ఏం ‌మార్పు వొచ్చింది..?

  • ప్రగతి భవన్‌ ‌గడీ బద్ధలు కొట్టడం ఆరంభ శూరత్వమేనా..?
  • విద్యార్థుల ఆందోళన బాట దేనికి సంకేతం..
  • హాస్టళ్లలో విద్యార్థుల ఆహారంలో ఎలుక ప్రత్యక్షం ఏ మార్పు
  • కెసిఆర్‌ ‌బాటలోనే రాజకీయ చేరికలు..మార్పు ఉత్తదేనా…?
  • కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేయాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2014 నుంచి 2023 వరకు రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ సాధించి అధికారంలో కొనసాగిన బిఆర్‌ఎస్‌(‌టిఆర్‌ఎస్‌)‌ను గద్దె దించి కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావాడానికి ప్రముఖంగా వారు ఎత్తుకున్న, విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన ‘మార్పుకావాలి..కాంగ్రెస్‌ ‌రావాలి’ నినాదం పూర్తి స్థాయిలో ఉపయోగపడింది. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్య ధోరణి, తలబిరుసుతనం, ప్రజలను కలువక పోవడం, టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్వడం, కాళేశ్వరం నిర్మాణంపై అనేక అవినీతి ఆరోపణలు, దిల్లీ డ్రగ్స్ ‌కేసులో తనయ కవిత అరెస్టు కావడం, పలు మార్లు టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నా పత్రాల లీక్‌, ‌విద్యా, వైద్య వ్యవస్థల పట్ల ఉదాసీనత వంటి అనేక కారణాలతో కెసిఆర్‌ ‌పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, మార్పు రావాలంటే కాంగ్రెస్‌ ‌రావాలనే నినాదంతో కాంగ్రెస్‌ ఆరు హామీలతో ప్రజల ముందుకు రావడంతో ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. వొచ్చిన రోజునే మార్పును మొదలు పెట్టామన్న సంకేతంగా అప్పటి వరకు సిఎం క్యాంప్‌ అఫీస్‌గా కొనసాగిన, సామాన్యులకు ప్రవేశం లేకుండా ఉన్న ప్రగతి భవన్‌ ఇనుప కంచెలు తొలగించిన వైనం ఆరంభశూరత్వంగానే అనిపిస్తున్నది.

డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తప్ప ఇతర హామీల విషయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయింది. హడావిడిగా అర్హులను నిర్ణయించడానికంటూ ప్రజాపాలన పేరిట హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అనంతరం మొదటగా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని, దాన్ని తాము చక్కబెడుతున్నామని అంచెలంచెలుగా తమ హామీలను తప్పనిసరిగా అమలు చేస్తామని చెబుతూ వొస్తున్నది. ఇంతలో లోక్‌ ‌సభ ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఆ సాకుతో మరో మూడు నెలల కాలం వెళ్లదీశారు. ఇక రైతుల విషయానికొస్తే లోక్‌ ‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా..అనంతరం ఆగస్టు 15 నాటికి రైతు రుణ మాఫీ చేస్తామని పోయిన ప్రతి చోట దేవుణి మీద సైతం ప్రమాణం చేసి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రజలకు మాట ఇచ్చారు. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం నానాతంటాలు పడుతున్నది. ఇక రైతు భరోసా, ఆసరా పెన్షన్లు సమయానికి అందడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతూనే ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ప్రజలు, విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీల పట్ల కాంగ్రెస్‌ ఉదాసీన వైఖరితో వారు ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. అది నిన్న, మొన్న ఉస్మానియా యూనివర్పిటీలో మెగా డిఎస్‌ ‌సహా తమకు ఇచ్చిన హామీల కోసం ఆందోళన బాట పట్టిన విదార్థులను అరెస్టు చేసేదాకా పరిస్థితులు వెళ్లాయంటే ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వంపై అసంతృప్తి మొదలయిందని స్పష్టమవుతున్నది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లు కానీ, జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌కానీ, ఉద్యో నియామాకాలపై స్పష్టమైన కార్యాచణ ప్రణాళిక కానీ విడుదల కాకపోవడంతో విద్యార్థులు అసహనానికి గురి కావడం సహజమే. నీళ్లు, నిధుల, నియామకాల పేరుతో ఉద్యమంలో అగ్ర భాగాన నిలిచి ప్రాణాలకు సైతం తెగించి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో గత పదేళ్ల కెసిఆర్‌ ‌పాలనలో విసిగి వేసారి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సమయంలో తమకు అధికారం ఇస్తే మార్పు తీసుకొస్తామని బల్ల గుద్ది చెప్పిన కాంగ్రెస్‌ ‌గెలుపులో విద్యార్థులు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. అయితే వారు ఆశించిన మార్పు లేక పోవడం, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబించడం వారిని తీవ్ర నిరాశకు లోను చేస్తున్నది. ఇక కార్పొరేటు విద్యా వ్యవస్థ కూడా యథావిధిగా దోపిడీ కొనసాగిస్తుండడం, విద్యా సంవత్సరం మొదలయి నెలన్నర గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం సరి యైన పద్దతి కాదు.

