ఏసీబీ వలలో పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్

– హత్య కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్
– రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రవీందర్
– పక్కా వ్యూహంతో దాడి చేసిన కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి బృందం

పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 18 : రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి పంజా విసిరారు. పెద్దపల్లి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) డొంకెన రవీందర్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్సీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం బుధవారం పక్కా వ్యూహంతో వలపన్ని ఆయనను అదుపులోకి తీసుకుంది. న్యాయస్థానంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం 2023లో ధర్మారం మండల పరిధిలోని రచ్చపల్లిలో చోటుచేసుకున్న భూ వివాదం ఘర్షణకు దారి తీసి ఒక్కరు మృతిచెందారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో నలుగురిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పెద్దపల్లి కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి వారికి లబ్ది చేకూరుస్తానని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

పక్కా వ్యూహంతో వల పన్నిన ఏసీబీ

బాధితుడి ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అధికారుల సూచనల మేరకు
బాధితుడు పీపీ రవీందర్ ను సంప్రదించి రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. పథకం ప్రకారం పెద్దపల్లిలోన నిర్ణయించిన ప్రదేశంలో బాధితుడి నుంచి పీపీ రవీందర్ రూ.1.50 లక్షల నగదు తీసుకుంటుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. కేసు సంబంధించిన ఇతర పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కోర్టు పరిధిలోనే ఇటువంటి ఘటన జరగడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *