– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– 150 ఎకరాల్లో నివసిస్తున్న 15 వేల కుటుంబాల జోలికి రావద్దని హెచ్చరిక
– మిగిలిన 400 ఎకరాలను ప్రజా ప్రయోజనాలకు, లంగ్ స్పేస్‌గా అభివృద్ధి చేయాలి
– ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో గల 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. మియాపూర్‌లోని ఎం.ఏ.నగర్, ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, దీప్తిశ్రీ నగర్ కాలనీలలో ఆయన బుధవారం పర్యటించి, తమ నివాసాలను కోల్పోతామన్న భయాందోళనలో ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ 550 ఎకరాల భూమిపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను వేలం వేయాలని చూడటం దారుణమన్నారు. ఇందులో దాదాపు 150 ఎకరాల భూమిలో 1983 నుండే అధికారిక రిజిస్ట్రేషన్లు, హెచ్ఎండీఏ అప్రూవ్ డ్ లేఅవుట్లు, బ్యాంకు రుణాల ద్వారా మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే జీవో నంబర్ 58, 59, 60ల కింద పేదలు క్రమబద్ధీకరించుకున్న 68 గజాల స్థలాలు, బస్తీలలో దాదాపు 10 నుండి 15 వేల కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయన్నారు. 30 ఏళ్లకు పైగా వారి స్వాధీనంలో ఉన్న ఈ 150 ఎకరాల భూమి, ఇళ్లు కచ్చితంగా ఆయా కుటుంబాలకే చెందాలని, ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకూడదని ఆయన డిమాండ్ చేశారు. మిగిలిన 400 ఎకరాల భూమిని 2,500 నుండి 5,000 గజాల ప్లాట్లుగా విభజించి బహిరంగ వేలంలో అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రామచందర్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని విమర్శించారు. పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ‘లంగ్ స్పేసెస్’ (స్వచ్ఛమైన గాలినిచ్చే ఖాళీ ప్రదేశాలు) ఎంతో అవసరమని అన్నారు. అందువల్ల ఈ 400 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టకుండా పార్కులు, ప్లే గ్రౌండ్స్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటల్స్ నిర్మాణం వంటి ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని స్థానికుల పక్షాన బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమం కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించిన ఆయన ప్రజల హక్కులు, నివాసాలను కాపాడేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వ భూముల వేలాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, స్వయంగా తానే మొదటి సంతకం చేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రవి కుమార్ యాదవ్, మహిపాల్, తదితరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





