‘ఇందిరమ్మ బీమా’ అమలుకు పక్కా ఏర్పాట్లు

– కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 18: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకం అమలుపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయ‌న బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శి గౌర‌వ్ ఉప్ప‌ల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, పౌర సరఫరాల కమిషనర్ నాగిరెడ్డి, కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన, ఐ.టి శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజ‌య్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీతోపాటు అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వివిధ వర్గాలకు అమలులో ఉన్న వివిధ బీమా పథకాలు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం గొడుగు కిందకు వస్తాయని స్పష్టం చేశారు. వివిధ శాఖల ద్వా రా ప్రస్తుతం ఉన్న నేతన్న, గౌడ, కార్మిక, మత్సకారులకు అమలులో ఉన్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకురావడం ద్వారా రూ.5ఐదు లక్షలకు పెరుగుతాయని అన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ ఈ పథకంలో నమోదు చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు అన్ని మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. పథకం మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటిస్తూ నమోదు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. దాదాపు నెల రోజులపాటు కొనసాగే ఈ నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ బీమా నమోదుకు ప్రత్యేక యాప్ కూడా రూపొందిస్తున్నామని, ఆన్-లైన్ లోనూ నమోదుకు దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *