– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16: రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 జాతీయ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల్లో సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లను ఆదేశించారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జూమ్ ద్వారా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్లకు, అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. హైదరాబాద్ తోపాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ లలో సుమారు 8,000 మంది క్రీడాకారులు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్న ఈ క్రీడా సంబరాలకు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఖేలో ఇండియా క్రీడలపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ముఖ్యమైన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, బెలూన్లతో క్రీడల మస్కట్, లోగోలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట తదితర రైల్వే స్టేషన్లు, నగరంలోని సెంట్రల్ బస్ స్టేషన్లలో ప్రత్యేక ప్రచార ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా టార్చ్ ర్యాలీలను కూడా నిర్వహించాలని సూచించారు. క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంతోపాటు, క్రీడాకారుల రవాణా కోసం, పాఠశాలల నుంచి విద్యార్థులను క్రీడా వేదికలకు తీసుకొచ్చేందుకు తగిన రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. క్రీడాకారులకు నాణ్యమైన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించాలని, విద్యార్థులు, క్రీడాకారుల భాగస్వామ్యంతో ఈ క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ప్రముఖ క్రీడాకారులు, విశిష్ట వ్యక్తులు, ముఖ్యంగా మంత్రి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ తదితర క్రీడా ప్రముఖుల ద్వారా విద్యార్థులకు ప్రేరణ కల్పించేలా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతోపాటు, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్ర యువజన, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, క్రీడా శాఖ ఎండీ సోని బాలాదేవి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, డైరెక్టర్ (మీడియా అండ్ కమ్యూనికేషన్స్) శ్రీరామ్ కర్రి, జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్లు, ఆయా జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