ఇక రాజకీయలు, నైతిక విలువల విషయానికొస్తే గత ప్రభుత్వం నడిచిన దారిలోనే ఈ ప్రభుత్వం పోకడ స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకు ఇటీవల కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరికలే ప్రత్యక్ష సాక్ష్యం. 2014లో మొదటి దఫా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చినప్పుడు 68 మంది ఎంఎల్‌ఏలతో అధికారంలోకి వొచ్చినప్పుడు తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుతున్నదని సాకు చెప్పి రాజ్యాంగ స్ఫూర్తికి, నైతికతకు తిలోదకాలిచ్చి ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించి, ఏకంగా మంత్రి పదవులను కట్టబెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో వోటుకు నోటు కేసు బయటపడడం కూడా కెసిఆర్‌కు ఈ విషయంలో మరింత తెగించడానికి తోడ్పడింది. కాగా ఇప్పుడు అదే కారణాన్ని చూపుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా తాము ప్రజలకు ఇచ్చిన ‘మార్పు’ వాగ్దానాన్ని తుంగలో తొక్కి ఇష్టా రీతిన చేరికలను ప్రోత్సహించే పనిలో పడింది. ఏ ప్రభుత్వ పాలనపై విసుగొచ్చి, ఆ పార్టీని తిరస్కరించి మార్పును కోరి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టారో ఆ పార్టీలో నాయకులు తమ స్వార్థ ప్రయోజనా కోసం తిరిగి అధికార పార్టీలోకి దూకడం ప్రజలకు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదు. ఇక కొత్తగా మరొక అంశం మెజారిటీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. మొన్న ఎపిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో హల్‌చల్‌ ‌చేయడం..అందుకు రాజకీయ నాయకులు సైతం వత్తాసు పలకం తెలంగాణ ప్రజలకు ఎంత మాత్రం రుచించే విషయం కాదు. ఇదే పంథా కొనసాగితే భవిష్యత్తులో అన్ని పార్టీలకు జీవం పోసినట్లే.

ఇక ఇటీవల ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల ఆహారంలో బల్లులు, బొద్దింకలు, ఏకంగా ఎలుకలు దర్శనమివ్వడం క్షమించరాని విషయం. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహారం విషయంలో నిర్వహకులు ఇంత నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండడం ఎంత మాత్రం సహించే విషయం కాదు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో కఠిన చర్యలు చేపట్టక పోతే ప్రజలు కోరుకున్న మార్పు కనిపించనట్టే. ఇక ప్రభుత్వం అదే ధోరణిలో పాలన కొనసాగిస్తున్నదనే దానికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయాన్ని మరొక ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు. పదహారేళ్ల క్రితం 2008లో ఇదే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రభుత్వం జవహర్‌లాల్‌ ‌నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్‌ ‌సొసైటీకి కేటాయించిన, జర్నలిస్టులు అప్పటి మార్కెట్‌ ‌ధరను చెల్లించి స్వంతం చేసుకున్న 70 ఎకరాల స్థలంలో, కోర్టు ఆదేశాలిచ్చినా, కెసిఆర్‌ ‌వ్యతిరేక వైఖరితో కేవలం 32 ఎకరాలు మాత్రమే సొసైటీకి అప్పగించింది. ఈ అంశంపై  2022 ఆగస్టులో ఆనాటి చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతత్వంలోని ధర్మాసనం జర్నలిస్టులకు అనుకూలంగా స్పష్టమైన తీర్పునిచ్చినా కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఖాతరు చేయలేదు. అదే విషయాన్ని ఎన్నికల ముందే అప్పుడు పిసిసి చీఫ్‌గా ఉన్న రేవంత్‌ ‌రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన తాము అధికారంలోకి రాగానే భూమిని జర్నలిస్టులకు కేటాయిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ఆ విషయాన్ని మ్యానిఫెస్టోలో సైతం ప్రస్తావించారు. అధికారంలోకి వొచ్చిన తర్వాత కూడా హామీ ఇస్తూనే వొస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ భూమిని జర్నలిస్టుల సొసైటీకి కేటాయించ లేదు.

ఏ ప్రభుత్వ మైనా అధికారంలోకి రాగానే అన్ని విషయాలను చక్కబెట్టడం సాధ్యం కాదు. అయితే ఆర్థిక అంశాలకు ముడిపడని, పాలనా, నిర్వహణకు సంబంధించిన అనేక అంశాల విషయంలో సంస్కరణలు చేపట్టడం అంత సాధ్యం కాని పని కాదు. ప్రజలు కోరుకున్నది కూడా అదే. కానీ ఆరు నెలల రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంతోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పాలన ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిపిండం లేదు. చాలా కాలం తర్వాత కేంద్రంలో ప్రతిపక్ష హోదాతో పాటు, బలమైన ప్రతిపక్షంగా అవతరించిన అనుకూల వాతావణంలో కేంద్రంలో అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవాలన్నా…ఇప్పటికైనా ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సాలన కొనసాగిస్తారని ఆశిద్దాం.

-వి. రామ్మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *