తెలంగాణ‌కు విస్త‌రించండి

– ముంబయి పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
– ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారితో పెట్టుబడుల ప్రక్రియకు సహకారం

ముంబయి, నవంబరు 18 : ‘మీ ప్రధాన కార్యాలయం ముంబయిలోనే ఉంచుకోండి.. తయారీ, వ్యాపార విస్తరణ, అభివృద్ధి కార్యకలాపాలను తెలంగాణలో చేపట్టండి’ అని ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముంబయి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ, సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు. ముంబయిలోని వర్లీలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సహకారంతో తెలంగాణ ప్రభుత్వం బుధవారం నిర్వహించిన ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ రోడ్‌షోలో మంత్రి ప్రసంగించారు. సీఐఐ మహారాష్ట్ర రాష్ట్ర మండలి ఉపాధ్యక్షురాలు ఆర్తి కూచిభట్ల తెలంగాణ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. రెండు ప్రాంతాల మధ్య దశాబ్దాలుగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయంటూ తెలంగాణ, ముంబయి మధ్య తరతరాలుగా కొనసాగుతున్న అనుబంధాన్ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు గురు్త‌ చేశారు. తెలంగాణకు చెందిన కార్మికులు, చేతివృత్తులవారు, వ్యాపారవేత్తలు ముంబయి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముంబయి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామ‌ని శ్రీధర్‌బాబు అన్నారు. సాంకేతిక రంగం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), డేటా సెంటర్లు, ఔషధ పరిశ్రమలు, వస్త్రాలు, దుస్తుల తయారీ, మీడియా, వినోద రంగాల్లో తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను వినియోగించుకుని వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవాలని ముంబయి పారిశ్రామికవేత్తలకు సూచించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026లో పాల్గొనాలని ఆహ్వానించారు. పెట్టుబడులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే టీజీ-ఐపాస్‌ విధానాన్ని వివరించారు. ముంబయి నుంచి తెలంగాణకు వచ్చే ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారిని కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. పెట్టుబడులపై తొలి చర్చల నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఆదాయం ఆర్జించే దశ వరకు ఆ అధికారి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులకు అన్ని దశల్లో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముంబయిలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని శ్రీధర్‌బాబు చెప్పారు. ముంబయిలోని ఆర్థిక, కార్పొరేట్‌ రంగ బలాన్ని తెలంగాణలోని తయారీ సామర్థ్యాలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అవకాశాలతో అనుసంధానించడం ద్వారా పరస్పర ప్రయోజనాలు సాధించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) వైస్‌ ఛైర్మన్‌, ఎండీ శశాంక్‌, ఇన్వెస్ట్‌ తెలంగాణ సీఈవో బి.అజిత్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి తెలంగాణ ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు ముంబయికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడి ప్రతిపాదనలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు, పరస్పర భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *