క‌ష్ట‌ప‌డితేనే హైద‌రాబాద్ ద‌క్కేది

– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు దిశానిర్దేశం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : మనం కష్టపడకపోతే రేపు హైదరాబాద్ మనది కాకుండా పోతుందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు పార్టీ శ్రేణుల‌నుద్దేశించి అన్నారు. హైదరాబాద్ మేయర్ పీఠంతోపాటు రాష్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావాలనే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. బీజేపీ సిటీ కార్యాల‌యంలో రామ‌చందర్ రావు అధ్యక్షతన బుధ‌వారం కీలక సమావేశం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ డబ్బు, మాయమాటలతో, ప్రలోభాలతో కుమ్మక్కై బీజేపీ గెలవాల్సిన సీట్లను దక్కించుకుందని ఆరోపించారు. ఇప్పుడు మన సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 20 శాతం కమీషన్లకు పాల్పడితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 నుండి 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మోసం చేయడం, దగా చేయడమే ఈ రెండు పార్టీల నైజమని మండిపడ్డారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు 512 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీల నీరు మాత్రమే సరిపోతుందని సంతకం చేసి తీరని ద్రోహం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని, ప్రజలంతా బీజేపీ వైపే ఆశగా చూస్తున్నారని అన్నారు. రానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అని మూడు కార్పొరేషన్లుగా విభజించిందని, రానున్న ఎన్నికల్లో ఈ మూడింటిలోనూ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా డివిజన్ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, భవిష్యత్ ప్రయాణానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఇందులో భాగంగా విస్తృత స్థాయిలో ఉద్యమాలు, పోరాటాలు, సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహా పాదయాత్ర దిగ్విజయమైందని, ఈ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపినందుకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయ‌న స్వయంగా అభినందనలు తెలిపారంటూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు రామ‌చంద‌ర్‌రావు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఏర్పడేది కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమేనని ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎన్నికల ఇన్‌చార్జి ఆశిష్ షెలార్, రాష్ట్ర సహ ఇన్‌చార్జి అభయ్ పాటిల్, రాజ్యసభ సభ్యుడు డాక్ట‌ర్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ భేటీకి డివిజన్ అధ్యక్షులు, తొమ్మిది జిల్లాల‌ అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, జిల్లా పదాధికారులు 300మంది హాజ‌ర‌య్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *