.. గనుల్లో భద్రతతోపాటుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటోమేషన్, మెషీన్ లర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతతో మన దేశంలో వినియోగిస్తున్న తీరును వివరించాన‌ని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరలోనే భారతదేశం క్రిటికల్ మినరల్స్ రంగంలో ఓ గ్లోబల్ డెస్టినేషన్ గా మారుతుందనే విశ్వాసం త‌మ‌కుంద‌ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page