టిటిడిపి పునర్జీవనం కానుందా ?

  • పదేళ్ళుగా మరుగుపడిన నాయకులు, బాబు పర్యటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం
  • స్వాగతానికి హైదరాబాద్‌లో ఏర్పాట్లు

 ( మండువ రవీందర్‌రావు )
ఏపీ ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి  స్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి శ్రేణులు హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడి పది సంవత్సరాలైనప్పటికీ, విభజనకు సంబంధించిన
పలు అంశాలు పెండింగ్‌లో ఉండడంతో వాటిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల ఆరవ తేదీన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. అందుకోసం శుక్రవారమే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకోనున్న చంద్రబాబు నాయుడికి  స్వాగతం పలుకాలని టిటిడిపి సంకల్పించింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నగరానికి విచ్చేయనున్న ఆయనకు  స్వాగతం పలికేందుకు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాల్సిందిగా ఆ పార్టీ పోలిట్‌ ‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్‌, ‌జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సింహరెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు.

దీంతో తెలంగాణలో దాదాపు పదేళ్ళుగా ఉనికిని కోల్పోయిన తెలుగుదేశంపార్టీ పునర్జీవంపోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్డీఏతో జతకట్టినప్పటికీ, తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి తన పూర్వ సహచరుడు కావడంవల్ల పార్టీ తెలంగాణలో పునర్జీవనానికి ఆటంకాలు ఉండకపోవచ్చన్న భావన ఉంది. అంతేగాక ఆరునెలల కింద జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి, ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి టిడిపి లోపాయికారిగా సహకరించిందన్న అభిప్రాయాలున్నాయి. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ టిడిపి ఎదుగుదలకు అడ్డుపడక పోవచ్చనుకుంటున్నారు. దానికితోడు గత పదేళ్ళుగా ఏకఛత్రాదిపతిగా ఏలిన బిఆర్ఎస్‌ ‌పార్టీ   పలువురు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్‌లో చేరుతుండగా, కలిసికట్టుగా వెళ్ళేందుకు మరికొందరు సిద్దమవుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. అదే నిజమైతే ఇక బిఆర్ఎస్‌ ఇప్పట్లో కోలుకునే అవకాశాలులేవు. దీన్ని టిటిడిపి అవకాశంగా తీసుకోబోతోందా అన్న చర్చజరుగుతున్నది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిటిడిపి బిజెపితో పొత్తుపెట్టుకుని 72 స్థానాల్లో పోటీచేసి కేవలం 15 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అలాగే 2018 ఎన్నికల్లో కేవలం 13 స్థానాల్లోనే పోటీచేసి ఖమ్మం జిల్లాకు చెందిన రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత ఆ ఎంఎల్యేలు కూడా టిఆర్ఎస్‌లో కలిసిపోయిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఫలితంగా అప్పటివరకు పార్టీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కాసాని జ్ఞానేశ్వర్‌ ‌పార్టీకి రాజీనామా చేయడంతో ఇక ఆ పార్టీకి ఇక్కడ సారధి కూడా లేకుండా పోయాడు. బీసీ జాతీయ స్థాయి నాయకుడే కాకుండా, మాజీ ఎంఎల్సీకూడా అయిన కాసాని పోటీ చేయని పార్టీకి నాయకుడిగా ఉండడమేంటని ఆయన ఆ పార్టీకి రాజీనామాచేసి బిఆర్ఎస్‌లో చేరిపోయాడు. కాగా వెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా టిటిడిపి తన అభ్యర్ధు లను ఎవరినీ నిలబెట్టలేదు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ ఇక మరుగున పడినట్లే ననుకున్నారు.

కాని, ఎప్పుడైతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ ‌మెజార్టీతో చంద్రబాబు అధికారం చేపట్టాడో, అప్పటినుండి ఆయన తెలంగాణపై దృష్టి సారించాడు. వాస్తవంగా తెలంగాణలో తమ పార్టీ క్యాడర్‌ను ఉత్తేజ పర్చేందుకు 2022 లోనే కొంత ప్రయత్నం చేశారు. డిసెంబర్‌ 21‌న ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీ బహిరంగ సభను ఏర్పాటుచేయడంద్వారా రాబోయే ఎన్నికల్లో నిలువనున్నట్లు సంకేతాలిచ్చారు కూడా. 2018 తర్వాత తెలంగాణలో ఆ పార్టీ అంతపెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమం అదే అని చెప్పవచ్చు. కాని, 2023 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనకపోవడం ఆ పార్టీ క్యాడర్‌కు నిరాశను కలిగించింది. ఎప్పుడైతే ఏపీలో ఘన విజయాన్ని కైవసం చేసుకుందో అప్పటినుండీ తెలంగాణ క్యాడర్‌ ‌మూలన పడేసిన జండాలను దులపడం మొదలు పెట్టింది. అదే తరహాలో జనసేన కూడా సిద్దమవుతున్నట్లు సంకేతాలున్నాయి. ఏపీలో విజయానంతరం కొండగట్టుకు వొచ్చిన ఆ పార్టీ అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌భవిష్యత్‌లో తెలంగాణలో కూడా బిజెపితో కలిసి పనిచేస్తామని ప్రకటించడం అదే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అయింది.

ఇదిలా ఉంటే  తెలంగాణ ఆవిర్భవించి పదేళ్ళు అయిన సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపినట్లుగానే  చంద్రబాబునాయుడు కూడా తెలిపారు. అయితే ఆయన సందేశంలో ఎక్కడ తెలంగాణ అనే పదం లేకుండా జాగ్రత్త పడ్డారు. ‘రెండు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్ళు అయినా, తెలుగు ప్రజలంతా ఒకటిగా, తెలుగుజాతి మేటిగా వెలుగాలంటూ… సాగిన ఆయన సందేశం ‘నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రపంచంలో తెలుగుజాతి నెం. 1 గా అవ్వాల’ లంటూ పూర్తిచేశారు. దీన్నిబట్టి  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని నేటికీ జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు ఏమేరకు ఆమోదిస్తారో చూడాలిమరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page